పాల్వంచ, ఏప్రిల్ 26:ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే బీఆర్ఎస్సే అధికారంలోకి వస్తుందని కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. గత పదేళ్ల కేసీఆర్ పాలన తెలంగాణకు స్వర్ణయుగంగా గడిచిందని గుర్తుచేసుకుంటున్నారని, గత ఎన్నికల్లో ఆయనను ఎందుకు ఓడించుకున్నామానని మదనపడుతున్నారని అన్నారు. కేసీఆర్ మళ్లీ రావాలని తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్నారని అన్నారు.
పాల్వంచ ప్రెస్‌క్లబ్‌లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హామీలు అమలుచేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు చీదరించుకుంటున్నారని అన్నారు. అలాగే, 42 ఏళ్ల తన రాజకీయ జీవితంలో రేవంత్‌రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని ఎన్నడూ చూడలేదని అన్నారు. సీఎం హోదాలో ఉండి అత్యంత నీచమైన భాష మాట్లాడుతూ ప్రజల్లో పలుచనయ్యారని ఆరోపించారు. మంత్రులు కూడా ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, ఒక్కొక్కరూ ఒక్కో స్టేట్మెంట్ ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
మంత్రివర్గ విస్తరణ చేసే పరిస్థితి కూడా లేదని, ఒకవేళ విస్తరణ చేపడితే పరిణామాలు ఏ విధంగా ఉంటాయోనని సీఎం భయపడుతున్నారని ఎద్దేవాచేశారు. రజతోత్సవ సభకు తరలివెళ్లేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. ఆదివా రం ఉదయం 8 గంటలకు కొత్తగూడెంలోని టేకులపల్లి క్రాస్‌రోడ్డులోని గులాబీ జెండా ఎగురవేసి భారీ సంఖ్యలో వాహనాల్లో శ్రేణులను తోడ్కొని తాను ఎల్కతుర్తి బయలుదేరుతున్నట్లు చెప్పారు. సభ ముందు భాగాన కూర్చొని కేసీఆర్ ప్రసంగాన్ని వినేందుకు ప్రజలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు కిలారు నాగేశ్వరరావు, వనమా రాఘవేందర్రావు, రాజుగౌడ్, శ్రీరామ్మూర్తి, విశ్వనాథం, కనకేశ్, మల్లెల రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.