Kamanpur | కమాన్‌పూర్, సెప్టెంబర్ 19 : ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో నిజమైన నిరుపేదలకు అన్యాయం జరుగుతోందని, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కమాన్‌పూర్ మండల బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కమాన్‌పూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో గల అంబేద్కర్ విగ్రహానికి శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మొదటి, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అర్హులైన నిరుపేదలకు ఇళ్లు దక్కలేదని విమర్శించారు. మంత్రి శ్రీధర్ బాబు పీఏ పంపిన జాబితా ఆధారంగానే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లు ఎంపీడీవో చెప్పినట్లు పత్రికల్లో వచ్చిన వార్తలపై విచారణ చేపట్టాలని, అలాగే ఇండ్ల మంజూరుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలపైనా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
రాజకీయాలకు అతీతంగా అన్ని గ్రామాల్లోని అర్హులైన నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నాయకులు దుష్రచారం మానుకోవాలని హితవు పలికారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజలను మోసం చేస్తూ కాలం గడుపుతున్న కాంగ్రెస్ పార్టీకి రాబోయే కాలంలో తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సంసిద్దంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు తాడికొండ శంకర్, యూత్ మాజీ మండల అధ్యక్షులు బొమ్మగాని అనిల్ గౌడ్, గుర్రం లక్ష్మీమల్లు, మాజీ సర్పంచులు కొండ వెంకటేష్, ఆకుల గట్టయ్య, కొట్టే భూమయ్య, దండే కిషన్, కొయ్యడ రవి, తోట రాజ్‌కుమార్, పెండ్లి నారాయణ, ఎలబోయిన రామ్మూర్తి, నడిగట్టు సంపత్, ఆకుల రమేష్, చిప్పకుర్తి రాజ్ కుమార్, చిప్పకుర్తి శ్రీనివాస్, జాబు సతీష్, రాచకొండ రవి, బోయిని బాలకృష్ణ, పంతకాని రవి, రాజకొండ చంద్రమౌళి, సుధాకర్, మానక ఓదెలు, బొల్లపెల్లి శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.