Khammam | బిక్కు.. బిక్కు.. ఈ ఏడాదీ మున్నేరు వరద ముంపు తప్పదా?
దశాబ్దాల తరబడి తాము పడుతున్న కష్టాలకు ఇక ఫుల్స్టాప్ పడినట్లేనని వారంతా సంబురపడ్డారు. ఈ ఏడాది మున్నేరు వరద నుంచి విముక్తి లభిస్తుందని ఆశపడ్డారు. కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఖమ్మం మున్నేరు ముంపు బాధితుల ఆశలను ఆవిరిచేసింది.
- ఈ ఏడాది కూడా మున్నేరు వరద ముంపు తప్పదా?
- ‘కరకట్ట’ పనులను ప్రారంభించని కాంగ్రెస్ ప్రభుత్వం
- గత కేసీఆర్ ప్రభుత్వంలోనే రూ.690.53 కోట్ల నిధులు మంజూరు
- టెండర్లు సైతం ఖరారు.. పనులకు అడ్డొచ్చిన ‘ఎన్నికల కోడ్’
- ఎనిమిది నెలలైనా పట్టించుకోని జిల్లా ముగ్గురు మంత్రులు
- భయంభయంగా గడుపుతున్న మున్నేరు ముంపు ప్రాంత ప్రజలు
దశాబ్దాల తరబడి తాము పడుతున్న కష్టాలకు ఇక ఫుల్స్టాప్ పడినట్లేనని వారంతా సంబురపడ్డారు. ఈ ఏడాది మున్నేరు వరద నుంచి విముక్తి లభిస్తుందని ఆశపడ్డారు. కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఖమ్మం మున్నేరు ముంపు బాధితుల ఆశలను ఆవిరిచేసింది. ఖమ్మం నగరానికి ఆనుకొని ఉన్న మున్నేరు వరద బాధితుల కష్టాలను కండ్లారా చూసిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఏడాది రూ.690.53 కోట్లను మంజూరు చేశారు.
ఈ నిధులతో మున్నేరు నదికి రెండువైపులా 8.5 కిలోమీటర్ల పొడవు చొప్పున మొత్తం 17 కిలోమీటర్లు 33 అడుగుల ఎత్తుతో ఆర్సీసీ వాల్ నిర్మించాల్సి ఉంది. దీనికి టెండర్లను సైతం పిలిచారు. అయితే ‘ఎన్నికల కోడ్’ అడ్డురావడంతో పనులు ప్రారంభంకాలేదు. కానీ అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం కరకట్ట పనులను ప్రారంభించలేదు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు నోరు మెదపడం లేదు. దీంతో ఈ ఏడాది కూడా బిక్కు.. బిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సిందేనని వరద బాధితులు భయాందోళన చెందుతున్నారు.
– ఖమ్మం, జూలై 21
Khammam | మున్నేరు వరద వల్ల ఎన్నో ఏండ్లుగా ఖమ్మం నగరంలోని సగంమంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి బాధలకు ఫుల్స్టాప్ పెట్టాలని గత బీఆర్ఎస్ పాలనలో సీఎం కేసీఆర్ మున్నేరుకు రెండువైపులా కరకట్ట నిర్మించేందుకు రూ.690.53 కోట్లను మంజూరు చేశారు. ఎన్నికలకు ముందే టెండర్లు పూర్తిచేశారు. ఎన్నికల కోడ్ వల్ల అప్పట్లో పనులు ప్రారంభంకాలేదు. ఎన్నికలు పూర్తికావడం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది.
గత ఏడాది ఎన్నికలకు ముందే టెండర్లు పూర్తి ఐనప్పటికీ ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం పనులను ప్రారంభించలేదు. ఖమ్మంజిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా మున్నేరు కరకట్ట నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు ఇచ్చే ఆర్థికశాఖ, భూసేకరణ చేసే రెవెన్యూశాఖ జిల్లాకు చెందిన మంత్రులే ఉన్నా కూడా పనులు ఇంతవరకు ప్రారంభంకాలేదు. మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం మున్నేరు కరకట్ట నిర్మాణం గురించి పట్టించుకోవడం లేదు. దీంతో ఈ ఏడాది కూడా మున్నేరు ముంపు ప్రజల కష్టాలకు శుభంకార్డు పడేటట్లు కనిపించడం లేదు.
ముంపు ప్రజల బాధలు వర్ణణాతీతం..
మున్నేరు ముంపు ప్రాంత ప్రజల బాధలు వర్ణణాతీతం. ప్రతి ఏడాది వర్షాకాలంలో మున్నేరుకు వరద పెరుగుతుందంటే బొక్కలగడ్డ, మోతీనగర్, వెంకటేశ్వరనగర్, కాల్వొడ్డు, పద్మావతినగర్, సారధినగర్‌లో కొంతభాగం, రామన్నపేటకాలనీ, రంగనాయకులగుట్ట, ధ్వంసలాపురం, దానవాయిగూడెం, జలగంనగర్, సాయిప్రభాత్‌నగర్ తదితర ప్రాంతాల్లో నివసించే ప్రజలు భయంతో వణికిపోతుంటారు. రాత్రులు నిద్రలేకుండా గడుపుతారు.
