Limca Book of Record | సిరిసిల్ల టౌన్, ఆగస్టు 3 : సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్దీ హరిప్రసాద్ మరో అద్భుత సృష్టిని ఆవిష్కరించాడు. అగ్గిపెట్టెలో ఇమిడే చీర, దబ్బనంలో దూర చీర, శాలువాపై కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలు, జీ-20 సదస్సు చిత్రాలు వంటి అనేక అద్భుత వస్త్రాలను గతంలో రూపొందించాడు. లింకా బుక్ రికార్డులో స్థానమే లక్ష్యంగా సోమవారం మరో అద్భుత సృష్టికి శ్రీకారం చుట్టాడు. అనుకున్నదే తడువుగా మగ్గంపై 2:50 గంటల్లోనే 5.50 మీటర్ల పొడవైన పట్టు చీరను తయారుచేసి మరో అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ఈ చీర 5.5 మీటర్ల పొడవు, 45 అంగుళాల వెడల్పు తో 170 గ్రాములు బరువులో ఉంది. ఇదిలా ఉండగా ఈ చీర అగ్గిపెట్టెలో ఇమిడేలా రూపొందించడం మరో అద్భుతమైన విషయం. ఈ చీర తయారీలో సుమారు 10,500 వెస్ట్ (weft) పోగులు, 1,500 వార్పు (warp) పోగులు ఉపయోగించడం విశేషం.
ప్రముఖుల ప్రశంసలు..
ప్రపంచ రికార్డు సాధించడమే లక్ష్యంగా అత్యల్ప సమయంలోనే అగ్గిపెట్టలో ఇమిడే చీరను తయారుచేసిన హరి ప్రసాద్ కు ప్రముఖుల నుండి ప్రశంసలు వెలివేస్తాయి. మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ హరి ప్రసాద్ చీర తయారు చేసే విధానాన్ని పర్యవేక్షించి అభినందనలు తెలిపారు. పట్టణ పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో హరిప్రసాద్ ను శాలువాతో సన్మానించారు.
చేనేతకు అంతర్జాతీయ గుర్తింపు తేవడమే లక్ష్యం.. హరి ప్రసాద్
చేనేత కళకు అంతర్జాతీయ గుర్తింపు తేవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాను. లింకా బుక్, గిన్నిస్ బుక్, ఇండియన్ బుక్ లో స్థానం సంపాదించడం కోసం రెండు గంటల 50నిమిషాల పాటు శ్రమించి ఈ చీరను రూపొందించాను. స్థానిక నాయకుల ప్రశంసలు ఎంతో ప్రోత్సాన్నిచ్చాయి.