Jagthyal | జగిత్యాల, ఫిబ్రవరి 3 : పార్టీ ఫిరాయింపు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో జీవన్ రెడ్డి నివాసం ఎదుట టికెట్ల కేటాయింపుపై అసంతృప్తితో కార్యకర్తలు బండ బూతులు తిడుతూ రెచ్చిపోయారు. జగిత్యాల మున్సిపాలిటీలో టికెట్ల లొల్లి తీవ్ర స్థాయికి చేరింది. మొత్తం 50 సీట్లలో ఫిరాయింపు ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి 30 సీట్లు, సీనియర్ నేత జీవన్ రెడ్డి వర్గానికి కేవలం 20 సీట్లు కేటాయించడంపై జీవన్ రెడ్డి వర్గీయులు తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు.
కండువా మోసిన ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు బీ-ఫాంలు ఇవ్వకుండా, పార్టీ మారిన వారికి ఇచ్చారని జీవన్ రెడ్డి నివాసం వద్ద కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సంజయ్ తమ కడుపు కొట్టాడని ఆరోపించిన ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు, అవసరమైతే ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్‌పై బూతులు తిడుతూ కార్యకర్తలు ఉద్రిక్తంగా ప్రవర్తించారు. టికెట్ల వివాదం నేపథ్యంలో ఎమ్మెల్యే సంజయ్ క్యాంపు కార్యాలయం, ఆయన నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ టికెట్ల విషయంపై జీవన్ రెడ్డి సాయంత్రం 4 గంటలకు ప్రెస్ మీట్ లో మాట్లాడతారని సమాచారం.