జగిత్యాల కలెక్టరేట్, మార్చి 1: కొండగట్టు దేవస్థానంలో చొరబడి అంజనేయ స్వామికి చెందిన వెండి వస్తువులను ఎత్తుకెళ్లిన దొంగల ముఠాలోని ముగ్గురు చోరులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 5కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ఏ భాస్కర్ వెల్లడించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో బుధవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించి వివరాలు వెల్లడించారు.
కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా ఆరుధ్, ముధోల్ తాలూకాలకు చెందిన బాలీజీ కేశవ రాథోడ్, రామారావు జాదవ్, రాంశెట్టి జాదవ్, విక్రం జాదవ్, నర్సింగ్ జాదవ్, శక్తిజాదవ్, విజయ్‌కుమార్ రాథోడ్ అందరు దగ్గరి సంబంధీకులు. వీరు ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడడం ప్రారంభించారు. కేవలం ఆలయాలను టార్గెట్‌గా చేసుకొని చోరీలకు పాల్పడి ఆలయంలోని వెండి నగలు, వెండి వస్తువులను ఎత్తుకెల్లి నగదుగా మార్చుకుని జీవిస్తున్నారు.
ఈ క్రమంలో జిల్లాలోని కొండగట్టు ఆలయంపై కన్నేసిన ఈ ముఠా గత ఫిబ్రవరి 22న బైక్‌లపై బీదర్ నుంచి బయలు దేరి అదే రోజు సాయంత్రం కొండగట్టుకు చేరుకున్నారు. గుట్టమీదికి చేరుకున్న దొంగలు ఏ1)బాలాజీ కేశవ రాథోడ్, ఏ2) రామారావు జాదవ్, ఏ3)రాంశెట్టి జాదవ్, ఏ4) విక్రం రాథోడ్ అంజన్న భక్తుల మాదిరి కాషాయం, తెల్లప్యాంట్లు ధరించి స్వామిని దర్శించుకుని రాత్రి అక్కడే నిద్రపోయారు. 23న సైతం స్వామివారిని దర్శించుకున్న దొంగలు ఆలయ పరిసరాలను క్షుణ్ణంగా ఆకలింపు చేసుకున్నారు. అదే రోజు అర్దరాత్రి ఒంటి గంట సమయంలో ఆలయం వెనుక ద్వారాన్ని పగులగొట్టి లోపలికి ప్రవేశించారు.
అంజనేయ స్వామి ఆలయంలోని మకరతోరణం, కిరీటం, రెండు శఠగోపాలు, అంజనేయ స్వామి ప్రతిమ, వెండి కిరీటం, వెండి గొడుగు, వెండి పెద్ద రామ రక్ష, రెండు ద్వారాలకు సంబంధించిన కవచాలు మొత్తం 15కిలోల విలువైన వెండి వస్తువులను ఎత్తుకెల్లారు. చోరీ విషయమై 24తెల్లవారు జాము నుంచే విచారణ ప్రారంభించామన్నారు. ఆలయంలోని సీసీ పుటేజీ, దొంగలు సంబంధించిన వేలిముద్రలు సేకరించినట్లు చెప్పారు. అలాగే డాగ్ స్కాడ్లతో తనిఖీలు చేసి క్లూస్ సేకరించి వాటి ఆధారంగా కేవలం 24గంటల్లోనే దొంగలు కర్ణాటక రాష్ట్రం బీదర్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించినట్లు చెప్పారు.
అనంతరం జగిత్యాల డీఎస్పీ ఆర్ ప్రకాశ్ ఆధ్వర్యంలో సీఐలు, ఎస్ఐలు, సిబ్బందితో పది బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేశామన్నారు. అయితే బాలీజీ కేశవ రాథోడ్, రామారావు జాదవ్, రాంశెట్టి జాదవ్, విక్రం రాథోడ్ నేరుగా ఆలయంలో చొరబడగా, వీరికి బయటి నుంచి నర్సింగ్ జాదవ్, శక్తిజాదవ్, విజయ్‌కుమార్ రాథోడ్ సహకరించారని తేలినట్లు వివరించారు. బుధవారం జగిత్యాల రూరల్ మండలం తాటిపెల్లి సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా, ఆర్టీసీ బస్ కోసం రోడ్డుపై వేచిచూస్తున్న సమయంలో బాలాజీ శక్తిజాదవ్, నర్సింగ్ జాదవ్,
విజయ్‌కుమార్ రాథోడ్‌ను అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 3.50లక్షల విలువైన ఐదు కిలోల వెండి వస్తువులు శఠగోపం, పెద్ద రామ రక్ష, రెండు ద్వారాలకు సంబంధించిన కవచాలు, ఒక మోటర్ సైకిల్, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పరారీలో ఉన్న మరో నలుగురు నిందితుల గురించి మూడు బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నామని, త్వరలోనే పట్టుకొని వారి వద్ద ఉన్న వెండి వస్తువులను స్వాధీనం చేసుకుంటామన్నారు. సమావేశంలో జగిత్యాల డీఎస్పీ ఆర్. ప్రకాశ్, మల్యాల, కోరుట్ల సీఐలు రమణమూర్తి, ప్రవీణ్‌కుమార్, అడ్మిన్ ఆర్ఐ వామనమూర్తి, జగిత్యాల రూరల్ ఎస్సై అనిల్‌కుమార్, ఆర్ఎస్సైలు కృష్ణ, మల్లేశ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
24గంటల్లోనే కేసు ఛేదన.. పోలీసులకు రివార్డులు
చోరీ జరిగిన అనంతరం 24 గంటల్లోనే దొంగల ఆచూకీ గుర్తించామని ఎస్పీ తెలిపారు. దొంగలు గతంలో కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డారని, సీసీ పుటేజీలు, వేలి ముద్రలు, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కేవలం 24 గంటల్లోనే కేసును ఛేదించామని, అలాగే ముగ్గురు దొంగలను సైతం అరెస్ట్ చేసి ఐదు కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గడిచిన వారం నుంచి దొంగలను పట్టుకోవడంలో కృషి చేసిన జగిత్యాల డీఎస్పీ ఆర్ ప్రకాశ్, మల్యాల, కోరుట్ల సీఐలు రమణమూర్తి, ప్రవీణ్‌కుమార్, సీసీఎస్, ఐటీకోర్, ఫింగర్‌ప్రింట్స్ ఇన్స్పెక్టర్లు నాగేశ్వర్రావు, సరిలాల్, రాజు, మల్యాల, సీసీఎస్ ఎస్ఐలు చిరంజీవి, సదాకర్, ఆర్ ఎస్ఐలు సుమన్, మల్లేశ్, సీడీఆర్ పీసీ రాజశేఖర్, మహేశ్ పీసీలు తిరుపతి, నాంపెల్లి, మల్లేశ్, నసీర్, రాజేందర్, సుమన్, రఘు, హరి, వేణు, మహేశ్, తిరుపతి, కిరణ్, సంతోష్, రమేశ్, సురేష్‌కు రివార్డులు అందజేస్తున్నట్లు చెప్పారు.