Road Accident | హుజూరాబాద్ రూరల్, అక్టోబర్ 4 : కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై ఓమ్ని వ్యాన్ అదుపుతప్పి పంట పొలంలోకి దూసుకెళ్లి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్‌తో పాటు ఎనిమిది మంది గాయాలపాలయ్యారు. ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటన హుజూరాబాద్ మండలం పెద్ద పాపయ్యపల్లి గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది.
హనుమకొండ జిల్లా కొత్తూరు జెండా ప్రాంతానికి చెందిన కూలీలు పనుల నిమిత్తం ఓమ్ని వ్యాన్‌లో కరీంనగర్ వైపు వెళ్తుండగా వాహనం టైరు పగిలి అదుపుతప్పి ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న వారితో పాటు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం తీవ్రంగా గాయపడిన ఐదుగురిని మెరుగైన వైద్యం కోసం వరంగల్‌కు తరలించారు.