కాళేశ్వర గంగ ఉప్పొంగింది. అపరభగీరథుడి జల సంకల్పం నెరవేరింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో.. చుక్క నీరు కూడా పడని పరిస్థితుల్లో దిగువ నుంచి ఎగువకు బిరబిరా ఎదురెక్కగా, ఐతుపల్లి చెరువు నిండింది. పునర్జీవ పథకంలో భాగంగా నిండుగా మారిన వరద కాలువ తూము ద్వారా జలాలు తరలివచ్చి రైతన్న ఆశలను సజీవం చేసింది. ఆదివారం పూర్తిగా పెద్ద, చిన్న మత్తళ్లు రెండింటిపై దిగువకు దూకుతూ మద్దులపల్లి, లింగాపూర్ చెరువులవైపు మళ్లగా, వానకోసం ఎదురుచూస్తున్న రైతుల కండ్లలో ఆనందాన్ని నింపింది. ‘కాలం దాటిపోతంది. చుక్క వాన పడలే ఈ సీజన్ ఎట్టా గట్టెక్కేదని మస్తు రందైంది. కానీ కాళేశ్వరం నీళ్లతో వరద కాలువల మీదుగా ఎస్సారెస్పీని నింపుతున్నరని తెలిసి సంబురమైంది. నాలుగురోజుల్లోనే మా చెరువు నిండింది. సాగు, తాగు నీటి బాధ తీరింది. కాళేశ్వరం జలాలు ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు, రాళ్లపల్లి వద్ద వరద కాలువకు తూము ఏర్పాటు చేయించిన కొప్పుల ఈశ్వర్‌కు రుణపడి ఉంటాం’ అని రైతులు చెబుతున్నారు.