సింగరేణిలో సహజసిద్ధంగా లభిస్తున్న బొగ్గు ద్వారా కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నది. అదేసంస్థ మిగులు భూముల్లోని సహజ సిద్ధమైన మొక్కల నడుమ పెరుగుతున్న చీపురు పుల్లల మొక్కలే నిరుపేద గిరిజనులకు ఆదాయ వనరులుగా మారుతున్నాయి. సింగరేణి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మైనింగ్ పరిసర ప్రాంతాల్లో వందలాది ఎకరాలను అటవీ ప్రాంతాలుగా మారుస్తున్నది.
ఆ ప్రాంతంలో దొరికే చీపురు పుల్లల సేకరణనే ప్రధాన వృత్తిగా జిల్లా రామగిరి మండలం యైటింక్లయిన్కాలనీలోని లంబాడీ తండాకు చెందిన పలువురు గిరిజన మహిళలు ఉపాధి పొందుతున్నారు. కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలనే సంకల్పంతో కష్టాన్నే నమ్ముకున్న ఆ మహిళలంతా ప్రతి రోజు చీపురు పుల్లలను సేకరిస్తూ స్వయం ఉపాధి పొందుతున్న వైనంపై ప్రత్యేక కథనం.
– పెద్దపల్లి, డిసెంబర్ 14(నమస్తే తెలంగాణ)
Singareni | పెద్దపల్లి జిల్లా రామగిరి మండం వకీల్పల్లె పూర్తిగా సింగరేణి ఓసీపీ-3 విస్తరణతో భూములు, ఇండ్లు కోల్పోయి నిర్వాసిత గ్రామంగా మారింది. దీంతో చుట్టూరా వందలాది ఎకరాలు బీడు భూములుగా మారాయి. ఈ స్థలాల్లో సింగరేణి గ్రీనరీ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా పెద్ద ఎత్తున మొక్కల పెంపకాన్ని చేపట్టింది. 15 ఏళ్లుగా అటవీ సంపద పెరిగి పూర్తి అభయారణ్యాలుగా మారిపోయాయి. ఈ నేపథ్యంలోనే చెట్ల మధ్యలో అటవీ పండ్లు, ఫలాలకు తోడు చీపురు పుల్లల మొక్కలు సైతం పెద్ద ఎత్తున విస్తరిస్తున్నాయి.
కాల క్రమేణా చీపురు పుల్లల చెట్లు అంతరించి పోతుండగా వాటి స్థానంలో ప్లాస్టిక్ చీపుర్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో పూర్వకాలం నుంచి వినియోగంలో ఉన్న చీపురు కట్టలకు మార్కెట్లో భలే డిమాండ్ కనిపిస్తున్నది. అటవీ గ్రామాలకే పరిమితమైన ఈ చీపురు కట్టలు సింగరేణి ప్రభావిత గ్రామాల్లో సైతం అందుబాటులోకి రావడంతో స్థానికంగా ఉన్న గిరిజన మహిళలు వీటిని సేకరిస్తూ, విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు.
అడవిలో పెరిగి ప్రతీ ఇంటికీ పురాతన కాలం నుంచి శుభ్రం చేసే చీపురుకట్టను ప్రతీ ఇంటి ఇల్లాలు పవిత్రంగా చూసుకుంటుంది. చీపురు కట్ట లేని ఇల్లు అంటూ ఉండదు. గతంలో అడవులు ఎక్కువగా ఉండడంతో గ్రామీణులు చీపురు కట్టలను తయారు చేసి పల్లెల్లో విరివిగా విక్రయించే వారు. అయితే, కాలక్రమేణా అడవులు అంతరించి పోతుండడం, సేకరించే వారు సైతం తక్కువ కావడంతో రూ.6-7ధర పలికిన అడవి చీపురు కట్టలు నేడు రూ.40 వరకు ధర పలుకుతుంది. దీంతో చీపురు పుల్లలు అందుబాటులో ఉన్న పలు గ్రామాల మహిళలు వాటిని సేకరిస్తూ ఉపాధి పొందుతున్నారు.
