France Music Fest : ఫ్రాన్స్ (France) లో ఏటా ఎంతో ఉత్సాహంగా జరుపుకునే సంప్రదాయ సంగీత ఉత్సవం (Music Festival) ‘ఫేట్ డి లా ముసిక్ (Fête de la Musique)’ లో తీవ్ర హింస చోటుచేసుకుంది. జూన్ 21న జరిగిన ఈ వేడుకల్లో ఘర్షణలు, దాడులకు పాల్పడిన 243 మందిని ఫ్రాన్స్ పోలీసులు (France Police) అరెస్ట్ చేశారు. తీవ్రమైన ఎండలు, ఉక్కపోత ఉన్నప్పటికీ రికార్డు స్థాయిలో జనాలు వీధుల్లోకి రావడంతో భద్రత కోసం కేవలం పారిస్ నగరం (Paris City) లోనే దాదాపు 5,000 మంది పోలీసులను మోహరించారు. అయినా హింస చెలరేగింది. పారిస్లో ఒక్కరోజే 148 మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ వేడుకల్లో ముఖ్యంగా మహిళలు, బాలికలను లక్ష్యంగా చేసుకుని జరిగిన సిరంజి దాడులు తీవ్ర కలకలం రేపాయి. గుంపుల్లోని ఆకతాయిలు పది మందికి పైగా బాధితులకు బలవంతంగా ఇంజక్షన్లు గుచ్చినట్లు ఫిర్యాదులు వచ్చాయి. బాధితులకు మత్తుమందులు లేదా డేట్-రేప్ డ్రగ్స్ ఏవైనా ఇచ్చారా..? అనే కోణంలో పోలీసులు టాక్సికాలజీ పరీక్షలు జరుపుతున్నారు. వీటితోపాటు రెండు చోట్ల కత్తిపోట్లు, రెండు అత్యాచారాలు, పలు లైంగిక వేధింపులు, దొంగతనాలు జరిగినట్లు అధికారులు ధ్రువీకరించారు. 1982 నుంచి ప్రతి ఏటా ఫ్రాన్స్ వీధుల్లో ఉచితంగా నిర్వహించే ఈ సంగీత ఉత్సవాల్లో గతంలోనూ ఇలాంటి సామాజిక మాధ్యమాల ప్రేరేపిత సూది దాడులు జరిగాయి.
ఈసారి హింస జరిగినప్పటికీ పెద్ద ఎత్తున అల్లర్లు కాకుండా పరిస్థితిని అదుపు చేయగలిగామని, గతంతో పోలిస్తే అరెస్టుల సంఖ్య తక్కువగానే ఉందని ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధులు తెలిపారు. బాధితుల కోసం ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటుచేసి ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు.