Heart Attack | కరీంనగర్/హుజూరాబాద్ (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు కనకం నాగయ్య (50) మంగళవారం గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందారు. కన్నాపూర్-ముత్తారం గ్రామాల మాజీ ఎంపీటీసీ కనకం వసంత భర్త నాగయ్య, తెలంగాణ మలిదశ ఉద్యమంలో అత్యంత చురుగ్గా పాల్గొన్నారు. 2011లో చేపట్టిన చారిత్రాత్మక ‘సకల జనుల సమ్మె’ సందర్భంగా ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఆయనను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. స్వరాష్ట్ర సాధన కోసం ఆయన అందించిన సేవలు, పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధత స్థానికంగా ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టాయి. నాగయ్యకు భార్య వసంత, ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు.
ప్రముఖుల సంతాపం
కనకం నాగయ్య అకాల మరణం పట్ల బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఆయన మృతి వార్త తెలిసిన వెంటనే మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్, జడ్పీటీసీలు పొద్దుటూరి సంజీవరెడ్డి, లింగంపల్లి శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గంట మహిపాల్ తదితరులు తీవ్ర సంతాపం తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి, పార్టీ బలోపేతానికి నాగయ్య చేసిన సేవలను వారు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, శోకసంద్రంలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు.