Sand loading | పెద్దపల్లి (నమస్తే తెలంగాణ)/ పెద్దపల్లి, జూలై16: తాడిచర్ల బ్లాక్ -2 ముత్తారం మండలం ఖమ్మంపల్లి ఇసుక క్వారీలో ఇసుక వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు మారింది. ఉచితంగా ఇసుక లోడింగ్ చేయాల్సి ఉన్న లారీకి రూ. 3వేల నుంచి రూ.5వేల దాకా ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే లోడింగ్ బంద్ చేస్తామని బెదిస్తున్నారని బాధిత లారీ డ్రైవర్లు అవేదనతో బుధవారం ఖమ్మంపల్లి నుంచి పెద్దపల్లి కలెక్టరేట్‌కు తరలివచ్చి కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఇసుక లారీ డ్రైవర్లు కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు.
‘తాడిచర్ల బ్లాక్ -2 ముత్తారం మండలం ఖమ్మంపల్లి ఇసుక క్వారీలో డబ్బులు ఇస్తేనే లోడింగ్ చేస్తున్నారని, లేకుంటే లోడింగ్ చేయటం లేదు. సిరియల్ ప్రకారం కాకుండా రూ. 5వేలు ఇచ్చిన వారికి లోడిండ్ చేస్తున్నారు. వారం పది రోజులుగా లోడిండ్ కోసం నిరీక్షణ చేస్తున్నామని, స్నానం, తిండికి తిప్పలు పడుతున్నాం. తెచ్చుకున్న బియ్యం, కురగాయలు కూడా అయిపోయినవి. పస్తులుంటున్నాం’ అని హైదరాబాద్ చెందిన ఇసుక లారీ డ్రైవర్లు బుధవారం పెద్దపల్లి కలెక్టరేట్ ముందు ఆందోళన చేశారు.
ప్రాజెక్ట్ ఆఫీసర్(పీవో), కాంట్రాక్టర్, సిబ్బంది కుమ్మకై సిరియల్ను తుగ్గలో తొక్కి అక్రమంగా రూ. 5వేలు తీసుకోని ఇసుక లోడింగ్ చేస్తున్నారని బాధిత లారీ డ్రైవర్లు ఆరోపించారు. అక్రమంగా లోడింగ్ చేయటాన్ని ప్రశ్నిస్తే గత రెండు రోజులుగా సిరియల్ లోడింగ్‌ను బంద్ చేశారని తెలిపారు. సిరియల్ ప్రకారం లోడింగ్ చేయాలని డిమాండ్ చేశారు.
లోడింగ్‌కు రూ. 5వేలు వసూలు.. : తేజోవత్ రాజు నాయక్, లారీ డ్రైవర్, హైదరాబాద్
తాడిచర్ల బ్లాక్ -2 ఖమ్మంపల్లి ఇసుక క్వారీలో రోజుకు 100 లారీల దాకా లోడింగ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం 300 -400 లారీలు సీరియల్లో ఉన్నాయి. ఉచితంగా లోడింగ్ చేయాల్సి ఉన్న సిరియల్లో ఉన్న లారీ కూ లోడింగ్‌కు రూ. 2700, సిరియల్ లేకుండా ఈ రోజు వచ్చిన లారీని ఈ రోజే లోడింగ్ చేస్తే రూ. 5000 తీసుకుంటున్నారు. ఒక రోజులో 50 సిరియల్ లారీలు, మరో 50 సిరియల్ లేని లారీలు లోడింగ్ చేస్తున్నారు. దీంతో సిరియల్లో ఉన్న లారీ డ్రైవర్లు వారం రోజులు నిరిక్షణ చేయాల్సి వస్తుంది.
తిండి, స్నానాకి తిప్పలు.. : నాగుపల్లి నాగరాజు, లారీ డ్రైవర్, హైదరాబాద్
సిరియల్లో ఉంటే వారం రోజుల తర్వాత లోడింగ్ అవుతుంది. వారం రోజులు పాటు తిండికి, స్నానానికి ఇబ్బందులు పడుతున్నాం. తెచ్చుకున్న కురగాయలు, బియ్యం అయ్యే పోతే పస్తులుంటున్నాం. వ్యవసాయ మోటర్ల వద్ద స్నానం చేస్తే రైతులు కోపం చేస్తున్నారు. అక్రమ లోడింగ్‌ను ఆపాలి. పారదర్శకంగా ఉచితంగా లోడింగ్ చేయాలి.