జమ్మికుంట, డిసెంబర్1: వివాహ ముహూర్తాలకు మూడు నెలల బ్రేక్ పడింది. పెళ్లి పీటలెక్కాలంటే 19 ఫిబ్రవరి 2026 వరకు ఆగాల్సిన పరిస్థితి వచ్చింది. వాస్తవానికి కార్తీక మాసం తర్వాత వచ్చే మాఘమాసంలో పెళ్లిళ్లు ఒక్కటే కాదు, ఏ శుభకార్యం తలపెట్టినా శ్రేష్టమని ప్రతీది. కానీ, మాఘమాసమంతా శుభకార్యాలన్నీ లేకుండా పోతున్నాయి. అందుకు గత నెల 26 నుంచి ప్రారంభమైన ‘శుక్ర మౌఢ్యమి’యే కారణం. భోగభాగ్యాలకు, సుఖ సంతోషాలకు, దాంపత్య జీవితాలకు శుక్రుడు అధిపతి. అలాంటి శుక్ర గ్రహణం సూర్యుడి ప్రతాపానికి కనుమరుగవ్వడమే మౌఢ్యమి. ఈ సమయంలో చేసే వివాహాలు, శుభకార్యాలు ఇబ్బందులకు దారి తీస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నదని పండితులు అంటున్నారు.
కాగా, ఇది వచ్చే ఫిబ్రవరి 17 వరకు ఉంటుందని, 19 నుంచి మంచి ముహూర్తాలు మొదలవుతాయని పండితులు చెబుతున్నారు. పెళ్లి పీటలెక్కాలంటే అప్పటిదాకా ఆగాల్సిందేనని సూచిస్తున్నారు. అప్పటి వరకు శుభకార్యాల సందడికి దాదాపు 80 రోజుల వరకు సుదీర్ఘ విరామం రానున్నది. కాగా, శుక్ర మౌఢ్యమిలో పెళ్లి చూపులు, నిశ్చితార్ధం, వివాహం, ఉపనయనం, నూతన గృహప్రవేశం, యజ్ఞాలు, దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ఠలు, నూతన వ్యాపారాలు, తదితరలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్న కుటుంబాలు వాయిదా వేసుకోవాలంటున్నారు. ఇక అనివార్యమైన కార్యక్రమాలు సీమంతం, నిత్యపూజలు, అభిషేకాలు, నవగ్రహశాంతి పూజలు, నామకరణాలు, కర్ణవేదన, అన్నప్రాసనకు ఇబ్బందులు లేవని చెబుతున్నారు.
ఫిబ్రవరి 19 వరకు ఆగాల్సిందే
శుక్ర మౌఢ్యమిలో శుభకార్యాలు వద్దు. ముఖ్యంగా వివాహాలు, శుభకార్యాలకు దూరంగా ఉండాలి. ఫిబ్రవరి 13 వరకు మంచి రోజులు లేవు. 18న ఫాల్గుణ మాసం ప్రారంభం అవుతుంది. 19 నుంచి మంచి ముహూర్తాలున్నాయ్. అప్పటి దాకా ఆగాల్సిందే.
– సముద్రాల కిశోరాచార్యులు, పండితుడు(జమ్మికుంట)