Karimnagar | కమాన్ చౌరస్తా, ఫిబ్రవరి 1 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన నేత కేసీర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడమంటే తెలంగాణ సమాజానికి నోటీసులు ఇచ్చినట్లే అని బీఆర్ఎస్వీ నాయకులు తేల్చిచెప్పారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన నేత కేసీర్ పై కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలపై బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శాతవాహన యూనివర్సిటీ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తిగా సహకరిస్తానని కేసీఆర్ వెల్లడించి, సమయం కోరినా ఇవ్వకుండా ఆదివారం విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు రెండో సారి నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని బిఆర్ఎస్వి శాతవాహన యూనివర్సిటీ ఇంచార్జ్ చుక్క శ్రీనివాస్ తేల్చి చెప్పారు.
కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తరు. ఇచ్చిన హామీలు నెరవేర్చని ప్రభుత్వంపై బీఆర్ఎస్ ప్రశ్నించినప్పుడల్లా ఫోన్ ట్యాపింగ్ కేసులు, కాళేశ్వరంపై విచా రణ, ఫార్ములా రేసుపై విచారణ అంటూ రాష్ర్ట ప్రజల దృష్టి మరల్చేలా కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నదన్నారు. సింగరేణిలో జరుగుతున్న వందల కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణం వెలుగులోకి రాగానే.. ఫోన్ ట్యాపింగ్‌పై సిట్ విచారణను తెరపైకి తెచ్చిందని, బొగ్గు కుంభకోణంపై రాష్ర్టం మొత్తం భగ్గుమన్న రోజుల్లో ప్రతిరోజు.. ఓ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఓ రోజు మాజీ మంత్రి హరీశ్ రావు, ఓ రోజు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ఇలా రోజుకొకరిని సిట్ విచారణ పేరిట డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందన్నారు.
సింగరేణి కుంభకోణం వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో పెద్దచిచ్చు పెట్టడం, దీంతో మంత్రుల మధ్య పొరపెచ్చాలు బయటపడడం తట్టుకోలేక.. ఏం లేని లొట్టపీసు కేసు ఫోన్ ట్యాపింగ్‌లో చివరకు బీఆర్ ఎస్ అధినేత, తెలంగాణ రాష్ర్ట సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కేసీర్ కు విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వడంపై యావత్ తెలంగాణ సమాజం, ప్రజలు మండిపడుతున్నారన్నారు.
కేసీఆర్‌పై కేసులు, నోటీసుల పేరిట వేధింపులు, కక్ష సాధింపులకు గురి చేయడం సరికాదంటున్నారు. కక్ష రాజకీయాలకు ముగింపు పలకాలంటూ ఆందోళన చేశారు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు తిప్పనపల్లి ప్రకాష్, పాకాల శ్రీకాంత్, అలవోని శ్రావణ్ కుమార్, కుమ్మరి శివరాం, బుద్దే శశాంక్, పాకాల సాయికృష్ణ, దేవునూరి ఆంజనేయులు, విక్రమ్, అక్షయ్, శ్రీకాంత్, మనోజ్, రాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.