Ball Badminton | బాల్ బ్యాడ్మింటన్‌లో దూసుకెళ్తున్న బోనకల్లు విద్యార్థులు.. వారికి స్ఫూర్తి ఈయనే!
Ball Badminton | ‘మనం ఒక్కరం తలుచుకుంటే ఏమవుతుంది..?’ అని నిరాశావాదంతో ఆలోచిస్తారు కొందరు.. కానీ.. ‘మనం వేసే ఒక్క అడుగైనా కొంతమందికైనా వెలుగు బాట అవుతుంది..’ అని ఆలోచిస్తారు ఆశావహులు. అలాంటి కోవకు చెందిన వారే ముష్టికుంట్లకు చెందిన అమరేశు లింగయ్య.
Ball Badminton | ‘మనం ఒక్కరం తలుచుకుంటే ఏమవుతుంది..?’ అని నిరాశావాదంతో ఆలోచిస్తారు కొందరు.. కానీ.. ‘మనం వేసే ఒక్క అడుగైనా కొంతమందికైనా వెలుగు బాట అవుతుంది..’ అని ఆలోచిస్తారు ఆశావహులు. అలాంటి కోవకు చెందిన వారే ముష్టికుంట్లకు చెందిన అమరేశు లింగయ్య. ఆయన స్వతహాగా క్రీడాకారుడు. బాల్ బ్యాడ్మింటన్ అంటే ఆయనకు అమితమైన ప్రేమ. క్రీడాకారుడిగా ఎన్నో అవార్డులు, బహుమతులు అందు కున్నారు. అయినా.. ఆయన దాహం తీరలేదు.. తాను ఎదగడమే కాక మరికొందరు బాలబాలికలను క్రీడాకా రులుగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. మరికొందరు మిత్రులతో కలిసి 1996లో బోనకల్లులో ‘శాంతి స్నేహ యూత్’ ఏర్పాటు చేసి ఇప్పటి వరకు ఎంతోమందిని బాల్‌బ్యాడ్మింటన్ క్రీడాకారులుగా తీర్చిదిద్దారు. ఇక్కడ తర్ఫీదు పొందిన వారెందరో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో సత్తాచాటారు. ఆ విజయ ప్రస్థానంపై ‘నమస్తే’ ప్రత్యేక కథనం.
బాల్ బ్యాడ్మింటన్ క్రీడలో బోనకల్లు మండల విద్యార్థులు అద్భుతంగా రాణిస్తున్నారు. పేదరికం వెనక్కి లాగుతున్నప్పటికీ చదువుతోపాటు ఆటల్లోనూ అబ్బురపరుస్తున్నారు. మంచి క్రీడానైపుణ్యంతో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహిస్తున్నారు. 1996 నుంచి నేటివరకు రాష్ట్ర, జాతీయ సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ క్రీడాపోటీల్లో ఈ ప్రాంతానికి చెందిన క్రీడాకారులు అత్యంత ప్రతిభ చాటారు. ఇంటర్నేషనల్ పోటీల్లో జాతీయ స్టార్ఆఫ్ ఇండియాగా తొమ్మిది మంది గుర్తింపు సాధించి అనేక పతకాలు సొంతం చేసుకున్నారు. ఇదే ఉత్సాహంతో ఈ నెల చివరిలో జరిగే పోటీలకు సిద్ధమవుతున్నారు.
మధిర, డిసెంబర్ 16 : ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని బోనకల్లు మండలానికి చెందిన క్రీడాకారులు బాల్ బ్యాడ్మింటన్ ఆటలో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారు. మండలంలోని ముష్టికుంట్ల గ్రామానికి చెందిన అమరేషు లింగయ్య అనే క్రీడాకారుడు 1996లో బాల్ బ్యాడ్మింటన్ క్రీడపై మక్కువతో గ్రామస్తులతో కలిసి ‘శాంతిస్నేహ యూత్’ ఏర్పాటు చేశారు. ఇందులో కె.వీరయ్య, పారుపల్లి సురేశ్, చావా వెంకటేశ్వరరావు మరికొంతమంది కలిసి క్రీడాకారులను తయారుచేయడం ప్రారంభించారు. శాంతిస్నేహ యూత్ ఆధ్వర్యంలో ఎంతోమంది క్రీడాకారులను బాల్ బ్యాడ్మింటన్‌లో అద్భుత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దారు. ఈ విధంగా తయారైన ఈ ప్రాంతంవారు 1996 నుంచి 2018 వరకు రాష్ట్ర, జాతీయ సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ క్రీడాపోటీల్లో పాల్గొని ప్రతిభ చాటారు. ఇంటర్నేషనల్ పోటీల్లో 9మంది జాతీయ స్టార్ఆఫ్ ఇండియాగా ఎంపికై అనేక పతకాలు సొంతం చేసుకున్నారు. 2021-22లో కర్ణాటక రాష్ట్రంలోని అల్వాలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో ట్రోఫీని కైవసం చేసుకున్నారు. 2022 డిసెంబర్ 9, 10, 11 తేదీల్లో గోదావరిఖనిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో, డిసెంబర్ 24 నుంచి 28వ తేదీ వరకు కేరళ రాష్ట్రంలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పురుషులు, మహిళల జట్లు అద్భుతంగా ఆడారు. ఇప్పటివరకు శాంతిస్నేహ యూత్ ద్వారా 300 మంది బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులను తీర్చిదిద్దారంటే అతిశయోక్తి కాదు.
అద్భుత క్రీడాకారులు వీరే..
