వనాలన్నీ పోర్క పొర్క
మొన్నటి వరకు పచ్చని చెట్లు, ప్రకృతి వనాలు, బృహత్ వనాలు, మంకీఫుడ్ కోర్టులతో అలరారిన పల్లెలు రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో మళ్లీ తమ ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పట్టింపు లేని తనంతో తమ ఆనవాళ్లను కోల్పోయే దుస్థితికి చేరుకున్నాయి. గ్రామ శివారుల్లో వచ్చేవారికి స్వాగతం పలుకుతూ రోడ్లకు ఇరువైపులా పచ్చని చెట్ల వరుసతో కనిపించిన గ్రామాలు మళ్లీ గంగలో కలిసే పరిస్థితి ఎదురైంది.
- కళావిహీనంగా పల్లె ప్రకృతి వనాలు
- సర్కారు నిర్లక్ష్యంతో వాడిపోయిన పచ్చదనం
- రెండేళ్లుగా పాలకవర్గాలు లేక కరువైన పట్టింపు
- ఎండిపోతున్న మొక్కలు
- నరికివేతకు గురవుతున్న చెట్లు
- గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆశయానికి తూట్లు
మొన్నటి వరకు పచ్చని చెట్లు, ప్రకృతి వనాలు, బృహత్ వనాలు, మంకీఫుడ్ కోర్టులతో అలరారిన పల్లెలు రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో మళ్లీ తమ ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పట్టింపు లేని తనంతో తమ ఆనవాళ్లను కోల్పోయే దుస్థితికి చేరుకున్నాయి. గ్రామ శివారుల్లో వచ్చేవారికి స్వాగతం పలుకుతూ రోడ్లకు ఇరువైపులా పచ్చని చెట్ల వరుసతో కనిపించిన గ్రామాలు మళ్లీ గంగలో కలిసే పరిస్థితి ఎదురైంది. ఏ ప్రకృతి వనం చూసినా పొర్క పొర్కగా మారింది. నర్సరీల్లో పెంచిన మొక్కలు ఎండి పోయి పచ్చదనం కనుమరుగవుతున్నది.
– పెద్దపల్లి, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ)

పల్లెల్లో పచ్చదనం మాయమైపోతున్నదని గ్రహించిన కేసీఆర్ ప్రభుత్వం 2015 జూలై 1న హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రామానికో నర్సరీని ఏర్పాటు చేసి, ఎక్కడి మొక్కలు అక్కడే పంచి గ్రామాల్లో పచ్చదనాన్ని పెంచే ప్రయత్నం చేసింది. పంచాయతీ రాజ్ నూతన చట్టం -2018 తెచ్చి మొక్కలు నాటడమేకాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను పంచాయతీలకు అప్పగించింది. దీంతో 2019లో అధికారాన్ని చేపట్టిన పాలకవర్గాలు గ్రామాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు కృషి చేయాల్సి వచ్చింది. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం ప్రతి గ్రామంలో నర్సరీని ఏర్పాటు చేసింది. ఏ గ్రామానికి అవసరమైన మొక్కలు ఆ గ్రామంలోనే పెంచుకుని నాటుకున్నారు. అంతే కాకుండా గ్రామ పంచాయతీలకు ప్రతి నెలా నిధులు విడుదల చేసిన ప్రభుత్వం పచ్చదనం పెంచేందుకు గ్రీన్ ఫండ్‌ను ఏర్పాటు చేసింది.
పంచాయతీలకు వచ్చే నిధుల నుంచి 10 శాతం గ్రీనరీ కోసం ఖర్చు చేయాలని కొత్త చట్టంలో చేర్చింది. దీంతో ఆయా గ్రామాలు, మున్సిపాలిటీల్లో రహదారుల వెంట అవెన్యూ ప్లాంటేషన్, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, కార్యాలయాలు, ఇనిస్టిట్యూషన్, గ్రామంలోని ఇతర భూముల్లో కమ్యూనిటీ ప్లాంటేషన్ పేరిట మూడు ప్రధాన లక్ష్యాలతో మొక్కలు పెంచారు. ప్రతి గ్రామానికి పల్లె పకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఔషధ మొక్కలు పెంచారు. ప్రతి నెలా ప్రత్యేక యాప్ ద్వారా ప్రభుత్వం ఈ కార్యకలాపాలను పర్యవేక్షించారు. ఫలితంగా 2015 నుంచి 2023 వరకు గ్రామాల్లో పచ్చదనం వెల్లి విరిసింది. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారుతున్నది.

