కార్పొరేషన్, ఫిబ్రవరి 26: ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చేలా మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపడుతున్నామని, ఈ పనులు పూర్తయితే అద్భుతమైన పర్యాటక కేంద్రంగా కరీంనగర్ మారుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. మానేరు రివర్ ఫ్రంట్‌లో భాగంగా రూ.69 కోట్లతో చేపట్టే బిగ్ ఓ ఐలాండ్ వాటర్ ఫౌంటేన్ నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి మంత్రి గంగుల ఆదివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరీంనగరాన్ని ఆనుకొని 24 టీఎంసీల రిజర్వాయర్ ఉందని, పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే సీఎం కేసీఆర్ ఆకాంక్ష మేరకు అహ్మదాబాద్‌లోని సబర్మతిని మించి అత్యాధునిక, అత్యంత ఆకర్షణీయంగా మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు. మానేరు ఒకప్పుడు చికెన్ కబేళా, చెత్తాచెదారంతో మురికి కూపంగా మారి ముకుమూసుకుని వెళ్లే దుస్థితిలో ఉండేదన్నారు.
మానేరు పరీవాహక ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రూ.410 కోట్లను మంజూరు చేశారన్నారు. ఈ నిధుల్లో రూ.310 కోట్లు ఇరిగేషన్ శాఖ, రూ.100 కోట్లు పర్యాటక శాఖ ద్వారా మంజూరు చేశారన్నారు. ఇప్పటికే ఆర్అండ్బీ ద్వారా చేపడుతున్న కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేసుకొని డైనమిక్ లైటింగ్‌ను ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో మొదటి దశలో 3.75 కిలోమీటర్ల మేరకు నదికి ఇరువైపులా అభివృద్ధి పనులను చేపట్టడంతో పాటు చెక్ డ్యాం నిర్మాణం చేసుకుంటున్నామన్నారు. కరీంనగరానికి గుర్తింపు తీసుకువచ్చే విధంగా ప్రపంచంలోనే మూడోది, దేశంలోనే మొదటిదైన బిగ్ ఓ వాటర్ ఫౌంటేన్‌ను మానేరు రివర్ ఫ్రంట్‌లో రూ.69 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ఫౌంటేన్‌లో వాటర్ జెట్స్, ఫైయిర్ జెట్స్, లేజర్ షోతో పాటుగా నీటిధారతో ఏర్పడే ప్రొజెక్టర్ ఉంటుందని తెలిపారు. బిగ్ ఓ పైభాగంలో 1600 వాటర్ జెట్లు (నాజల్స్) అన్ని ఒకేసారి పనిచేయడంతో ఆ నీటి ధాటికి స్క్రీన్ ఏర్పడుతుందని, కిందిభాగంలో మరో 550 నాజల్స్ ఉంటాయని తెలిపారు.
ఈ వాటర్ ప్రొజెక్టర్ స్క్రీన్‌ను సుమారుగా అర కిలోమీటర్ నుంచి కిలోమీటర్ దూరం వరకు స్పష్టంగా చూడగలుగుతామన్నారు. దీనిపై 20 నుంచి 25 నిమిషాల నిడివిగల లఘుచిత్రాలను ప్రదర్శించుకోగలుగుతామని, ప్రత్యేక సందర్భాలలో మరికొంత సమయాన్ని కూడా పెంచుకోవచ్చన్నారు. గతంలో నీటిపై ఉండే వాటర్ ఫౌంటేన్లను చూశామని, ఇప్పుడు ఏర్పాటు చేయబోయే వాటర్ ఫౌంటేన్ నీటిపై 140 ఫీట్ల ఎత్తులో ప్రదర్శించగలదని తెలిపారు. బిగ్ ఓలో పైభాగంలో 24 ఫైర్ నాజల్ జెట్స్ ఉంటాయని, కింది భాగం లో 72 ఫైర్ జెట్స్ ఉంటాయని తెలిపారు. వీటి ద్వారా ఫైర్‌కు సంబంధించి షోలను ప్రదర్శించవచ్చన్నారు. దేశంలోనే ప్రపంచస్థాయి పర్యాటకులను ఆకర్శించేలా మానేరు రివర్ ఫ్రంట్‌లో అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ ప్రాజెక్టును వచ్చే 8 నెలల్లో పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ బిగ్ ఓ ఫౌంటేన్‌ను జూన్ 2న ప్రారంభిస్తామన్నారు. ఇందులో బోటింగ్ కోసం ఇప్పటికే రూ.15 కోట్ల చొప్పున రెండు క్రూయిజ్ బోట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో ధైర్యం చేయలేకపోయిందని తెలిపారు. కానీ తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అతి పెద్ద ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చారని పేర్కొన్నారు. ఇప్పటికే భూసేకరణ పనులను పూర్తి చేసుకొని మొదటి దశ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. అన్నింటిని పూర్తి చేసి ఆగస్టులో ప్రారంభించేందుకు దృష్టి సారించామన్నారు. రెండో దశ పనులను త్వరలో చేపట్టి పూర్తి చేస్తామన్నారు.