ఏ అర్ధరాత్రో వరద వచ్చి తమ బతుకులు నీళ్లలో కలుస్తాయోనని ఆందోళనతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తుంటారు. అధికారులు వీరి కోసం పలు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తారు. వరద తగ్గే వరకు వాటిల్లో ఉండి వెళ్లడం సర్వసాధారణం. గత ఏడాది కూడా మున్నేరుకు 37 అడుగులపైన వరద వచ్చి ప్రజలు ఇబ్బందులు పడడంతో అప్పుడు ఖమ్మం మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్‌కుమార్ అప్పటి సీఎం కేసీఆర్‌కు విషయాన్ని చెప్పడంతో నిధులు తక్షణమే మంజూరు చేశారు.
శాశ్వత పరిష్కారం చూపిన కేసీఆర్..
75 ఏండ్ల చరిత్రలో ఖమ్మం మున్నేరు ముంపునకు శాశ్వత పరిష్కారం చూపిన వ్యక్తి కేసీఆర్. పోలేపల్లి చప్టా నుంచి ప్రకాశ్‌నగర్ వరకు మున్నేరుకు ఇరువైపులా 8 కిలోమీటర్ల దూరంలో ఆర్సీసీ వాల్‌ను నిర్మించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం రూ.690.53 కోట్లను మంజూరు చేసింది. భూసేకరణ అతి తక్కువగా ఉండేవిధంగా, ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా, పోలేపల్లి చప్టా నుంచి ప్రకాశ్‌నగర్ వరకు మున్నేరుకు ఇరువైపులా 33 అడుగుల ఎత్తు వరకు ఈ వాల్‌ను నిర్మించేలా డీపీఆర్‌ను సిద్ధం చేశారు. గత ఏడాది మున్నేరుకు 37.5 అడుగుల వరకు వరద వచ్చింది. ఇది రికార్డు వరద.
ఈ వరదలను దృష్టిలో ఉంచుకుని అధికారులు 33 అడుగుల ఎత్తు వరకు వాల్ నిర్మించాలని నిర్ణయించారు. గోళ్లపాడు యాక్విడెంట్ నుంచి ప్రకాశ్‌నగర్ చప్టా వరకు మున్నేరుకు ఇరువైపులా సుమారు 8.5 కిలోమీటర్లు పొడవున చొప్పున మొత్తం 17 కిలోమీటర్లు పొడవున కరకట్ట నిర్మించనున్నారు. కరకట్ట నిర్మాణానికి సంబంధించి కిందభాగంలో 15మీటర్లు వెడల్పులో పైభాగం వచ్చే వరకు 9 నుంచి 12 మీటర్లు వెడల్పు ఉండేలా కరకట్టను నిర్మించనున్నారు. అదేవిధంగా ఖమ్మం నగరం నుంచి వచ్చే మురుగునీరును ఈ వాల్పక్కనే మరో డ్రైనేజి పైప్లైన్లను ఏర్పాటు చేసి వాటిని ధ్వంసలాపురం ఎస్టీఫీ వద్ద మున్నేరులోకి వదిలేలా ప్లాన్చేశారు. అదేవిధంగా మున్నేరుపై మూడుచోట్ల చెక్‌డ్యామ్‌లను నిర్మించడానికి ప్రభుత్వం రూ.30 కోట్లను గత ప్రభుత్వమే మంజూరు చేసింది.
పద్మావతినగర్, రంగనాయకులగుట్ట, పోలేపల్లి చప్టా వద్ద వీటిని నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయి. వీటిద్వారా ప్రకాశ్‌నగర్ నుంచి పోలేపల్లి చప్టా వరకు ఏడాది మొత్తం సుమారు 1.5 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. తద్వారా మున్నేరుకు ఇరుప్రాంతాల్లో భూగర్భజలాలు సైతం పెరుగుతాయి. అంతేకాకుండా 8 కిలోమీటర్లు పొడవున నిర్మించే ఆర్సీసీ వాల్ వరకు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేలా మెట్లు పెట్టి పైకి ఎక్కడానికి ఏర్పాటు, వృద్ధులు ఎక్కడానికి లిఫ్ట్‌లు ఏర్పాటు, లోపలికి మెట్ల ద్వారా దిగి బోటింగ్ చేసేలా ప్లాన్ రూపొందించారు. వీటితోపాటు అంతకుముందే మున్నేరుపై తీగల వంతెనను నిర్మాణం చేసేందుకు సీఎం కేసీఆర్ ఆర్‌అండ్‌బీశాఖ ద్వారా రూ.180 కోట్లను మంజూరు చేశారు. వాల్‌కు రూ.690.53 కోట్లు, 3 చెక్‌డ్యామ్‌లకు రూ.30 కోట్లు, తీగల వంతెనకు రూ.180 కోట్లు మొత్తం రూ.900 కోట్లను మంజూరు చేశారు గత సీఎం కేసీఆర్. ప్రభుత్వం మారి 8 నెలలు అవుతున్నా ఇంతవరకు పనులు ప్రారంభంకాలేదని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు.
మున్నేరు కరకట్ట పనులు కొనసాగుతున్నవి
మున్నేరు కరకట్టకు సంబంధించి నిర్మాణ పనులు కొనసాగుతున్నవి. ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తుల నుంచి భూ సేకరణ పూర్తికాలేదు. ప్రభుత్వ భూముల్లో పనులు ప్రారంభమయ్యాయి. వర్షాలు కురుస్తున్నందున పనులు నిలిచిపోయాయి. పనులకు ఎక్కడా ఆటంకం లేదు. ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోగా పనులు పూర్తిచేస్తాం.
– విద్యాసాగర్, సీఈ, ఖమ్మం నీటిపారుదలశాఖ
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

