ఆరని జ్ఞాపకాల దీపాలు.. సమాధుల చెంత దీపావళి వెలుగులు
దీపావళి అంటే చీకటిని పారద్రోలే దీపాల వెలుగులు. ఇంటిల్లిపాదీ కలిసి జరుపుకునే ఆనందాల పండుగ. కానీ సింగరేణి ప్రాంతంలో దీపావళికి మరో ప్రత్యేకమైన భావోద్వేగం ఉంది. ఇక్కడ వెలిగే ప్రతి దీపం వెనుక ఓ జ్ఞాపకం. ప్రతి సమాధి వెనుక ఓ కుటుంబ కథ. ప్రతి కుటుంబం గుండెల్లో చెరిగిపోని ఓ ఆత్మీయత దాగి ఉంది.
– బొగ్గు గనుల్లో ప్రాణాలర్పించిన కార్మికులకు అపురూప నివాళి
రుద్రంపూర్, నవంబర్ 07 : దీపావళి అంటే చీకటిని పారద్రోలే దీపాల వెలుగులు. ఇంటిల్లిపాదీ కలిసి జరుపుకునే ఆనందాల పండుగ. కానీ సింగరేణి ప్రాంతంలో దీపావళికి మరో ప్రత్యేకమైన భావోద్వేగం ఉంది. ఇక్కడ వెలిగే ప్రతి దీపం వెనుక ఓ జ్ఞాపకం. ప్రతి సమాధి వెనుక ఓ కుటుంబ కథ. ప్రతి కుటుంబం గుండెల్లో చెరిగిపోని ఓ ఆత్మీయత దాగి ఉంది. భౌతికంగా తమ మధ్య లేకపోయినా.. జ్ఞాపకాలలో ఎప్పటికీ జీవించే తమ కుటుంబ సభ్యుల సమాధుల వద్ద దీపాలు వెలిగిస్తూ దీపావళి జరుపుకోవడం ఇక్కడి ప్రత్యేక సంప్రదాయం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్, గౌతంపూర్, ధన్‌బాద్, రామవరం ప్రాంతాల్లో ఈ సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోంది. దీపావళి పండుగకు కొన్ని రోజుల ముందే కుటుంబ సభ్యులు తమ ఆత్మీయుల సమాధుల వద్ద పేరుకుపోయిన చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు, గడ్డిని తొలగించి శుభ్రం చేస్తారు. సమాధులకు రంగులు వేసి అందంగా ముస్తాబు చేస్తారు. పండుగ రోజున కొత్త దుస్తులు ధరించి కుటుంబ సభ్యులంతా సమాధుల వద్దకు చేరుకుంటారు. మరణించిన తమ ఆత్మీయులకు ఇష్టమైన ఆహార పదార్థాలను తయారుచేసి సమర్పిస్తారు. దీపాలు వెలిగించి, బాణసంచా కాల్చుతూ వారితో గడిపిన మధుర క్షణాలను గుర్తుచేసుకుంటారు. ఒకప్పుడు తమతో కలిసి పండుగ జరుపుకున్న వారు నేడు కనిపించకపోయినా.. వారి జ్ఞాపకాలతోనే పండుగను జరుపుకుంటారు. ఆ సమయంలో స్మశానవాటికలు సైతం దీపాల వెలుగులతో ఓ ప్రత్యేకమైన వాతావరణాన్ని సంతరించుకుంటాయి.

