ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Khammam - Jan 26, 2021 , 03:26:23

బాటిల్ లో భగీరథ

బాటిల్ లో భగీరథ

  • ఆర్‌ఓ వాటర్‌ కంటే స్వచ్ఛమైనవిగా నిర్ధారణ
  • అధికారిక కార్యక్రమాల్లో వినియోగం 
  • ప్రమాణాల మేరకు పీహెచ్‌ వ్యాల్యూ, సహజ సిద్ధ మినరల్స్‌

నాడు : దాహం కోసం అల్లాడిన పల్లెలెన్నో.. గుక్కెడు నీటి కోసం అరిగోస పడిన తండాలెన్నో.. గొంతులు తడారిన బతుకులెన్నో.. మంచినీటి కోసం మైళ్ల దూరం నడిచిన ప్రజల క‘న్నీటి’ కష్టాలు నేటికీ కళ్లలో కదలాడుతూనే ఉన్నాయి. చెలిమెలు, వాగులు, బావుల వద్ద బిందె నీటి కోసం బారులు తీరిన రోజులున్నాయి. 

నేడు : నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. పల్లెల్లో నల్లా వద్ద పంచాయితీలు, నీటి యుద్ధాలకు చెక్‌ పడింది. మారుమూల గ్రామాల దాహార్తి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం భగీరథ ప్రయత్నం చేసి విజయం సాధించింది. ఇంటింటికీ నల్లా కనెక్షన్‌ ఇచ్చి శుద్ధజలం సరఫరా చేస్తున్నది. ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఈ నీటి వినియోగం పెరిగిపోయింది. అంతేకాదు,  ప్రభుత్వం భగీరథ నీటి బాటిళ్లను అందుబాటులోకి తెచ్చింది. అధికారులు, ప్రజాప్రతినిధుల అధికారిక కార్యక్రమాలు, సమావేశాల్లో ఈ నీటినే తాగుతున్నారు. 

- ఖమ్మం, జనవరి 25 : 

ఖమ్మం, జనవరి 25 : రాష్ట్రంలో ప్రతిఒక్కరికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్‌ మిషన్‌ భగీరథ పథకానికి నాలుగేళ్ల క్రితం శ్రీకారం చుట్టారు. యుద్ధప్రాతిపదికన ఆ పనులన్నీ పూర్తయ్యాయి. ఖమ్మం జిల్లాలో కొంతకాలంగా ఇంటింటికీ మిషన్‌భగీరథ నీరు నల్లాల ద్వారా అందుతున్నాయి. అయితే అంతటితో ఆగకుండా మిషన్‌ భగీరథ నీటిని బాటిళ్ల రూపంలో అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వం నిర్వహించే అధికారిక కార్యక్రమాలు, ప్రజా ప్రతినిధుల సమావేశాల్లో ఈ బాటిళ్లనే తప్పనిసరిగా వినియోగించాలని, నీటి నాణ్యత అందరికీ తెలిసేలా ఏర్పాట్లు చేస్తుంది.

లవణాలు పుష్కలం.. 

వర్షపు నీటిని ఫిల్టర్‌ చేసి బ్లీచింగ్‌ ఫౌడర్‌, ఆలం, క్లోరినేషన్‌, ఏరిషన్‌ వంటి ప్రక్రియల ద్వారా శుద్ధి అయి పూర్తి స్వచ్ఛతను సంతరించుకున్నాయి. ఈ నీటిలో టోటల్‌ డిజాల్వుడ్‌ సాలిడ్స్‌ (టీడీఎస్‌) 200-225 వరకు ఉంటాయి. దీని వల్ల ఎముకలు గుల్లబారే అవకాశం ఉండదు. భగీరథ జలాలు క్షార గుణాన్ని కలిగి ఉండటం వల్ల ఎంతో మేలు జరుగుతుందని భగీరథ అధికారులు తెలిపారు. 

మూడుదశల్లో నీటి శుద్ధి..

