Koppula Eshwar | పెగడపల్లి: ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను ప్రజలు నమ్మి ఓట్లు వేసి మోసపోయారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం రామబడృనిపల్లికి చెందిన మాజీ సర్పంచ్ ఎద్దు మల్లమ్మ, పార్టీ గ్రామ కార్యదర్శి చిలుక రాజిరెడ్డి సహా పలువురు సోమవారం కాంగ్రెస్ పార్టీనీ వీడి, కరీంనగర్ లోని క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ఎన్నికల హామీలను పూర్తిగా విస్మరించిందని, సీఎం రేవంత్ రెడ్డి పాలనతో ప్రజలతో పాటు, స్వంత పార్టీ నాయకులే విసిగిపోతున్నారని వివరించారు. కాంగ్రెస్ పార్టీవీ 420 హామీలేనని, ఆ పార్టీ కార్యకర్తలే పేర్కొంటూ అందులో ఉండలేక పార్టీని వీడి బీఆర్ఎస్ కి వస్తున్నారని తెలిపారు.
రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఒక్క బస్తా కోసం రైతులు రోజుల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొందని మాజీ మంత్రి ఈశ్వర్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు కోరుకంటి రాజేశ్వర్రావు, నాయకులు సాగి శ్రీనివాసరావు, బొల్లవేని మల్లేశం తదితరులు పాల్గొన్నారు.