Kolanur | ఓదెల, అక్టోబర్ 1 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూరు జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు ఎస్జీఎఫ్ఐ క్రీడా పోటీల్లో తమ ప్రతిభను చాటారు. సుల్తానాబాద్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SGFI) క్రీడా పోటీల్లో విద్యార్థులు వివిధ క్రీడా విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, పతకాలు సాధించారు. దీంతో ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పెద్దపల్లి జిల్లా స్థాయి పోటీల్లో అండర్-17 బాలికల విభాగంలో రేండ్ల సౌమ్యశ్రీ డిస్కస్ త్రోలో బంగారు పతకం, జావెలిన్ త్రో లో రజిత పతకం,షాట్‌పుట్‌లో కాంస్య పతకం సాధించి ప్రతిభ కనబరిచింది. అదేవిధంగా అండర్-17 బాలుర విభాగంలో ఉప్పుల శ్రీవిష్ణు వాలీబాల్ లో రజత పతకం సాధించాడు.
అండర్-17 బాలుర విభాగంలో గండికోట రామ్ చరణ్ జావెలిన్ త్రో లో రజిత పతకం గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిట్టూరి యేసుదాసు, గ్రామ సర్పంచ్ పల్లె కనకయ్య, ఉపసర్పంచ్ పాకాల సంపత్ రెడ్డి అభినందించారు. జిల్లా స్థాయిలో కూడా విద్యార్థులు ఇదే స్ఫూర్తితో రాణించి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. విద్యార్థులకు క్రీడా శిక్షణ అందించి, వారి ప్రతిభను వెలికితీసిన వ్యాయామ ఉపాధ్యాయులు పీ సదయ్యను అభినందించారు.