Karimnagar | | కరీంనగర్ కలెక్టరేట్, సెప్టెంబర్ 19 : మూడేళ్లుగా కొత్త పింఛన్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న పేదల జీవితాల్లోకి ‘చేయూత’ మళ్లీ అడుగుపెట్టింది. కానీ.. ఇది నిజంగా చేయూత అవుతుందా..? లేక దరఖాస్తు తీసుకుని, అర్హత పేరుతో వడపోత చేసి, చివరికి కొద్దిమందికే పింఛన్ ఇచ్చే మరో ప్రభుత్వ ప్రకటనగా మిగిలిపోతుందా? అన్న అనుమానాలు ఆశావహులను వెంటాడుతున్నాయి. 2023 డిసెంబరులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియకు పెద్దగా కదలిక లేకపోవడంతో వేలాది మంది నిరుపేదలు మూడేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు ఆగస్టు 15 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండటంతో వారి ఆశలు మళ్లీ చిగురించాయి. అయితే రాష్ట్రవ్యాప్తంగా కేవలం 2 లక్షల కొత్త పింఛన్లకే పరిమితం చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం ఆ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. కరీంనగర్ జిల్లాలోనే దాదాపు 20 వేల మంది వరకు అర్హులు ఉండే అవకాశముంటే.. రాష్ట్ర కోటా పరిమితుల కారణంగా అందరికీ పింఛన్లు అందే పరిస్థితి కనిపించడం లేదు. అంటే మూడేళ్లు దరఖాస్తుల కోసం ఎదురుచూసిన వారిలోనూ కొందరికే ‘చేయూత’ దక్కనుందన్నమాట. దీంతో దరఖాస్తుదారుల్లో ఆనందం కంటే ‘మన పేరు జాబితాలో ఉంటుందా? లేదా?’ అన్న పెన్షన్ టెన్షన్ ఎక్కువైంది.
ప్రస్తుతం దివ్యాంగులకు నెలకు రూ.4,016, ఇతర అర్హులైన వర్గాలకు రూ.2,016 చొప్పున పింఛన్ అందుతోంది. వృద్ధాప్య పింఛన్‌కు 57 ఏళ్లు, గీత, చేనేత కార్మికులకు 51 ఏళ్ల వయోపరిమితి వంటి గత మార్గదర్శకాలను ప్రాతిపదికగా తీసుకుని అర్హతలను పరిశీలించనున్నారు. గ్రామీణ ప్రాంతాలు, పురపాలికల్లో ఇప్పటికే విచారణ ప్రక్రియ ప్రారంభం కావడంతో దరఖాస్తుదారులు తమ పత్రాలు, వివరాలతో సిద్ధంగా ఉండాల్సి వస్తోంది. పూర్తిగా అర్హులైన వారికే పింఛన్ అందిస్తామంటూ ప్రభుత్వం దరఖాస్తులను 360 డిగ్రీల సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానించింది. సెర్ఫ్ ఆధ్వర్యంలో ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తుల వివరాలను సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసి, ఆధార్ ఆధారంగా వివిధ అంశాలను పరిశీలిస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌లో ‘రిమార్క్స్’గా నమోదైన అభ్యంతరాలను ఆధారంగా చేసుకుని అధికారులు ఇంటింటికీ వెళ్లి వాస్తవ పరిస్థితులను ఆరా తీస్తున్నారు.
అయితే, పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న పేదలకు ఈ విచారణ ప్రక్రియ మరో పరీక్షగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిన్నపాటి వివరాల్లో తేడాలు ఉన్నా, పత్రాల్లో పొరపాట్లు జరిగినా వాటిపై అధికారులు వివరణ కోరుతున్నారు. బ్యాంకు ఖాతా, ఆధార్, రేషన్‌కార్డు నంబర్లలో అచ్చు తప్పులున్నా, దరఖాస్తులు తిరస్కరించడం వివాదాలకు దారితీస్తున్నదని అధికారులు పేర్కొంటున్నారు. ధరఖాస్తుకు జత చేసిన పత్రాలను పరిశీలించి, ఇంటింటికి వెళ్లి అవసరమైన వాటిని తిరిగి సమర్పించాలని సూచిస్తుండగా, దృవీకరణ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.
మరోవైపు ఒంటరి మహిళల దరఖాస్తుల విషయంలో మరింత జాగ్రత్తగా విచారణ చేపట్టి, అందుబాటులో ఉన్న ఆధారాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే సిఫార్సు చేయాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. జిల్లాలో 29వేల పైచిలుకు దరఖాస్తులు రాగ, వీటిలో వితంతు పెన్షన్ల కోసం అత్యధిక దరఖాస్తులు వచ్చాయి. క్షేత్రస్థాయి విచారణ ఈనెల 25 వరకు ముగించనుండగా, అర్హులందరికీ పింఛన్ ఇస్తారా? లేక పరిమిత కోటా పేరుతో వేల మందిని మళ్లీ నిరాశపరుస్తారా? అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్నగా మారిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడేళ్లుగా ఎదురుచూస్తున్న పేదలకు ధరఖాస్తు అవకాశం కల్పించడం గొప్ప ఉపశమనంలా కనిపించినా, చివరికి మంజూరు విషయంలో కోతలు పెడితే ఈ ‘చేయూత’ చేతికందని ద్రాక్షగానే మిగిలిపోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వం నిజంగా పేదల పక్షాన నిలబడాలంటే అర్హుల సంఖ్యకు అనుగుణంగా పింఛన్లను మంజూరు చేయాలని, కోటా పరిమితులు, ప్రాధాన్యక్రమాల పేరుతో అర్హులను మళ్లీ నిరీక్షణలోకి నెట్టకుండా.. మూడేళ్ల పెండింగ్‌కు ఒకేసారి తెరదించాలనే చర్చ జిల్లాలో సాగుతున్నది.