పాలేరు రిజర్వాయర్‌ నుంచి పంపుసెట్స్‌ ద్వారా రావాటర్‌ను జీళ్లచెరువు దగ్గర గుట్టపై నిర్మించిన  ట్యాంక్‌లకు తరలించి అక్కడ ట్రీట్‌ చేసి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి ప్రధాన పైప్‌లైన్ల ద్వారా గ్రామాలకు సురక్షిత నీటిని తరలిస్తున్నారు. జీళ్లచెరువు నుంచి 370 గ్రామాలకు రోజుకు (90 ఎంఎల్‌టీ) 9 కోట్ల లీటర్ల నీటిని అందిస్తున్నారు. కూసుమంచి మండలంలోని 79 గ్రామాలకు, నేలకొండపల్లిలోని 37, ఖమ్మం రూరల్‌లోని 73, తిరుమలాయపాలెంలో 77, ఖమ్మం అర్బన్‌ (రఘునాథపాలెం)లో 46, ముదిగొండ 32, చింతకానిలోని 26 గ్రామాలకు మంచినీటిని అందిస్తున్నారు. అంతేకాకుండా జీళ్లచెర్వు వద్ద ప్రత్యేకంగా నిర్మించిన ఓవర్‌హెడ్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌, వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌, ఇన్‌టేక్‌ వెల్‌, సంపుల పైప్‌లైన్ల  ద్వారా ఖమ్మం కార్పొరేషన్‌కు మంచినీటిని అందిస్తున్నారు. ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలో ఒక్కొక్కరికి ప్రతి రోజు 135 లీటర్లు, గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు ఒక్కొక్కరికి 100 లీటర్ల నీటిని అందిస్తున్నారు.  

అవగాహన కల్పించేందుకే అధికారిక కార్యక్రమాల్లో..

ఆర్‌ఓ నీటి కంటే స్వచ్ఛమైనవని నిర్ధారణ అవడంతో ప్రజల్లో అవగహన పెంచి, ఆరోగ్యం పంచేలా మిషన్‌ భగీరథ నీటితో నింపిన బాటిళ్లను తయారుచేయించి అధికారిక కార్యక్రమాల్లో వినియోగిస్తున్నది. ఇటీవల రఘునాధపాలెం మండలంలో జరిగిన సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారులందరికీ అవే బాటిళ్లు అందించి, మంత్రే స్వయంగా వాటిని తాగారు. ఇకపై అన్ని సమావేశాల్లో భగీరథ నీళ్ల బాటిళ్లనే ఉపయోగించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ప్రజలు కూడా భగీరథ నీటిని తాగి ఆరోగ్యంగా ఉండాలన్నారు.

వైరా నుంచి 462 గ్రామాలకు..

వైరా రిజర్వాయర్‌ నుంచి తనికెళ్ల దగ్గరలోని ముక్రిహిల్స్‌ వద్ద సంప్‌లను, ఓహెచ్‌బీఆర్‌లను నిర్మించారు. అక్కడి నుంచి (50 ఎంఎల్‌టీ)5 కోట్ల లీటర్లను ప్రతి రోజు  ప్రజలకు అందిస్తున్నారు. ముక్రిహిల్స్‌ నుంచి మధిర నియోజకవర్గంలోని బోనకల్‌, మధిర, ఎర్రుపాలెం, చింతకాని మండలంలోని కొన్ని గ్రామాలను కలుపుకుని మొత్తం 462 గ్రామాలకు సురక్షిత మంచినీటిని ప్రతి రోజు ప్రజలకు అందిస్తున్నారు.  ఇంతేకాకుండా వైరా రిజర్వాయర్‌ నుంచి కల్లూరు వద్ద గల కనకగిరి హిల్స్‌ నుంచి వైరా నియోజకవర్గంలోని జూలూరుపాడు, ఏన్కూర్‌, కొణిజర్ల మండలంలోని కొన్ని గ్రామాలతో పాటు, సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, వేంసూరు మండలాల్లో గల  గ్రామాల ప్రజలకు మంచినీటిని అందిస్తున్నారు.

స్వచ్ఛ జలం.. రోగాలు దూరం

రోగాలకు ప్రధాన కారణం మనం తాగేనీరేనని వైద్య   నిపుణులు పేర్కొంటున్నారు. స్వచ్ఛమైన నీటితో సగం రోగాలు దూరమవుతాయని చెబుతున్నారు.  అయితే ఆర్‌ఓ నీటి కంటే మిషన్‌ భగీరథ నీరు స్వచ్ఛమైనదని తేలడంతో ప్రజలు, అధికారులు ఈ నీటిని తాగేందుకు ఆసక్తి చూపుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశాల్లో భగీరథ బాటిల్స్‌ను వినియోగిస్తున్నారు. ఇటీవల రఘునాథపాలెం మండలంలో జరిగిన సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ భగీరథ నీరు తాగి అక్కడి వారికి అందజేశారు. 

అనారోగ్యాన్ని కొనితెచ్చుకోవద్దు 

మిషన్‌ భగీరథ నీటిలో పోషక విలువలున్నాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు భగీరథ బాటిల్స్‌ను సరఫరా చేస్తాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా మిషన్‌ భగీరథ నీటిని శుద్ధి చేస్తున్నాం. ఇతర కంపెనీల నీటిని తాగి అనారోగ్యం కొనితెచ్చుకోవద్దు.

-కె. శ్రీనివాస్‌, మిషన్‌ భగీరథ ఎస్‌ఈ, ఖమ్మం


VIDEOS

logo