ఓదెల ఆగస్టు 14 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సంజనేష్ బదిలీని రద్దు చేయాలని కోరుతూ గ్రామపంచాయతీ పాలకవర్గం, సర్పంచ్ పల్లె కనకయ్య ఆధ్వర్యంలో డీఎంహెచ్వో పవిత్రకు శుక్రవారం వినతి పత్రాన్ని అందజేశారు. ఇక్కడ గత రెండు సంవత్సరాలుగా డాక్టర్ గా పనిచేస్తున్న సంజనేష్ కుమార్ వైద్య సేవలు సంతృప్తికరంగా ఉన్నాయని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలతో ప్రేమగా మాట్లాడి రోగి సమస్యలను అడిగి తెలుసుకుని పలు సూచనలు, సలహాలతో మందులను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ డాక్టరు బదిలీని వెంటనే రద్దు చేసి తిరిగి కొలనూరులోనే ఉండేట్లు చూడాలని విన్నవించారు. ఇటీవల కొలనూర్ గ్రామానికి వచ్చిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు, అలాగే ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావుకు సైతం గ్రామస్తులు డాక్టర్ ఇక్కడే కొనసాగించాలని కోరారు. డీఎంహెచ్వోను కలిసిన వారిలో వార్డు సభ్యులు బొంగాని రాజయ్య గౌడ్, పాకాల కరుణాకర్ రెడ్డి, పల్లె మధు తదితరులు ఉన్నారు.