సింగరేణికి చెందిన వందల ఎకరాల్లో పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా అధికారులు పెద్ద సంఖ్యలో చెట్లను పెంచుతుంటారు. ఓబీ కుప్పలతో పాటు గుంపులు గుంపులుగా ఉండే చెట్లను సింగరేణికి సంబంధించిన ఈ స్థలాలు చెట్లతో అడవిని తలపించే మారాయి. మహిళలు 5 నుంచి 10 మందితో గ్రూపుగా ఏర్పడి పని కష్టాన్ని మరిచి పోయే విధంగా పాటలు.. మాటలతో కాలక్షేపం చేస్తూ.. చీపురు పుల్లలను సేకరిస్తున్నారు. ఇలా సింగరేణి మిగులు భూముల్లో పుల్లల సేకరణకు, అటవీ ఉత్పత్తుల సేకరణకు అనుమతులు ఇచ్చి తమ ఉపాధికి సింగరేణి తోడ్పాటునందించాలని కోరుతున్నారు.
చీపురు పుల్లల సేకరణ చాలా కష్టంతో కూడిన పని. సింగరేణికి సంబంధించిన ఈ స్థలాల్లో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఈ చెట్లతో పాటు సహజంగా పెరిగే చీపురు పుల్లలను ఏరుకొని మేం జీవనోపాధి పొందుతున్నాం. దట్టమైన చెట్లతో ఉండే ప్రదేశంలో పురుగు బుషి బాధ ఎక్కువగానే ఉంటుంది. వాటిని కనిపెట్టకుంటూ చాలా జాగ్రత్తగా పని చేసుకోవాలి. చీపురు పుల్లలు సేకరించే సమయంలో ఆ చెట్టుకు ఉండే ముల్లులు శరీరానికి గుచ్చుతూ గాయం చేస్తాయి. ఎంతో కష్టాన్ని తట్టుకుంటే కానీ ఈ చీపురు పుల్లలను సేకరించలేం.
-రాజమల్లమ్మ, గృహిణి, లంబాడీతండా, యైటింక్లయిన్కాలనీ
చీపురు పుల్లల సేకరణ మా కుటుంబానికి కొంత మేర ఆర్థిక అవసరాలకు అండగా ఉంటుంది. మా తండాకు చెందిన కొంత మందిమి సింగరేణి ఖాళీ స్థలంలో సాధారణంగా పెరిగే ఈ చీపురు పుల్లలను సేకరించుకుంటున్నాం. వీటిని ఇంటికి తీసుకెళ్లి ఎండబెట్టిన తరువాత చీపురు కట్టలుగా తయారు చేస్తాం. కుటుంబ అవసరాలకు ఉంచుకోవడంతో పాటు అవసరమైన వారికి అందజేసి ఆర్థికంగా కొంత మేర నిలదొక్కుకుంటున్నాం.
– రాజమ్మ, గృహిణి, లంబాడీ తండా, యైటింక్లయిన్ కాలనీ
పేద కుటుంబాలకు చెందిన తామంతా పొట్టకూటి కోసం ఇలా చీపురు పుల్లలను పోగుచేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాం. ముల్లులు కుచ్చుతున్నా కూడా పట్టించుకోకుండా కష్టాన్ని భరిస్తూ ఇలా చీపురు పుల్లలను సేకరిస్తున్నాం. వాటిని కట్టలుగా మార్చి విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నాం. సింగరేణి ప్రభావిత ప్రాంతాలకు చెందిన తమకు ప్రభుత్వం లేదా సింగరేణి సంస్థ జీవనోపాధి కోసం మాకు ఏదైనా దారి చూపించి ఆదుకోవాలి.
– లక్ష్మి, గృహిణి, లంబాడీతండా, యైటింక్లయిన్ కాలనీ
సింగరేణికి సంబంధించి ఖాళీ భూముల్లో సహజంగానే ఈ చీపురు పుల్లల మొక్కలు పెరుగుతాయి. వీటిని కొడవళ్లతో కోసి ఇంటికి తీసుకెళ్తాం. ఎండ బెట్టి, కట్టలుగా మార్చుకొని విక్రయిస్తున్నాం. ఇలా ఒక్క కట్ట పుల్లలను చీపురుగా తయారు చేయాలంటే వారం రోజుల పాటు ఎండాలి. అప్పుడే కట్టలుగా కట్టే అవకాశం ఉంటుంది.
-తారమ్మ, గృహిణి, లంబాడీ తండా,యైటింక్లయిన్కాలనీ