Chigurumamidi | చిగురుమామిడి, అక్టోబర్ 8 : అప్రకటిత విద్యుత్ కోతలతో చిగురుమామిడి మండలంలో వరి పంటలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ నాయకులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద బిఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం రాస్తారోకో నిర్వహించారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో సాగు చేసిన పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, మండల పరిషత్ మాజీ వైస్ చైర్మన్ బేతి రాజిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చిగురుమామిడి మండలంలోని సీతారాంపూర్, లంబాడిపల్లి, సుందరగిరి, నవాబుపేట, కొండాపూర్, గాగిరెడ్డిపల్లి, ఉల్లంపల్లి తదితర గ్రామాల్లో విద్యుత్ కోతల ప్రభావంతో పంటలు ఎండిపోతున్నాయని నాయకులు తెలిపారు.
విద్యుత్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి నెలకొందని, గంటల తరబడి సరఫరా నిలిచిపోవడంతో వ్యవసాయ మోటార్లు సైతం కాలిపోతున్నాయని మండిపడ్డారు. విద్యుత్ సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా అందించి వ్యవసాయ రంగానికి అండగా నిలిచారని, పంటలు సస్యశ్యామలంగా పండేవని పేర్కొన్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్రకటిత విద్యుత్ కోతలతో రైతులు సాగు చేసిన పంటలను కాపాడుకోలేని దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గంనకు రాకముందు వ్యవసాయ రంగానికి కరెంటు ఉండేదని, మంత్రి అయిన తర్వాత కరెంటు రైతులకు అందుబాటులో ఉండడం లేదని అన్నారు. పంటలు చేతికొచ్చే సమయంలో కరెంటు కోతలు విధిస్తే రైతు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రైతుల పంటలకు సరిపడా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని, అప్రకటిత కోతలను వెంటనే ఎత్తివేయాలని రైతులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల పక్షాన ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రామంచ సర్పంచ్ ఒంటెల కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రామోజు కృష్ణమాచారి, పెసరి రాజేశం, కత్తుల రమేష్, సన్నీల్ల వెంకటేశం,గిట్ల తిరుపతి రెడ్డి, మహంకాళి కొమురయ్య, బెజ్జంకి రాంబాబు, ఎండీ సర్వర్ పాషా, మిట్టపల్లి మల్లేశం, నాగేల్లి రాజిరెడ్డి, శ్యామకూర సంపత్ రెడ్డి, కల్వల సంపత్ రెడ్డి, కాశబోయిన రాజు, బుర్ర తిరుపతి మల్లికార్జున్ రెడ్డి, యళ్ళ జనార్దన్ రెడ్డి, ముస్కు కిష్టారెడ్డి, తోట శ్రీనివాస్, సాగర్ రెడ్డి, ముస్కు సుధాకర్ రెడ్డి, కిష్టారెడ్డి, దశరథం, శ్రీనివాస్ వివిధ గ్రామాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
ట్రాన్స్కో ఏఈ తో నాయకుల వాగ్వివాదం
వ్యవసాయ రంగానికి సరిపడా విద్యుత్తును ప్రభుత్వం అందించడం లేదని బీఆర్ఎస్ చేపట్టిన రాస్తారోకో సమాచారం చేస్తున్న ట్రాన్స్కో ఏఈ నాయకులకు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు రాస్తారోకో విరమింప చేయమని నాయకులు తేల్చి చెప్పడంతో జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని ఏఈ హామీ ఇచ్చారు. రాస్తారోకో సమాచారం తెలుసుకున్న ఎస్సై జగదీశ్వర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రాస్తారోకో విరమించేందుకు ప్రయత్నించారు. బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే అంతవరకు రాస్తారోకో విరమించేది లేదని కరాకండిగా చెప్పడంతో పోలీసులు బలవంతంగా రోడ్డుపై నుండి పక్కకు తప్పించారు.