బుధవారం 08 ఏప్రిల్ 2020
Khammam - Feb 28, 2020 , 23:33:05

అభివృద్ధిలో అజేయుడు

అభివృద్ధిలో అజేయుడు

(ఖమ్మం, నమస్తే తెలంగాణ)స్వరాష్ట్ర సాధన ఉధ్యమ ఫలాలను అన్ని ప్రాంతాలకు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నది. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సారథ్యంలో ఖమ్మం అభివృద్ధికి నిధుల వరద పోటెత్తుతున్నది. దీనిలో భాగంగానే లకారం చెరువును టీఆర్‌ఎస్‌ సర్కార్‌ దాదాపు రూ.24 కోట్లతో ఆధునికీకరించింది. హైదరాబాద్‌ హుస్సేన్‌ సాగర్‌ తరహాలో అందమైన ట్యాంక్‌బండ్‌ను నిర్మించింది. 


రూ.వెయ్యి కోట్ల పైచిలుకు నిధులతో అభివృద్ధి

 దాదాపు రూ.1000 కోట్ల పైచిలుకు నిధులతో నగరంలో అభివృద్ధికి బాటలు వేసిన ఘనత సీఎం కేసీఆర్‌ సర్కారుకే దక్కుతుంది. కార్పొరేట్‌ నగరాలకు దీటుగా ఖమ్మాన్ని ఆవిష్కరించాలనే ఏకైక లక్ష్యంతో అడిగిన వెంటనే నిధులు మంజూరు చేస్తున్నది. నగరపాలకసంస్థకు ఏటా రూ.100 కోట్లు కేటాయించిన సర్కారు.. వాటితో అంతర్గత రహదారులు, నిరంతర మంచినీటి వసతి, ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్‌, వాడవాడలా సీసీ రోడ్లు, సైడు కాలువలు, జనాభా ప్రాతిపదికన కూరగాయల మార్కెట్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. అవసరాలకు తగిన విధంగా కార్పొరేషన్‌ కార్యాలయాన్ని నిర్మించేందుకు రూ.14 కోట్లు మంజూరు చేయగా పనులు కొనసాగుతున్నాయి. గ్రేటర్‌ తరహాలో ఖమ్మం ఎన్నెస్పీ, మరికొన్ని ప్రాంతాల్లో ఏసీ వెజ్‌ అండ్‌ నాన్‌ వెజ్‌ మార్కెట్‌ నిర్మాణానికి రూ.10 కోట్లు కేటాయించి నిర్మాణాలు పూర్తి చేసిన ఘనత అజయ్‌కే దక్కుతుంది.


మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం..

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ సర్కార్‌ వచ్చిన తర్వాత ఖమ్మం మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించబోతున్నది. కేఎంసీ అమృత్‌ పథకాన్ని మిషన్‌ భగీరథ పథకానికి అనుసంధానం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.230 కోట్లతో మెగా మంచినీటి ప్రాజెక్ట్‌ను నగర ప్రజల ముందు ఆవిష్కరించాలని తహతహలాడుతున్నరు. 


రూ.77 కోట్లతో ధంసలాపురం ఆర్వోబీ నిర్మాణం

ధంసలాపురం రైల్వే ఓవర్‌ బ్రిడ్జీ నిర్మాణానికి సైతం టీఆర్‌ఎస్‌ సర్కారే రూ.77 కోట్లు నిధులు మంజూరు చేసింది.  మంత్రి అజయ్‌ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఆర్‌వోబీ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నవి. పేదలకు కార్పొరేట్‌ వైద్యాన్ని అందించాలనే సంకల్పంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో రూ.20 కోట్లతో మాతా, శిశు ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించారు.


2500 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు

అర్హత కలిగిన ప్రతి నిరుపేదకూ నయాపైసా ఖర్చులేకుండా ‘డబుల్‌ బెడ్‌ రూం’ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 400 ఇండ్లు మంజూరు చేయగా.. ఖమ్మానికి 2500 కేటాయించటం గమనార్హం. ఎలాంటి రాజకీయ ప్రయోజనాలకూ తావులేకుండా ఆ ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తున్నారు. 


జిల్లాకు ఖ్యాతి ఐటీ హబ్‌, లకారం..

సాంకేతిక విద్యను అభ్యసిస్తూ ఉద్యోగ వేటలో ఎన్నో సుదూర ప్రాంతాలకు తరలివెళుతున్న ఖమ్మం యువతరం కోసం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ‘ఐటీ హబ్‌'ను తీసుకువచ్చారు. మంత్రి కేటీఆర్‌ నగరానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐటీహబ్‌ను మంజూరు చేశారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ అందుబాటులోకి వచ్చి జిల్లా యువతరానికి దారి చూపనుంది. 

రూ.14 కోట్లతో కార్పొరేషన్‌ కార్యాలయం

ఖమ్మం నడిబొడ్డున ఉన్న ప్రస్తుత మున్సిపల్‌ కార్యాలయం రోజురోజుకూ పెరుగుతున్న జనాభాకు తగినట్లుగా లేదు. కార్పొరేషన్‌లో పనిచేసే అధికారులకు కూడా సౌకర్యంగా లేదు. దీనిని దృష్టిలో ఉంచుకొని  మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రత్యేక కృషితో ఖమ్మంలోని ఎన్నెస్పీ క్యాంపులో రూ.14 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్‌ కార్యాలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 


రూ.17.05 కోట్లతో బస్టాండ్‌ నిర్మాణం

ఖమ్మం బస్టాండ్‌ నిర్మించి చాలా సంవత్సరాలు అవుతున్నది. జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఖమ్మం బస్టాండ్‌ను నిర్మించారు. పెరుగుతున్న జనాభా కారణంగా బస్టాండ్‌ సరిపోవటం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకొని మంత్రి అజయ్‌కుమార్‌ ప్రత్యేక కృషితో ఎన్నెస్పీ క్యాంపులో రూ.17.05కోట్లతో నూతన బస్టాండ్‌ నిర్మాణాన్ని ప్రారంభించారు. పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. 


రూ.20 కోట్లతో కమ్యూనిటీ భవనాలు

నగరంలోని అనేక కులాలకు చెందిన ప్రజల సౌకర్యార్ధం కమ్యూనిటీ భవనాలు నిర్మించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కమ్యూనిటీ భవనాలను రూ.20 కోట్లతో నిర్మించారు. 


రూ.10 కోట్లతో క్యాంపు కార్యాలయం

నియోజకవర్గంలోని ప్రజలు తమ సమస్యలను అ నియోజకవర్గ ఎమ్మెల్యేకు చెప్పుకోవాలంటే ఇప్పటి వరకు ఆయన ఇంటికి వెళ్లే సంప్రదాయం ఉండేది. అలాంటిది ప్రతి నియోజకవర్గంలో రూ.10 కోట్లతో ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాలలో క్యాంపు కార్యాలయాల నిర్మాణాలకు ప్రభుత్వం రూ.50 కోట్లను మంజూరు చేసింది. ఖమ్మం నగరంలోని వీడీవోస్‌ కాలనీలో రూ.10 కోట్లతో ఖమ్మం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని నిర్మించారు. ఇదే కార్యాలయం నుంచి ఇప్పుడు మంత్రి అజయ్‌కుమార్‌ తన అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 


logo