వెల్గటూర్, ఏప్రిల్ 1: ఓ ఎనిమిది నెలల క్రితం వరకు ధర్మారం నియోజకవర్గంలోని మండలాల ప్రజలు సినిమా వినోదం కావాలంటే ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిందే! 40 కిలోమీటర్ల దూరంలోని జగిత్యాల లేదా 50 కిలోమీటర్ల దూరంలోని కరీంనగర్‌కో రావాల్సిందే! కానీ, ప్రస్తుతం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. ఎండపల్లి మండలంలోని రాజారాంపల్లిలో ఇగ్లూ థియేటర్ నిర్మాణమైంది. పట్టణాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఆధునిక హంగులతో అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రాంత వాసులకు వినోదాన్ని పంచుతున్నది.
వెల్గటూర్ మండలం పైడిపెల్లి చెందిన జైన చంద్రమౌళి, గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్‌కు చెందిన మహంకాళి చంద్రశేఖర్, అదే గ్రామానికి చెందిన కాసం రాజశేఖర్, ఎండపల్లికి చెందిన మారం జగన్మోహన్రెడ్డి గ్రామీణ వాతావరణంలో ఆధునిక హంగులతో వినూత్నంగా థియేటర్‌ను నిర్మించాలని అనుకున్నారు. ఎండపల్లి మండలాన్ని ఆనుకుని ఉన్న రాజారాంపల్లిలో 21 గుంటల స్థలంలో కోటితో 100 సీట్ల కెపాసిటీతో ఇగ్లూ మోడల్లో థియేటర్‌ను నిర్మించారు. మొదట ముంబైకి చెందిన చోటా మహారాజన్ సినీ ఫ్రాంచైజీతో ఒప్పందం చేసుకున్నారు. రోజుకు ఐదు షోలు నడిపించారు. అయితే గత మార్చిలో మహారాజన్ సినీ ఫ్రాంచైజీని రద్దు చేసుకున్నారు. ‘శ్రీనివాస సినిమాస్’ పేరిట సొంతంగా నడిపిస్తున్నారు.
హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో ఉండే మల్టీప్లెక్స్‌లో ఉండే ఫుల్లీ ఏసీ, మంచి సౌండ్ సిస్టం, హైజెనిక్ సీటింగ్, ముందు వరుసలో కూర్చున్నా బ్యాక్ సీట్లో కూర్చొని చూస్తున్న ఒకే అనుభూతి కలుగుతుంది. విశ్రాంతి సమయంలో బయటకు వస్తే మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. చుట్టూ పచ్చని పొలాలు దర్శనమిస్తాయి. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది.
ఈ థియేటర్లో ఈవెంట్స్‌కు కూడా చేసుకోవచ్చు. బర్త్‌డేలు, మ్యారేజ్డేలు, బంధువులు, స్నేహితులంతా కలిసి పార్టీలు చేసుకోవచ్చు. అయితే 3 నుంచి 4 గంటల సమయంలో చేసుకునే ఒక్కో ఈవెంట్‌కు పది వేల వరకు తీసుకుంటున్నారు. దీనికోసం ముందస్తుగా బుక్ చేసుకోవాల్సి చేసుకోవాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. 9618570340, 9542155555 నంబర్లలో సంప్రదించాలని చెబుతున్నారు.
పని మీద ముంబైకి వెళ్లినప్పుడు అక్కడ ఉన్న మినీ థియేటర్ గురించి తెలుసుకున్నం. మా ప్రాంతంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని అనుకున్నం. మే నలుగురం కలిసి థియేటర్‌ను నిర్మించిన. ప్రారంభించిన మొదటి రోజుల్లో కంటే ఇప్పుడు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వస్తున్నది. మేం పెట్టుబడి పెట్టి లాభాలు పొందడం కన్నా గ్రామీణ ప్రాంతంలో ఉండి ఆనందాన్ని పొందలేని వారికి సినిమా ఆనందాన్ని అందిస్తున్నం అనే సంతృప్తి ఎక్కువ ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూడాలంటే 50 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఇక్కడ థియేటర్ ఏర్పాటు చేయడంతో మాకు దూరభారం తగ్గిందని ప్రేక్షకులు మాతో చెబుతుంటే చాలా హ్యాపీగా ఫీలవుతున్నం. మున్ముందు ప్రేక్షకుల ఆలోచనలకు అనుగుణంగా మార్పులు చేస్తున్నం.
– జైన చంద్రమౌళి, థియేటర్ ముఖ్య భాగస్వామి
మేమే ఎప్పుడైనా సినిమా చూడాలంటే 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరీంనగర్ వెళ్లి చూడాల్సిన పరిస్థితి. కానీ మాకు అందుబాటులో 4 కి.మీ దూరంలో మల్టీప్లెక్స్ థియేటర్లో సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతున్నది. విడుదలైన మొదటి రోజునే సినిమాలు తీసుకురావడం మాకు సౌకర్యంగా ఉంది.
– రామగిరి మల్లేశ్, చెర్లపల్లి