.. ఈ కింది కనిపిస్తున్నది ఓదెల మండలం గోపరపల్లిలోని పల్లె ప్రకృతి వనం. ఇది వందలాది మొక్కలతో పచ్చగా ఉండేది. కానీ, ఇప్పుడు ఆలనా.. పాలనా లేక మొక్కలు పూర్తిగా ఎండిపోయి దర్శనమిస్తున్నది.
సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని ఈ పల్లె ప్రకృతి వనం గతంలో పచ్చని చెట్లు, పూల మొక్కలతో ఆహ్లాదాన్ని ఇచ్చింది. పొద్దంతా కూలీ నాలీ చేసుకునే వారంతా కుటుంబాలతో వచ్చి సరదాగా గడిపేవారు. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పర్యవేక్షణ కరువైంది. పట్టించుకునే వారు లేక, నిర్వహణ లోపంతో పిచ్చిమొక్కలు మొలిచి దారి మూసుకు పోయింది.
ఇక్కడ కనిపిస్తున్నది పాలకుర్తి మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనం. ఒకప్పుడు ఆహ్లాదాన్ని పంచే ఈ పల్లె ప్రకృతి వనం నేడు ముళ్లపొదలతో నిండి పోయింది. నిన్నా మొన్నటి వరకూ వర్షాలు పడడంతో పచ్చగా ఉన్నా.. ఆలనా.. పాలనా చూసే వారు లేక ముళ్ల పొదలు, పిచ్చిమొక్కలు భారీగా పెరిగాయి.
గంగాధరలో కళావిహీనంగా..
గంగాధర మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం పరిస్థితి ఇది. ఒకప్పుడు ఎంతో ఆహ్లాదం పంచిన ఈ ప్రకృతి వనంలో ఇప్పుడు అడుగు పెట్టే పరిస్థితి లేదు. వాకింగ్ ట్రాక్ పూర్తిగా చెట్లు, పిచ్చి మొక్కలు, చెత్తా చెదారంతో నిండిపోయింది. ఇక్కడి చెట్లకు నీళ్లు పట్టేవారు లేరు. సంరక్షించేవారు లేరు.
కిష్టంపల్లిలో విచ్చల విడిగా నరికివేత
రామడుగు మండలం వెంకట్రావుపల్లి శివారు గ్రామం కిష్టంపల్లిలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం ఎంతో ఆహ్లాదంగా ఉండేది. గత ప్రభుత్వ హయాంలో ఈ వనాన్ని సంరక్షించేందుకు ఉపాధి కూలీలు పనిచేసే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దీంతో విచ్చలవిడిగా చెట్లను కొట్టేస్తున్నారు. విరిగిన చెట్లను కూడా తొలగించడం లేదు.
