Cheyutha Pension | కోల్ సిటీ, సెప్టెంబర్ 29: చేతిదాకా వచ్చినట్టే వచ్చి.. చేయూత పింఛన్ చేజారిపోతుందా..? అని లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. సమయానికి సదరం సర్టిఫికెట్ అందక జాబితా నుంచి తొలగించే పరిస్థితి ఉండటంతో ఆగమ్యగోచరంగా మారింది. ఈనెల 30తో దరఖాస్తుల పరిశీలన గడువు ముగియనుంది. ఇక్కడే కొంతమంది లబ్ధిదారులకు చిక్కు మొదలైంది. రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో చేయూత పింఛన్ పథకంకు 3563 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ పథకంలో కొత్తగా చేర్చిన పైలేరియా, డయాలసిస్ ఇతర అనారోగ్య బాధితులకు సంబంధించి సదరం సర్టిఫికెట్ ను ప్రామాణికంగా నిర్ధారించడంతో ఇరకాటంలో పడ్డారు.
ప్రస్తుతం కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో వార్డు అధికారులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి క్షేత్ర పరిశీలన చేస్తున్నారు. కాగా, గత వారం రోజుల క్రితం స్థానికంగా జరిగిన సదరమ్ క్యాంపులో అన్ని వైద్య పరీక్షలు చేసిన అధికారులు అర్హులకు సర్టిఫికెట్ జారీకి వారం రోజుల గడువు విధించారు. దీనితో పింఛన్ పథకంకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు పింఛన్ కోల్పోయే పరిస్థితి రావడంతో ఆందోళన చెందుతున్నారు. క్షేత్ర పరిశీలనకు వెళ్లిన వార్డు ఆఫీసర్లు సదరం సర్టిఫికెట్ తప్పనిసరి అని లేదంటే పింఛన్ కు అనర్హులుగా చేస్తామని చెప్పడంతో బాధితులు లబోదిమోమంటూ కార్యాలయంకు పరుగులు తీస్తున్నారు. అధికారుల ముందు తమ గోడు వెల్లబోసుకోగా, సదరం సర్టిఫికెట్ కోసం కేవలం ఒక్కరోజు హోల్డ్ లో పెడుతామనీ, ఆలోగా సర్టిఫికెట్ తీసుకరావాలని చెప్పడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.
ఒక్కరోజులోనే సర్టిఫికెట్ ఎలా తీసుకవాచేది అని వాపోతున్నారు. చేయూత పథకంకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కేవలం ఒక్క సదరం సర్టిఫికెట్ రావడానికి ఆలస్యం కారణంగా పింఛన్ కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై చేయూత పింఛన్ విభాగం ఇన్ఛార్జి సాగర్ ను వివరణ కోరగా, ప్రభుత్వ నిర్దేశిత గడువులోగా సదరం సర్టిఫికెట్ తప్పనిసరిగా అందజేయాలనీ, లేదంటే పెన్షన్ కోల్పోతారని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని పింఛన్ కు దరఖాస్తు చేసుకున్న అనారోగ్య బాధితుల సమస్యను గుర్తించి ఆన్లైన్ ద్వారా సదరం సర్టిఫికెట్ అందించి అడ్డంకులు తొలగించాలని పలువురు లబ్ధిదారులు వేడుకుంటున్నారు.