☞ బాల్ బ్యాడ్మింటన్‌లో భూక్యా రమేశ్ అత్యంత ప్రతిభ కనబరిచి స్టార్ ఆఫ్ ఇండియా క్రీడాకారుడిగా ఎంపికయ్యాడు. 2006 అక్టోబర్ 12 నుంచి 15వ తేదీ వరకు ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో 26వ సబ్ జూనియర్ జాతీయ పోటీల్లో ఆడారు. ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్నారు.
☞ 2006లో మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు జూనియర్ జాతీయ పోటీల్లో భూక్యా ఉమ అత్యంత ప్రతిభ కనబరిచి స్టార్ ఆఫ్ ఇండియా క్రీడాకారిణిగా మన రాష్ట్రం నుంచి మొట్టమొదటిసారిగా ఎంపికైంది. 2013లో నేపాల్‌లో జరిగిన పోటీల్లో పాల్గొని అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఎంఎస్సీ బీఎడ్ పూర్తిచేసి హైదరాబాద్‌లో పోస్టల్‌శాఖలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించింది.
☞హర్యానా రాష్ట్రంలో డెహ్రాడూన్‌లో 2007 జూన్ 1 నుంచి 4వ తేదీ వరకు జరిగిన సబ్ జూనియర్ పోటీల్లో జరపల శివకృష్ణ స్టార్ ఇండియాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. పీఈటీ ట్రైనింగ్ పూర్తి చేసి మండల కేంద్రంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ప్రస్తుతం పీఈటీ కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
☞తమిళనాడులోని చెన్నైలో 2008 మార్చిలో జరిగిన సబ్ జూనియర్ పోటీల్లో, ముంబాయిలో 2012 డిసెంబర్లో నూనవత్ బుజ్జి స్టార్ ఆఫ్ ఇండియాగా ఎన్నికై రెండుసార్లు గుర్తింపు తెచ్చుకున్నది. ఖమ్మంలోని ప్రైవేట్ కళాశాలలో టీటీసీ ట్రైనింగ్ చేసి టీచర్‌గా పనిచేస్తున్నది.
☞హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రంలో 2009 మే 9 నుంచి 13వ తేదీ వరకు జరిగిన సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొని జడపల తిరుపతమ్మ జాతీయస్థాయి సెలెక్టర్ల ద్వారా స్టార్ ఆఫ్ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు తెచ్చుకున్నది.
☞ పంజాబ్‌లోని అమృతసర్‌లో 2009లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో ఆలిండియా బెస్టు ప్లేయర్‌గా బానోత్ గోపాల్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.
☞ చెన్నైలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో 2011 జనవరిలో జరిగిన పోటీల్లో భూక్యా నరేశ్ స్టార్ ఆఫ్ ఇండియాగా పేరు సంపాదించాడు.
☞2009 కడపలో, 2010 రాజస్థాన్ రాష్ట్రంలోని డుల్పుర్లో, 2012 కర్ణాటక రాష్ట్రంలోని తుమ్కురలో జరిగిన సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో నూనావత్ గోపి స్టార్ఆఫ్ ఇండియాగా నిలిచాడు. మూడుసార్లు స్టార్ ఆఫ్ ఇండియా అవార్డును 13ఏండ్లకే సాధించి కీర్తి గడించాడు.
☞తిరుపతిలో 2013 డిసెంబర్ 5 నుంచి 15వ తేదీ వరకు జరిగిన సబ్ జూనియర్ విభాగంలో బానోత్ గోపి ఆలిండియా బెస్టు ప్లేయర్‌గా స్టార్ఆఫ్ ఇండియా అవార్డు దక్కించుకున్నాడు.
☞ తమిళనాడు రాష్ట్రంలోని మధురై ప్రాంతంలో 2014లో అక్టోబర్ 1 నుంచి 5వ తేదీ వరకు జరిగిన జాతీయస్థాయి పోటీల్లో భూకా దుర్గాప్రసాద్ స్టార్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఈ ఏడాది పోటీలకు సిద్ధమైన క్రీడాకారులు
బోనకల్లు కేంద్రంగా బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. 2023 డిసెంబర్లో జరిగే పోటీలకు పరుగులు తీస్తున్నారు. గోదారిఖనిలో జరిగే పోటీల్లో టైటిల్‌ను సొంతం చేసుకునేందుకు మహిళ జట్టు తహతహలాడుతున్నది. డిసెంబర్ 22 నుంచి 24వ తేదీ వరకు హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా జట్టు నుంచి సమాయత్తమవుతున్నారు. డిసెంబర్ 14 నుంచి 17వ తేదీ వరకు శిక్షణ పొందుతున్నారు.
కోచ్‌గా రాణిస్తున్న లింగయ్య
బోనకల్లు మండలం నుంచి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ బాల్ బాడ్మింటన్ క్రీడాకారులను తయారుచేయడంలో ముష్టికుంట్ల గ్రామానికి చెందిన అమరేషు లింగయ్య కృషి మరువలేనిది. మండల కేంద్రంలో ఆడియో రికార్డింగ్ సెంటర్ నడుపుతూ వచ్చిన కొద్ది డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటున్న లింగయ్య మంచి బాల్ బ్యాడ్మింటన్ కోచ్‌గా పేరు సంపాదించుకున్నారు. పేద కుటుంబంలో పుట్టినప్పటికీ తన ఇద్దరు కూతుర్లు ఉష, నిరోషకు బాల్ బ్యాడ్మింటన్‌లో తర్ఫీదు ఇచ్చారు. వీరితోపాటు అనేకమంది విద్యార్థులను బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!





