ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 21: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సన్నద్ధం కావాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు పిలుపునిచ్చారు. వ్యవసాయ, రెవెన్యూ, ఆర్థిక శాఖలకు చెందిన ముగ్గురు మంత్రులు జిల్లా నుంచి ఉన్నప్పటికీ రైతులకు ఆశించిన మేర న్యాయం జరగడం లేదని విమర్శించారు. మండలంలోని ఆరెకోడు గ్రామంలో ఏఐకేఎస్ (తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం) మండల మూడో మహాసభ శుక్రవారం జరిగింది.
తొలుత ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సంఘం జెండాను రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దొండపాటి రమేశ్ ఆవిష్కరించారు. ఏలూరి భాస్కర్, మామిడి సుదర్శన్‌రెడ్డిల అధ్యక్షతన జరిగిన సభలో హేమంతరావు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ, రైతు భరోసా, పంటల బోనస్ పథకాలు సగానికి సగం మంది రైతులకు అందడం లేదని అన్నారు.
ఖమ్మంలో మిర్చిబోర్డు ఏర్పాటు చేయాలని, రైతు సంక్షేమ పథకాలు అమలు చేయాలనే తీర్మానాలను ప్రవేశపెట్టారు. సంఘం నాయకులు మహ్మద్ మౌలానా, గోవిందరావు, దండి సురేశ్, తాటి వెంకటేశ్వర్లు, శంకరయ్య, వీరభద్రం, పుచ్చకాయల సుధాకర్, రాంమూర్తి తదితరులు పాల్గొన్నారు. అనంతరం 21 మందితో సంఘం నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా మామిడి సుదర్శన్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా రామకృష్ణ, ప్రభాకర్, కార్యదర్శిగా ఏలూరి భాస్కర్ ఎన్నికయ్యారు.