తెలంగాణలో అతిపెద్ద పర్యాటక కేంద్రంగా ఎంఆర్ఎఫ్: వినోద్‌కుమార్
ప్రపంచస్థాయి ప్రమాణాలతో రూపొందుతున్న మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు తెలంగాణలో అందరినీ ఆకర్షించేలా మంచి పర్యాటక కేంద్రంగా మారుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం పని చేసే వారికే ప్రజలు అధికారం అందించారన్నారు. ఇందుకనుగుణంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. తాము దూరదృష్టితో మానేరు రివర్ ఫ్రంట్‌తో కరీంనగర్‌ను గొప్ప పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. కేసీఆర్ సీఎంగా తొలిసారి కరీంనగర్లో పర్యటించినప్పుడు ఈ ప్రాంతాన్ని డల్లాస్ తీరుగా అభివృద్ధి చేస్తానని చెప్పారని, ఈ మాటలను విపక్షాలు అపహస్యం చేశాయని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టుతో వారికి సమాధానం చెబుతున్నామన్నారు. మంత్రి గంగుల సివిల్ ఇంజినీర్‌గా ఈ ప్రాజెక్టుపై లోతుగా అధ్యయనం చేస్తూ అమలు చేస్తున్నారన్నారు. అల్గునూరును కరీంనగర్లో కలిపినప్పుడు చాలా మంది అడ్డుకునే ప్రయత్నం చేశారని, కానీ అదే అల్గునూర్ ఇప్పుడు గేట్ వే ఆఫ్ కరీంనగర్‌గా అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు.
మానేరు రివర్ ఫ్రంట్ తెలంగాణకే కిరీటం కాబోతుందన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో ఈ ప్రాంతంలోని భూముల ధరలు వెయ్యి రెట్లు పెరిగాయన్నారు. కేబుల్ బ్రిడ్జి వచ్చేదా…? సచ్చేదా ? అంటూ వ్యంగ్యంగా మాట్లాడిన వారు ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నించారు. ఈ ప్రాంతం పర్యాటకంగా సర్క్యూట్‌గా మారుతుందన్నారు. కరీంనగర్‌లోనే వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు ఉందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే అంతర్జాతీయ పర్యాటకులు సైతం కరీంనగర్‌కు వస్తారన్నారు. తాజ్, ఐటీసీ లాంటి గొప్ప సంస్థలు ఇకడ తమ హోటళ్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపారు.
సమైక్య పాలనలో ఇకడి దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలను ప్రచారంలోకి తీసుకురాలేదని, కాని ఇప్పుడు తాము తీసుకువస్తున్నామని తెలిపారు. దేశంలోనే యావత్ తెలంగాణ పర్యాటక కేంద్రంగా ఆవిర్భవించబోతుందన్నారు. సీఎం కేసీఆర్ ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా కరీంనగరాన్ని గొప్పగా తీర్చిదిద్దుతున్న మంత్రి గంగుల కమలాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, మారెట్ కమిటీ చైర్మన్ మధు, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మున్సిపల్ కమిషన్ సేవా ఇస్లావత్, పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు.
జిగేల్ మనిపించే కాంతులు.. కండ్లు చెదిరే ప్రత్యేకతలు
మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా దేశంలోనే తొలి బిగ్ ఓ ఐలాండ్ వాటర్ ఫౌంటేన్ కరీంనగర్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటివి ప్రపంచంలో ఇప్పటి వరకు రెండు ప్రాంతాల్లోనే ఉన్నాయి. మూడోది, దేశంలోనే మొదటి సారిగా కరీంనగర్లో ఏర్పాటు చేయనున్న ఫౌంటేన్‌కు ఆదివారం మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ భూమిపూజ చేశారు. రూ.69 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ పౌంటేన్లో అనేక ప్రత్యేకతలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.