నర్సరీల్లో వాడిపోతున్న మొక్కలు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లె ప్రకృతి వనాలను పూర్తిగా విస్మరించింది. ఇప్పుడు వీటి పరిస్థితి అధ్వానంగా మారింది. పల్లె ప్రకృతి వనాల్లో పెరిగిన చెట్లను నరికివేస్తున్నారు. ప్రకృతి వనాల్లో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్‌లు ఆనవాళ్లు కోల్పోయాయి. మొక్కలకు నీళ్లు పట్టేవారు లేకపోవడంతో ఎండిపోయి పొర్కపొర్కగా మారా యి. అనేక నర్సరీల్లో మొక్కలు ఎండిపోయి కనిపిస్తున్నాయి. అందులో ఎంతో విలువైన ఔషధ, పండ్ల మొక్కలు కూడా ఉన్నాయి. కొన్నింటిలో అయితే రెండేళ్లుగా మొక్కలే పెంచడం లేదు. అప్పట్లో ఉపాధి హామీ నిధులతో ప్రతి నర్సరీలో నలుగురైదుగురు వనమాలీలు పని చేసే వారు. ఇప్పుడు అనేక నర్సరీల్లో వారు కనిపించకుండా పోయారు. దీంతో పచ్చదనం పెంచాలనే గత ప్రభుత్వ లక్ష్యానికి గండి పడింది. గత 21నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడంతో పల్లె ప్రకృతి వనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
చామనపల్లిలో పల్లె పక్రకృతి వనం చెట్ల పొదలు, ఎండిన కొమ్మలు, పిచ్చి గడ్డితో నిండిపోయింది. దీంతో విషపురుగులు వస్తుండడంతో గ్రామస్తులు అందులోకి వెళ్లడానికి జంకుతున్నారు. అలాగే చెర్లభూత్కూర్, జూబ్లీనగర్, నగునూర్, ఎలబోతారం, గోపాల్పూర్ గ్రామాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉన్నది.

కేసీఆర్ ప్రభుత్వం గ్రీనరీ కోసం కేటాయించిన నిధులు
- 2019 నుంచి 2023 వరకు కరీంనగర్ జిల్లాకు ప్రతి నెలా సగటున రూ.8.67 కోట్ల నిధులు పంచాయతీలకు జమయ్యేవి. ఏడాదికి రూ.104.04 కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ. 520.20 కోట్ల నిధులు విడుదల చేస్తే.. అందులో గ్రీనరీ కోసం రూ.52.02 కోట్లు ఖర్చు చేసింది.
- జగిత్యాల జిల్లాలోని 20 మండలాల పరిధిలో 385 గ్రామ పంచాయితీలుండగా, వీటికి ప్రతి నెలా రాష్ట్ర ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం నుంచి నేరుగా నిధులు మంజూరయ్యాయి. ఒక వ్యక్తికి ఏడాదికి సగటున రూ.1631 నిధులు మంజూరవగా, ప్రతి గ్రామానికి వచ్చే నిధుల్లో పదిశాతం (రూ.9.7 కోట్లు) నిధులను గ్రీన్ బడ్జెట్‌గా ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచారు. 1683 కిలోమీటర్ల పొడవునా 2,19,089 గుంతలు తీసి మొక్కలు పెంచారు. 380 గ్రామాలతోపాటు హామ్లెట్ గ్రామాలు కలిపి 420 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. వీటిలో 7.70 లక్షల మొక్కలు పెంచారు. రూ.1.83 కోట్ల అంచనాలతో వీటిని పూర్తి చేశారు. నర్సరీలు, పల్లె ప్రకృతివనాలు, బృహత్ ప్రకృతివనాలతో పాటు జగిత్యాల జిల్లాలో ప్రయోగాత్మకంగా మల్యాల, కొడిమ్యాల, జగిత్యాల రూరల్, ధర్మపురి, బుగ్గారం తదితర మండలాల పరిధిలో కోతులకు ఆహారాన్ని ఇచ్చేందుకు 20 చోట్ల రెండు వేల ఎకరాల్లో మంకీఫుడ్ కోర్టులను ఏర్పాటు చేశారు.
- పెద్దపల్లి జిల్లాలోని 263గ్రామ పంచాయతీల్లో 353 పల్లె ప్రకృతి వనాలను 266 నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. ఇందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 6.2కోట్ల గ్రీన్ బడ్జెట్‌ను కేటాయించింది.
- రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 255 గ్రామ పంచాయతీల్లో గత ప్రభుత్వం 267 ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. వీటి కోసం రూ.2.06 కోట్లు ఖర్చు చేసింది. 5,09,828 మొక్కలు నాటించడమే కాకుండా 12 బృహత్ ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. జిల్లాలోని 12 మండలాల్లో పల్లె ప్రకృతి వనాల కోసం మొత్తం 106 ఎకరాలు కేటాయించింది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్‌లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

