బూర్గంపహాడ్, ఏప్రిల్ 27 : బూర్గంపహాడ్ మండల వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు శుక్రవారం అంబరాన్నంటాయి. పారిశ్రామిక ప్రాంతమైన సారపాకతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో శ్రీరామ నవమిని పురస్కరించుకుని పలు గ్రామాల్లోని ఆలయాల్లో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణాన్ని అర్చకులు, పూజారులు కన్నుల పండుగగా నిర్వహించారు. సారపాకలోని సాకేతపురి ఆంజనేయస్వామి ఆలయంలో, శ్రీ సత్యనారాయణస్వామి ఆలయంలో, శివాలయాలతో పాటు గాంధీనగర్ కనకదుర్గమ్మ ఆలయం, శ్రీరాంపురంలోని ఆంజనేయస్వామి, నాగినేనిప్రోలు రెడ్డిపాలెం, బూర్గంపహాడ్, సంజీవరెడ్డిపాలెం, మోరంపల్లిబంజర్ ఆలయాల్లో ఆలయకమిటీ నిర్వాహకులు శ్రీసీతారాముల కల్యాణాన్ని వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ఘనంగా నిర్వహించారు.
రాములోరి కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఉదయం నుంచే ఆలయాలకు చేరుకుని పూజలు నిర్వహించిన అనంతరం మధ్యాహ్న సమయంలో స్వామివారి కల్యాణాన్ని తిలకించి పునీతులయ్యారు. కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులకు సారపాకకు చెందిన వ్యాపార సంస్థలు, కుల సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, స్వచ్ఛంద సంస్థలు మజ్జిగ, పానకం, పులిహోర, మంచినీరు ప్యాకెట్లను అందించారు. దీంతో మండలంలో శ్రీరామనవమి వేడుకలతో సందడి వాతావరణం నెలకొన్నది.

బూర్గంపహాడ్‌లో వాడవాడలా శ్రీ సీతారాముల కల్యాణం