Veenavanka | వీణవంక, ఫిబ్రవరి 15 : వీణవంక మండల కేంద్రంలోని అతిపురాతన శివాలయంతో పాటు మండలంలోని నర్సింగాపూర్, వలాపూర్, బేతిగల్, చల్లూరు, ఎలుబాక, మామిడాలపల్లి, రెడ్డిపల్లి, కొండపాక, పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో మహాశివరాత్రిని పురస్కరించుకొని వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. మండల కేంద్రంలో వెయ్యేళ్ల చరిత్ర కలిగిన అతిపురాతన శివాలయంలో ఆలయకమిటీ చైర్మన్ రామిడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ప్రముఖ వేదపండితులు గూడ జగదీశ్వరశర్మ మంత్రాల మధ్య ఉదయం నుండి రాత్రి వరకు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు 500 జంటలు మహారుద్రాభిషేకంలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా శివపార్వతుల కళ్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. అనంతరం అర్థరాత్రి లింగోద్భవం సమయంలో భక్తులు మారేడుదళాలను శివలింగంపై పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారులు సిరిసాన్విక, సాయిదీక్షితల నృత్యప్రదర్శన అందరినీ అలరించాయి.శివనామస్మరణతో ఆలయాలు మారుమ్రోగాయి. ఈ కార్యక్రమంలో ఆయా చోట్ల సర్పంచ్లు, ఆలయ కమిటీ చైర్మన్లు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.