Chigurumamidi | చిగురుమామిడి, అక్టోబర్ 3 : చిగురుమామిడి మండలంలోని గాగిరెడ్డిపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమంలో పోషకాహారంపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ సన్నిల్ల కవిత, వైద్యాధికారిని నిహారిక, ఐసీడీఎస్ సూపర్వైజర్ సుల్తానా హాజరయ్యారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి పోషకాహారం ఎంతో ఉపయోగమన్నారు. గర్భిణులు బాలింతలు చిన్నారులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. తల్లులు తీసుకుని ఆహారమే పిల్లల ఎదుగుదలకు ఎంతో ప్రభావం చూపుతోందని అందువల్ల పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ప్రతీరోజు తీసుకోవాలని సూచించారు. చిరుధాన్యాలు ఆకుకూరలు పప్పు ధాన్యాలు పండ్లు కూరగాయలను ఆహారంలో భాగంగా తీసుకోవాలన్నారు.
రక్తహీనత పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రతీ ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. పిల్లలకు మంచి ఆహారపు అలవాటు నేర్పించాలని గర్భిణులు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. చిన్నారులకు సకాలంలో టీకాలు వేయించాలని వ్యాధి నివారణకు టీకాలు ఎంతో దోహదపడతాయన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహార సేవలను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కవిత తో పాటు ఉపసర్పంచ్ నరేందర్ రెడ్డి వార్డు సభ్యులు మంద శ్రీనివాస్, మానస, అన్నవేనీ శ్రీనివాస్, నరసింహ స్వామి, పద్మ, సరస్వతి, రమ, గర్భిణులు, తల్లులు, గ్రామస్తులు పాల్గొన్నారు.