జ్యోతినగర్, ఏప్రిల్ 1: రామగుండం ఎన్టీపీసీ 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను విద్యుదుత్పత్తిలో కీలక మైలురాళ్లను అధిగమించింది. నిర్దేశిత వార్షిక లక్ష్యాన్ని చేరుకున్నది. గతేడాది తొలియూనిట్, ఈ యేడాది రెండో యూనిట్‌తో అందుబాటులోకి వచ్చిన 1600మెగావాట్ల తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఈ మార్చి 29 నాటికి 37.12 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి నమోదు చేసింది. అలాగే 2600మెగావాట్ల ఎన్టీపీసీ ప్లాంటులో మార్చి 26 నాటికి 16,645 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయింది.
అందులోని ఏడో యూనిట్ రికార్డు స్థాయిలో 305 రోజుల పాటు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం కొనసాగి ఎన్టీపీసీ వ్యాప్తంగా రెండోస్థానంలో నిలిచింది. అలాగే ఎన్టీపీసీ రిజర్వాయర్‌లోని 100మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంటు వార్షిక లక్ష్యాన్ని అధిగమించింది. 164.21 మిలియన్ యూనిట్లకు గాను 196.17 మిలియన్ యూనిట్ల విద్యుత్ నమోదుతో 15.58శాతం అధిక ఉత్పత్తిని సాధించింది. ఏడేండ్లుగా ఈ ప్లాంటులో 100.4శాతం పీఎల్ఎఫ్ నమోదు అవుతున్నది.