ఆరని జ్ఞాపకాల దీపాలు.. సమాధుల చెంత దీపావళి వెలుగులు
బొగ్గు గనుల్లో ఆగిన ప్రాణాలు.. కుటుంబాల గుండెల్లో చెరిగిపోని జ్ఞాపకాలు
ఈ విభిన్న సంప్రదాయం వెనుక సింగరేణి బొగ్గు గనుల చరిత్ర, కార్మికుల త్యాగాలు దాగి ఉన్నాయి. గతంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, భద్రతా సౌకర్యాలు అందుబాటులో లేని పరిస్థితుల్లో భూగర్భ గనుల్లో తరచూ ప్రమాదాలు సంభవించేవి. కుటుంబాల సంతోషం కోసం, పిల్లల భవిష్యత్తు కోసం బొగ్గు గనుల్లోకి దిగిన ఎంతోమంది కార్మికులు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. కుటుంబానికి అండగా నిలవాల్సిన వ్యక్తులు అర్ధంతరంగా దూరమై ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చారు. ఆనాటి నుండి మొదలైన ఈ సంస్కృతి నేటికి కొనసాగుతూనే ఉంది. వారు గనిలో మరణించిన లేక సహజ మరణం పొందిన వారిని కూడా స్మరించుకుంటూనే ఉంటున్నారు. అలా తమ కుటుంబాల కోసం శ్రమిస్తూ ప్రాణాలర్పించిన కార్మికులను ఏడాదిలో కనీసం ఒక్కరోజైనా ప్రత్యేకంగా స్మరించుకోవాలనే ఆలోచనతో ఈ సంప్రదాయం కొనసాగుతోందని స్థానికులు చెబుతున్నారు. తమ కోసం జీవితాలను అంకితం చేసిన తండ్రులు, భర్తలు, అన్నదమ్ములు, ఆత్మీయులను గుర్తుచేసుకుంటూ కుటుంబ సభ్యులు సమాధుల వద్ద దీపాలు వెలిగించడం వెనుక ఎంతో ఆవేదనతో కూడిన ప్రేమ దాగి ఉంది.
ప్రతి దీపం ఓ జ్ఞాపకం.. ప్రతి వెలుగు ఓ కన్నీటి కథ
దీపావళి రోజున ఇళ్లలో వెలిగే దీపాలు ఆనందానికి ప్రతీకలైతే.. ఇక్కడ సమాధులపై వెలిగే దీపాలు ఆత్మీయులపై చెరిగిపోని ప్రేమకు ప్రతీకలు. కాలం గడిచినా.. తరాలు మారినా.. తమ వారితో ఉన్న అనుబంధాన్ని ఈ కుటుంబాలు మరచిపోవడం లేదు. తమతో భౌతికంగా లేకపోయినా పండుగలో వారిని భాగస్వాములను చేసుకుంటూ ఆత్మీయతకు కొత్త అర్థం చెబుతున్నారు. బొగ్గు గనుల్లో చీకటిని చీల్చుకుంటూ కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన కార్మికులు నేడు మన మధ్య లేకపోయినా.. వారి త్యాగాల జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ ఆరిపోవు. వారి సమాధులపై వెలిగే ప్రతి దీపం ఓ త్యాగానికి గుర్తుగా.. ఓ కుటుంబం కన్నీటి కథగా.. తరతరాలకు అందించే ప్రేమానుబంధాల సందేశంగా నిలుస్తోంది. అందుకే ఇక్కడ దీపావళి కేవలం వెలుగుల పండుగ మాత్రమే కాదు. తమ కోసం జీవితాలను అంకితం చేసిన ఆత్మీయులను మరువని హృదయాల పండుగ కూడా.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరని జ్ఞాపకాల దీపాలు.. సమాధుల చెంత దీపావళి వెలుగులు
Bank collapse In Paraguay | బ్యాంకు పతనంతో నిరసనలు.. పరాగ్వే అధ్యక్షుడు గృహ నిర్బంధం
Health tips | డయాబెటిస్ ఉన్నవాళ్లు కార్న్‌ఫ్లేక్స్ తినొద్దా.. తింటే ఏం జరుగుతుంది..!
MLA Komatireddy | కొడంగల్‌కు ఫుల్ నిధులు..మునుగోడుకు నిల్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
MLC Dasoju Shravan Kumar | పాత గుడ్డలతో తయారు చేసిన బెడ్ షీట్స్‌ను రేవంత్ రెడ్డి మనవడు కప్పుకుంటాడా..? : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

