Chandurthi | చందుర్తి : వ్యవసాయ విద్యార్థులు గ్రామీణ పరిస్థితులను నేరుగా తెలుసుకోవడం చాలా అవసరమని రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సాయి కుమార్ అన్నారు. గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమం(రావే) లో భాగంగా బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో మూడపల్లి రైతు వేదికలో గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణ పై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు గ్రామంలో వ్యవసాయం, నీటి వనరులు, జనాభా, పంటల పరిస్థితులను విద్యార్థులు ప్రత్యక్షంగా తెలుసుకున్నట్లు తెలిపారు.
అనంతరం గ్రామీణ విశ్లేషణలో భాగంగా గ్రామ పటలం, వెన్ డయాగ్రామ్ పై చార్టులు, చిత్రాల రూపంలో గ్రామ వనరులు, రైతుల వర్గీకరణ నీటి వనరులు, వ్యవసాయ దిగుబడులు, అనుసరించాల్సిన యాజమాన్య పద్ధతులను రైతులకు వివరించారు. రైతులు ఒకే రకమైన పంటను సాగు చేయడం వల్ల భూసారం తగ్గి, పంటలు చీడ, పీడలు పెరిగి దిగుబడి తగ్గుతుంది అని పేర్కొన్నారు. పంటల మార్పిడి విధానం, సమగ్ర వ్యవసాయ పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు డాక్టర్ శ్వేత, అసోసియేట్ డైన్ ఎస్ ఉపేందర్, ఏవో దుర్గా రాజు, ఏఈఓ ప్రవీణ్ కుమార్, కళాశాల విద్యార్థులు ఎం శివాని, వై చరణ్య, నాసీర పీపీ, పీ వైష్ణవి, పీ మధురిమా రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.