Karimnagar | తెలంగాణ చౌక్, (కరీంనగర్) సెప్టెంబర్ 21 : ప్రత్యేక తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని, పదవుల కంటే ప్రజల ఆకాంక్షలకే ప్రాధాన్యం ఇచ్చిన గొప్ప పోరాటయోధుడని కరీంనగర్ మేయర్ శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ లోని బైపాస్ లోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద గల కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి జిల్లా పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. కాగా ఈ కార్యక్రమానికి మేయర్ శ్రీనివాస్ హాజరై కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పద్మశాలీ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కార్పొరేటర్ వాసాల రమేష్ జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం, కార్పొరేటర్లతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ తొలి దశ నుంచి మలిదశ ఉద్యమం వరకు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను సజీవంగా ఉంచేందుకు బాపూజీ కృషి చేశారని, 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన సమయంలో తన జలదృశ్యం నివాసాన్ని ఉద్యమ కార్యకలాపాలకు ఉపయోగించుకునేలా అందించడం ద్వారా మలిదశ ఉద్యమానికి కూడా తన వంతు సహకారం అందించారని అన్నారు.
తెలంగాణ ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన బాపూజీ 2012లో శాశ్వతంగా మన నుండి వెళ్లిపోయాడని అన్నారు. ఆయన సేవలను గుర్తించి ప్రతి ఏటా జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఆయన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ఆయన ఆశయాలను భావితరాలకు అందించడమే ఆయనకు నిజమైన నివాళి అని మేయర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వాసాల రమేష్, చొప్పరి జయశ్రీ, మాసం గణేష్, తెల్ల లక్ష్మీ రమేష్, దేవసాని సరస్వతి సత్యనారాయణ, వేముల కవిత చంద్రశేఖర్, పడిశెట్టి లక్ష్మీ భూమయ్య, జిల్లా పద్మశాలీ సంఘం అధ్యక్షుడు మెతుకు సత్యం, కోశాధికారి అలసభద్రయ్య, పట్టణ అధ్యక్షుడు గడ్డం శ్రీరాములు, పోపా అధ్యక్షుడు పోలు సత్యనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి వోడ్నాల రవీందర్, ప్రచార కార్యదర్శి మార్త ప్రకాష్, పట్టణ కార్యదర్శి వంగర ఆంజనేయులు, జిల్లా నాయకులు స్వర్గం నర్సయ్య, ఎలిగేటి శ్రీనివాస్, జక్కని ప్రభాకర్, దేవసాని పాపయ్య, గడ్డం వెంకటేశం, మెతుకు కృష్ణ చైతన్య, దీకొండ లక్ష్మీనారాయణ, కలర్ సత్తన్న, అలసత్యం, చిలుక నర్సప్ప, గజవెల్లి కనకయ్య, మెతుకు వంశీకృష్ణ, అరుకాల నాగేందర్, వంగ నాగరాజు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.