వేములవాడ, నవంబర్ 20 : పోలీస్ జాబే లక్ష్యంగా కఠోర సాధన చేస్తున్నారు వేములవాడ యువతీయువకులు. డిసెంబర్లో జరిగే ఎస్ఐ, కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షల కోసం సమాయత్తమవుతున్నారు. యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణనిస్తుండగా రోజూ ఉదయం, సాయంత్రం తర్ఫీదు పొందుతున్నారు. ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తున్నామని, తప్పక జాబ్ కొడతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సర్కారు కొలువుంటే గుర్తింపుతోపాటు ఉద్యోగ భదత్ర ఉంటుందనేది అందరి నమ్మకం, రాష్ట్ర ప్రభుత్వం పోలీస్‌శాఖలో ఎస్ఐ, కానిస్టేబుల్ భర్తీకోసం నోటిఫికేషన్ విడుదల చేసి ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించి ఫలితాలను కూడా వెల్లడించింది. ఈక్రమంలో డిసెంబర్లో ఫిజికల్ పరీక్షలు ఉన్నందున కొలువును కొట్టేందుకు యువత కఠోర సాధన చేస్తున్నది. వేములవాడ ప్రాంతంలో దాదాపు 150మంది అర్హత సాధించగా వారికి యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఉద్యోగమే లక్ష్యంగా కష్టపడుతున్నామని తప్పక సాధిస్తామని యువకులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఫిజికల్ టెస్టులో ఇవే..
ప్రధానంగా పోలీసు ఉద్యోగాల ఎంపికలో పరుగు ప్రాధాన్యతనిస్తూ ఇందులో అర్హత సాధించి మెరిట్ పొందిన వారికి కూడా మార్కులు వేసే విధానం ఉంటుంది. ఇక పురుషులు 1600 మీటర్ల పరుగు, మహిళలకు 800మీటర్ల పరుగులో మెరిట్ సాధించాలి. ఇందులో పురుషులు 7నిమిషాల15సెకన్లో క్వాలిఫై కావాలి. మహిళలు 5నిమిషాలు20 సెకండ్లు దాటిన వారిని మాత్రమే క్వాలిఫై చేస్తారు. ఇందులో తప్పనిసరిగా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. తగిన సమంలో రీచ్ కాలేకపోతే డిస్ క్వాలిఫై చేస్తారు. ఇందులో మెరిట్ బట్టి అభ్యర్థులకు వంద మార్కుల వరకు కూడా ఇస్తారు. రాత పరీక్షతో పాటు తప్పనిసరిగా ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్టు ప్రకారం అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. లాంగ్ జంప్ పురుషులు 4మీటర్లు, మహిళలకు రెండున్నర మీటర్లు ఉంటుంది. అలాగే షార్ట్‌పుట్ పురుషులకు 7.26కేజీ బరువులు 6మీటర్లు విసరాలి. మహిళలకు 4కేజీల బరువును 4మీటర్ల వరకు వేయగలగాలి.
యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ
యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీసు ఉద్యోగాల కోసం అర్హత సాధించిన యువతీయువకులకు యువ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పోలీస్ కానిస్టేబుల్ గొడిశెల రాజశేఖర్ గౌడ్ వేములవాడ పట్టణంలోని సాయిరక్షా జంక్షన్ వద్ద ఉచిత శిక్షణనిస్తున్నారు. 2018సంవత్సరంలో అప్పటి పోలీస్కానిస్టేబుల్ నియామకంలోనూ ఉచిత శిక్షణను అందించగా 10మంది యువకులు పోలీస్ కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. ఈ సారి నిర్వహిస్తున్న శిక్షణకు దాదాపు 150మంది యువతీ యువకులు వస్తుండగా ప్రతిరోజు ఉదయం 6 నుంచి 9గంటల వరకు సాయంత్రం 4గంటల వరకు రెండు పూటలా శిక్షణనిస్తున్నారు. వేములవాడతో పాటు పరిసర మండలాలకు చెందిన యువతీ యువకులు ఈ శిక్షణ ఉచితంగా అందుకుంటున్నారు.
150 మందికి ఉచితంగా శిక్షణ ఇస్తున్నం
యువ ఫౌండేషన్ ప్రారంభించిన తర్వాత 2018లో వచ్చిన పోలీస్ ఉద్యోగాల ఎంపిక కోసం కూడా ఉచితంగా ఫిజికల్ శిక్షణ ఇచ్చాం. అప్పుడు 10మంది యువకులు పోలీసు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ సారి దాదాపు ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ప్రిలిమినరీ పరీక్ష పాసైన వారు దాదాపు 150 మంది దాకా యువతీ యువకులు వస్తున్నారు. పూర్తి ఉచితంగా ప్రతిరోజు శిక్షణ ఇస్తున్నా. పోలీస్ అధికారుల నుంచి నాకు ప్రోత్సాహం కూడా అందుతున్నది.
– గొడిశెల రాజశేఖర్ గౌడ్, యువ ఫౌండేషన్ వ్యవస్థాపక
అధ్యక్షుడు, పోలీస్ కానిస్టేబుల్, వేములవాడ
కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న
2012లోనే హోంగార్డు ఉద్యోగంలో చేరాను. ఈసారి కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్ష కూడా పాసయ్యా. ఎలాగైనా ఉద్యోగం సాధించాలని ప్రయత్నం చేస్తున్నాను. ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుంటూ రోజూ ప్రాక్టీస్ చేస్తున్నా.
– తిక్కల సుజాత, హోంగార్డు, వేములవాడ
ఐటీ ఎస్ఐ ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్నా..
బీటెక్‌లో ఐటీ 2018లోనే పూర్తి చేశాను. ఎస్ఐ ఉద్యోగం కోసం శ్రమిస్తున్నాను. మాది కొడిమ్యా ల. అయినా వేములవాడలో ఫిజికల్ శిక్షణ బా గా ఇస్తున్నారని తెలుసుకుని వేములవాడలోని అమ్మవాళ్ల ఇంటి దగ్గర ఉండి కోచింగ్ తీసుకుంటున్నా. ఎస్ఐ ఐటీ ఉద్యోగమే నా లక్ష్యం.
– వంకాయల శ్రీలత, కొడిమ్యాల, జగిత్యాల జిల్లా
గతంలో రెండు మార్కులతో పోయింది
2018లో జరిగిన పోలీసు ఉద్యోగాల సమయం లో రెండు మార్కులతో జాబ్ మిస్సయింది. ఈ సారి కచ్చితంగా ఉద్యోగం కొట్టాలనే కష్టపడుతు న్నా. గతంలోనూ ఇక్కడే శిక్షణ పొందా. ఈ ఏడా ది కూడా ఉచితంగానే ట్రైనింగ్ ఇస్తున్నారు.
– కోరెపు అనిల్, గాంధీనగర్, వేములవాడ
ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష పాసయ్యా
పోలీస్ ఉద్యోగాలకోసం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో ఎస్ఐ ఉద్యోగం కోసం పరీక్ష కూడా పాసయ్యా. ఫిజికల్ శిక్షణ ఇక్కడ బాగా ఇస్తున్నారు. ఉచిత శిక్షణతో ఉద్యోగం కొట్టాలని కఠోర సాధన చేస్తున్నా. ఈ ట్రైనింగ్‌ను సద్వినియోగం చేసుకుని ఉద్యోగం సాధిస్తా.
– యాద శివకుమార్, వేములవాడ