విద్యానగర్, సెప్టెంబర్ 28: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన రెండో అంతస్తులో సోమవారం ఉచిత గుండె వ్యాధుల నిర్ధారణ శిబిరం నిర్వహిస్తున్నట్టు రెనే హస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ బంగారి స్వామి తెలిపారు. ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా సివిల్ హాస్పిటల్, జిల్లా పరిపాలన, డీఎంహెచ్వో సమన్వయంతో ఏర్పాటు చేస్తున్నటు చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
రెనే గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శిబిరం ఉంటుందని, అందులో గుండె సంబంధిత సమస్యలపై ప్రముఖ వైద్య నిపుణులు, గుండె శస్త్రచికిత్స నిపుణులు వైద్య పరీక్షలు చేస్తారని తెలిపారు. పెద్దలు, పిల్లలతో సహా అందరికీ ఉచిత గుండె పరీక్షలు, ఉచితంగా మందులు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ శిబిరాన్ని కలెక్టర్ పమేలా సత్పతి, డీఎంహెచ్వో వెంకటరమణ, జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ గుండా వీరారెడ్డి, రెనే హాస్పిటల్ చైర్మన్, ప్రొఫెసర్ డాక్టర్ బంగారి స్వామి, రెనే హస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ రజినీప్రియదర్శిని ప్రారంభించనున్నారు.