Murder Case | సైదాపూర్, ఆగస్టు 24 : సైదాపూర్ మండలంలోని ఎలబోతారం గ్రామానికి చెందిన వృద్ధురాలి హత్యకేసును చేదించినట్లు హుజురాబాద్ రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. సైదాపూర్ మండలకేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఆయన ఎస్ఐ స్వాతితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివరాలు వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం.. ఎలబోతారం గ్రామానికి చెందిన నూనె వెంకటమ్మ(80) అనే వృద్ధురాలు ఏప్రిల్6న వ్యవసాయబావిలో పడి మృతిచెందింగా కుటుంబసభ్యుల ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశాం. వెంకటమ్మకు గత కొంతకాలంగా అనారోగ్యకారణాలు ఉండడంతో పాటు సంఘటనకు పదిరోజులకు ముందకు పక్షవాతంతో నడువలేని పరిస్థితిలో ఉంది. దీంతో ఆమె వంట చేసుకోకపోవడంతో ఆమెకుమారులు నలుగురు వంతుల వారిగా భోజనం అందించేవారు. కాగా అదే నెల 5న కుటుంబసభ్యుల మధ్య జరిగిన చర్చల్లో వెంకటమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమె ఎవరి ఇంట్లో చనిపోతే వారు ఇల్లు వదిలేయాల్సి వస్తుందని చర్చించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఆమె పెద్ద కుమారుడు నూనె సమ్మయ్య, చిన్న కుమారుడు నూనె శ్రీనివాస్ వృద్ధురాలిని బావిలో పడవేయాలనే పథకంలో భాగంగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో మృతురాలిని ఇంటినుండి తీసుకెల్లి సమీప వ్యవసాయబావిలో పడవేసినట్లు పోలీసులు దర్యాప్తులో నిర్ధారణకు వచ్చింది. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఆమె కనిపించడం లేదని ఆమె కోసం వెతుకుతున్నట్లు నటించి ఆమె గురించి పోలీసులకు తప్పుడు సమాచారమందించారు. కాగా ఈ విషయంపై అనుమానం వచ్చిన పోలీసులు గ్రామంలో పలుమార్లు విచారణ చేపట్టారు. కుటుంబసభ్యులపై నిఘాతో పాటు సంఘటన జరిగిన తీరుపై లోతుగా విశ్లేషించారు. పోలీసుల విచారణలో నిందితుల పాత్రకు సంబంధించిన ఆధారాలు సేకరించారు. దీంతో నిందితులపై నమోదు చేసి అరెస్టు చేసినట్లు సీఐ వెల్లడించారు.