క్రికెట్లో కొత్త శకం మొదలుకాబోతున్నది. స్వరాష్ట్రంలో క్రీడారంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర సర్కారు, యువత అమితంగా ఇష్టపడే పరుగుల క్రికెట్‌కు ప్రోత్సాహమిస్తున్నది. గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లాలు, కార్పొరేషన్ల వారీగా సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవలే జీవో జారీ చేయగా, జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా, నగరపాలక స్థాయిలో మున్సిపల్ కమిషనర్ చైర్మన్‌గా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరు సొసైటీలు ఏర్పాటు చేయనుండగా క్రీడాకారుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
కొత్తపల్లి, అక్టోబర్ 20 : క్రికెట్ క్రీడాకారులకు రాష్ట్ర సర్కారు శుభవార్త చెప్పింది. జిల్లాలు, నగరపాలక సంస్థల వారీగా క్రికెట్ సంఘాలను ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా నగరపాలక స్థాయిలో మున్సిపల్ కమిషనర్ చైర్మన్‌గా సంఘాలు ఏర్పాటు కానున్నాయి. త్వరితగతిన సంఘాలను ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రభుత్వం ఇటీవల జీవో విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకోగా, ఇన్నాళ్లూ పట్టణాలకే పరిమితమైన క్రికెట్ ఇక నుంచి గ్రామీణ ప్రాంతాల్లో సైతం వెలుగు వెలిగే అవకాశం ఉంది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరు సంఘాలకు వీలు
ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆరు సంఘాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలో జిల్లా క్రికెట్ సంఘాలు ఏర్పాటు కానుండగా కరీంనగర్, రామగుండం నగరపాలక సంస్థల్లో కార్పొరేషన్ స్థాయి సంఘాలు ఏర్పడనున్నాయి. వారం రోజుల్లో క్రికెట్ సంఘాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇచ్చిన జీవోలో పేర్కొంది.
జిల్లాస్థాయిలో చైర్మన్‌గా కలెక్టర్
జిల్లా స్థాయిలో ఏర్పాటు కానున్న డిస్ట్రిక్ లెవల్ క్రికెట్ అసోసియేషన్‌కు చైర్మన్‌గా జిల్లా కలెక్టర్ వ్యవహరించనున్నారు. వైస్ చైర్మన్‌గా పోలీస్ కమిషనర్ (లేదా) సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వ్యవహరిస్తారు. సభ్యులుగా అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్), అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారి, మెంబర్ కార్యదర్శిగా జిల్లా క్రీడాశాఖ అధికారి వ్యవహరించనున్నారు.
నగరపాలక సంస్థలో చైర్మన్‌గా మున్సిపల్ కమిషనర్..
నగరపాలక సంస్థల్లో ఏర్పాటు కానున్న మున్సిపల్ కార్పొరేషన్ లెవల్ క్రికెట్ అసోసియేషన్‌కు చైర్మన్‌గా మున్సిపల్ కమిషనర్, వైస్ చైర్మన్‌గా సిటీ పోలీస్ కమిషనర్ లేదా డీఎస్పీ లేదా డీసీపీలు వ్యవహరిస్తారు. సభ్యులుగా అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్), రెవెన్యూ డివిజనల్ అధికారి, సిటీ శానిటేషన్ అధికారి, మెంబర్ కార్యదర్శిగా డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ వ్యవహరించనున్నారు.
క్రికెట్‌కు కొత్త వెలుగులు
భారతదేశంలో క్రికెట్‌కు విశేష ఆదరణ ఉన్నది. జిల్లా, నగరపాలక స్థాయిలో క్రికెట్ సంఘాల ఏర్పాటు హర్షనీయం. క్రీడాభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయంగా చెప్పవచ్చు. గ్రామీణ క్రీడాకారుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఇలాంటి నిర్ణయాలు దోహదం చేస్తాయి. ఎంతోమంది క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ప్రతి జిల్లా, నగరపాలకల్లో ఏర్పాటు చేయనున్న క్రికెట్ సంఘాలతో క్రికెట్ క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభ మరింత మెరగవుతుంది.
– నందెల్లి మహిపాల్, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు
ఇది మంచి నిర్ణయం
ప్రభుత్వం, అధికారుల చొరవతో జిల్లా, నగరపాలక సంస్థల్లో ఏర్పాటు కానున్న క్రీడా సంఘాలు పూర్తి పారదర్శకంగా ఉంటాయి. ఇన్ని రోజులు పట్టణాలకే పరిమితమైన క్రేజీ గేమ్ క్రికెట్ ఇక నుంచి పల్లెల్లో కళకళలాడనున్నది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వేలాది మంది క్రికెట్ క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. దేశానికి క్రీడాకారులను అందించే సత్తా తెలంగాణ రాష్ర్టానికి కలుగుతుంది. రాబోయే రోజుల్లో క్రికెట్ క్రీడ మరింత అభివృద్ధి చెందుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
– గసిరెడ్డి జనార్ధన్‌రెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి
క్రికెట్ క్రీడాకారులకు మహర్దశ
క్రికెట్‌పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లా, నగరాల్లో సంఘాలు బలోపేతమవుతాయి. అధికారుల ఆధ్వర్యంలో క్రీడా పోటీల నిర్వహణ, క్రీడాకారుల ఎంపిక పూర్తి నిష్పక్షపాతంగా జరుగుతుంది. జిల్లా కేంద్రాలతో పాటు నగరపాలక స్థాయిల్లో మెరికల్లాంటి క్రీడాకారులు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. క్రికెట్ సంఘాల ఏర్పాటు నిర్ణయం చారిత్రాత్మకం. తెలంగాణలో క్రికెట్‌కు మంచి రోజులు రాబోతున్నాయి.
– చల్ల హరిశంకర్, బేస్‌బాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు