రాజన్న సిరిసిల్ల డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. సెస్పరిధిలోని 13మండలా ల్లో 15 స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా, మంగళవారం తొలిరోజు ఏడు స్థానాలకు 12మంది అభ్యర్థులు 13నామినేషన్లు దాఖలు చేశారు. సెస్ కార్యాలయంలోని పై అంతస్తులోని అతిథి గృహంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యాలయంలో ఎన్నికల అధికారి బీ మమత నామినేషన్ల పత్రాలను స్వీకరించారు. నామినేషన్ల ఘట్టం ప్రారంభం కావడంతో సెస్ కార్యాలయం వద్ద సీఐ అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సెస్ కార్యాలయంలోని పార్కింగ్ స్థలంలో టెంట్లు వేశారు. నామినేషన్ పత్రాలను పరిశీలించిన తర్వాత ఎన్నికల అధికారి వద్దకు అభ్యర్థులను పంపించారు. అభ్యర్థి వెంట బలపరిచిన, ప్రతిపాదించిన వ్యక్తులను మాత్రమే కార్యాలయంలోనికి అనుమతించారు. వివిధ పార్టీల అభ్యర్థులంతా ఊరేగింపుగా ఎన్నికల కార్యాలయానికి చేరుకున్నారు.
13 నామినేషన్లు దాఖలు
మొదటి రోజు కేవలం ఏడు స్థానాల నుంచి మాత్రమే వివిధ పార్టీలు బలపరుస్తున్న 12అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. సిరిసిల్ల 2 స్థానం నుంచి గుర్రం రాజలింగం, నల్ల ప్రదీప్‌కుమార్, బీజేపీ బలపరిచిన అభ్యర్థి రేగులపాటి సుభాష్‌రావు, తంగళ్లపల్లి మండలం నుంచి రంగు అంజయ్య, విశ్వనాథుల రమేశ్, కాంగ్రెస్ అభ్యర్థి జలగం ప్రవీన్ (టోనీ), ఇల్లంతకుంట మండలం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి మల్లుగారి రవీందర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి బెంద్రం తిరుపతిరెడ్డి, కోనరావుపేట మండలం నుంచి బీఎస్పీ అభ్యర్థి పల్లం సత్తయ్య, ఎల్లారెడ్డిపేట మండలం నుంచి బీఎస్పీ అభ్యర్థి నీరటి బాలనర్సు, వేములవాడ 2వ స్థానం నుంచి వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి చొక్కాల రాము, బోయినిపల్లి నుంచి కట్కూరి ఆంజనేయులు నామినేషన్లు దాఖలు చేశారు. కాగా, కోనరావుపేట మండలం నుంచి పల్లం సత్తయ్య రెండు నామినేషన్ సెట్లు దాఖలు చేశారు.
మంగళవారమని..
సెస్ నామినేషన్ల ఘట్టం ప్రారంభమైనప్పటికీ తొలిరోజు తక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. మంగళవారం ఆమంగళమని చాలా మంది అభ్యర్థులు నామినేషన్లు వేయలేదని తెలిసింది. వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులను ఖరారు చేసినప్పటికీ, నామినేషన్లు వేసేందుకు మం చి ముహూర్తం చూసుకుంటున్నారు. 15 స్థానాల్లో కేవలం 7స్థానాల నుంచే నామినేషన్లు వేశారు. తంగళ్లపల్లి, గంభీరావుపేట మండలాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఖరారు కావాల్సి ఉన్నది. మిగిలిన పార్టీలు అభ్యర్థుల పేర్లను బుధవారం ప్రకటించే అవకాశం ఉన్నది. రెండు రోజులే మిగిలినందున నామినేషన్ల జాతర జోరందుకోనున్నది.
ఎన్నికలకు లైన్ క్లియర్..
సెస్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రిజర్వేషన్ల ప్రక్రియలో పారదర్శకత లేదంటూ బోయినపల్లి మం డలం విలాసాగర్‌కు చెందిన కనకయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం విచార ణ చేపట్టిన కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది.
ప్రచారం ప్రారంభం
బీఆర్ఎస్ బలపరిచిన సెస్ డైరెక్టర్ అభ్యర్థి వర్స కృష్ణహరి పక్షాన పలు గ్రామాల్లో ప్రచారం ప్రారంభమైంది. మంగళవారం పలు సంఘాల్లో సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కొండాపురం బాల్‌రెడ్డి ప్రచారం చేశారు. అభ్యర్థి వర్స కృష్ణహరి గ్రామాల్లో ఇంటింటికీ తిరిగారు. మంత్రి కేటీఆర్ సహకారంతో విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.