Yellareddypet | ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 4 : రాజన్న సిరిసల్ల జిల్లాలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు పకడ్బందీ చర్యలు నిర్వహిస్తున్నట్లు నార్కోటిక్ పోలీసులు తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు పలు కిరాణా దుకాణాలు, పాన్ డబ్బాల్లో నార్కోటిక్ జాగిలంతో మంగళవారం తనిఖీ చేశారు. డ్రగ్స్, గంజాయి క్రయ, విక్రయాలపై పోలీసులకు వివరాలు తెలపాలని సూచించారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని పాన్ షాపులు, కిరాణా దుకాణాలు, బస్టాండ్ లు వంటి ప్రజా రద్దీ ప్రాంతాలు, విద్యాసంస్థల పరిసరాల్లో నార్కోటిక్ జాగిలాల సహాయంతో తరచూ ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
మత్తు పదార్థాల వల్ల యువత భవిష్యత్ దెబ్బతింటుందని పేర్కొంటూ, వాటి దుష్పరిణామాలపై ప్రజలు, విద్యార్థులు, యువతలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ లేదా గంజాయి విక్రయం, రవాణా, వినియోగానికి సంబంధించిన సమాచారం ఉంటే సమీప పోలీస్ స్టేషన్ కు లేదా తెలంగాణ ఈగల్ ఫోర్స్ హెల్ప్ లైన్ 8712671111కు తెలియ జేయాలని కోరారు. వివరాలు తెలిపిన వారి సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.