Mallapur | మల్లాపూర్, జూలై 30 : గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మల్లాపూర్ మండల కేంద్రంలోని స్థానిక ఆదర్శపాఠశాలకు వెళ్లే దారిలోని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కల్వర్టు పూర్తిగా వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో పాఠశాలలో నైట్ వాచ్ మెన్ గా విధులను నిర్వహిస్తున్న సత్యనారాయణ తన విధులను ముగించుకోని గురువారం ఇంటికి వచ్చే క్రమంలో కల్వర్టు వద్ద వస్తున్న వరదనీటి ఉధృతికి ఒక్కసారిగా భయాందోళనకు గురైయ్యారు.
అక్కడే ఉన్న మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు గమనించి చాకచాక్యంగా ఆయనను సురక్షితంగా బయటకు తీసుకురావడంతో పాటు, సర్పంచ్ తన స్వంత కారులో ఇంటికి పంపించి ఆదర్శంగా నిలిచారు. ఈ కల్వర్టు విషయమై ఇప్పటికే ఉన్నతస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు విన్నవించినప్పటికీ పట్టించుకునే నాథులే కరువయ్యారని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఉపసర్పంచ్ గడ్డం సోమారెడ్డి, వార్డు సభ్యులు ముష్కరి రమేష్, అల్లె లత, ముత్యాల గంగారాజం, శనిగారపు రాజం, మహ్మద్ షబ్బీర్, భూక్యా శేఖర్, సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.