‘భూ బాగోతం’ సూత్రధారుల అరెస్ట్
‘జగిత్యాల మున్సిపాలిటీలో భారీ భూ బాగోతం’ శీర్షికన గత నెల 27న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం ప్రకంపనలు సృష్టించింది. మున్సిపల్ అధికారుల సహకారంతో కోట్లాది రూపాయల విలువైన భూమిని కాజేసేందుకు యత్నించిన తీరును కండ్ల ముందుంచడం సంచలనం రేపింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన యంత్రాంగం, ఆ రోజు నుంచే విచారణ చేపట్టి అక్రమార్కులపై చర్యలకు సిద్ధమైంది.
- జగిత్యాలలో రూ. కోట్ల విలువైన భూమి కాజేసేందుకు ప్రయత్నం
- అధికారులతో కలిసి కబ్జాదారుల పన్నాగం
- బట్టబయలు చేసిన ‘నమస్తే’ కథనం
- ఆ వెంటే రంగంలోకి యంత్రాంగం
- సమగ్ర విచారణ.. బాధ్యులపై చర్యలకు సిద్ధం
- నకిలీ పత్రాలు సృష్టించిన ఇద్దరు.. సహకరించిన మున్సిపల్ ఆర్వో రిమాండ్
- పరారీలో మున్సిపల్ కమిషనర్, మరో కీలక వ్యక్తి
- త్వరలోనే అరెస్ట్ చేస్తాం : సీఐ వేణుగోపాల్
జగిత్యాల కలెక్టరేట్, జూన్ 10 : ‘జగిత్యాల మున్సిపాలిటీలో భారీ భూ బాగోతం’ శీర్షికన గత నెల 27న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం ప్రకంపనలు సృష్టించింది. మున్సిపల్ అధికారుల సహకారంతో కోట్లాది రూపాయల విలువైన భూమిని కాజేసేందుకు యత్నించిన తీరును కండ్ల ముందుంచడం సంచలనం రేపింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన యంత్రాంగం, ఆ రోజు నుంచే విచారణ చేపట్టి అక్రమార్కులపై చర్యలకు సిద్ధమైంది. తాజాగా భూ కబ్జాకు ప్రయత్నించిన సూత్రధారులతోపాటు కబ్జాదారులకు సహకరించి పాత్రధారులైన జగిత్యాల మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్పై కేసులు నమోదు చేసింది.
నకిలీ పత్రాలు సృష్టించిన ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు, సహకరించిన మున్సిపల్ ఆర్వోలను జగిత్యాల టౌన్ పోలీసులు రిమాండ్కు పంపగా, మొత్తం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన మరోవ్యక్తితో పాటు మున్సిపల్ కమిషనర్ పరారీలో ఉన్నట్లు జగిత్యాల టౌన్ పోలీసులు తెలిపారు. జగిత్యాల టౌన్ సీఐ వేణుగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల పట్టణం హస్నాబాద్ శివారులోని సర్వే నంబర్ 1599లోని 12 గుంటల స్థలాన్ని పట్టాదారులైన మండ పెద్ద రాజిరెడ్డి, మండ శ్రీనివాస్ నుంచి పుల్ల భాగ్యలక్ష్మి 2008లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
తర్వాత భాగ్యలక్ష్మి నుంచి కీర్తి విజయలక్ష్మి, వూటూరి గీతారాణి, గొల్లపెల్లి సత్యనారాయణ 2011లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అప్పటి నుంచి సదరు భూమి వీరు ముగ్గురి ఆధీనంలోనే ఉన్నది. కాగా, దీనిని కాజేసేందుకు జగిత్యాల పట్టణానికి చెందిన ఖాజా అమీరుద్దీన్ అలియాస్ నుమాన్, అమీరుద్దీన్ స్నేహితుడు ఎండీ ముజాకిర్ అలీ అలియాస్ హిలాల్ సుల్తాన్, జగిత్యాల పట్టణానికే చెందిన ఎండీ ఇమ్రాన్ కలిసి సదరు భూమికి సంబంధించిన సాదా బైనామా, నకిలీ 12బీ, 13సీ, మ్యాప్లు సృష్టించారు. తర్వాత జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ ఆఫీసర్గా పనిచేస్తున్న బడుగు ప్రసాద్, జగిత్యాల మున్సిపల్ కమిషనర్ అనిల్ సహకారంతో నకిలీ ఇంటి నంబరు, నకిలీ ఆస్తి అసెస్మెంట్ పత్రాలు, వేకెట్ ల్యాండ్ టాక్స్ ఐడెంటిఫికేషన్ నంబరు (వీఎల్టీఐఎన్) వంటి పత్రాలను సృష్టించారు.
వీటి ఆధారంగా ఇంటి నంబరుపై 2012 సంవత్సరం నుంచి 2025 మార్చి 31 వరకు వీఎల్టీకి సంబంధించిన బకాయి మొత్తం 97,500 గత మే నెల 3న చెల్లించి సదరు భూమిని కబ్జా చేశారు. అంతేకాకుండా అసలు యజమానులను భూమిలోకి రాకుండా అడ్డుకున్నారు. ‘భూమికి సంబంధించిన వీఎల్టీ నెంబరు ఉంది. ఇది మా భూమి ఇందులోకి రావద్దు’ అంటూ బెదిరింపులకు దిగారు. జరిగిన తతంగం మొత్తాన్ని ‘జగిత్యాలలో భారీ భూ బాగోతం’ పేరిట మే 27న ‘నమస్తే’లో కథనం ప్రచురితమైంది.
తర్వాత బాధితులు జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ఐపీసీ 409, 420, 471, 468, 120(బీ), రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. తమది కాదని తెలిసి విలువైన భూమిని కాజేసేందుకు కుట్ర పన్ని, సదరు భూమికి సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టించిన అమీరుద్దీన్, ముజాకిర్, అక్రమంగా వీఎల్టీ నంబర్ కేటాయించి సహకరించిన మున్సిపల్ ఆర్వో బడుగు ప్రసాద్ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్టు సీఐ తెలిపారు. భూ కబ్జా వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన మరో వ్యక్తి ఎండీ ఇమ్రాన్, మున్సిపల్ కమిషనర్ అనిల్ పరారీలో ఉన్నట్లు చెప్పారు. పరారీలో ఉన్న ఇద్దరిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

