Sand, trucks | వీణవంక, జూన్ 25: కొండపాక ఇసుక క్వారీ నుండి వెళ్లే లారీలకు పరదాలు కట్టే అవకాశం కల్పించి ఉపాధి అందించాలని హిమ్మత్‌నగర్ గ్రామస్థులు బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఇసుక క్వారీ నుండి హిమ్మత్‌నగర్ మీదుగా వెళ్తున్న ఇసుక లారీలను అడ్డుకొని నిరసన తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నిరసన కొనసాగగా ఎస్ఐ తిరుపతి ఘటనా స్థలానికి చేరుకొని ఇసుక క్వారీ నిర్వాహకులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని, తెలుపగా నిరసన విరమించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండపాక, హిమ్మత్‌నగర్ రెండు గ్రామాలు ఒకటే రెవెన్యూ కిందకు వస్తాయని, కొండపాక మానేరువాగులో ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ఇసుక క్వారీ నుండి వెళ్లే లారీలకు గత మూడు సంవత్సరాలుగా కేవలం కొండపాక గ్రామస్తులు ఉపాధి పొందుతున్నారని, తమకు కూడా అవకాశం కల్పించాలని హిమ్మత్‌నగర్ వాసులు కోరారు. నిత్యం హిమ్మత్‌నగర్ గ్రామం మీదుగా వెళ్ళే ఇసుక లారీల వల్ల రోడ్డు గుంతలు పడుతుందని, దుమ్ముదూళీతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఇసుక లారీల వల్ల ఇటీవల రెండు ప్రమాదాలు కూడా జరిగాయని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు, క్వారీ నిర్వాహకులు జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామ పెద్దలు, యువకులు, ప్రజలు పాల్గొన్నారు.