ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు వచ్చిన ఆర్డర్లలోని వస్తువుల చోరీ
వాటి స్థానంలో రాళ్లు, చాపతి బండలు, పెంకులు..
కరీంనగర్ జిల్లా సైదాపూర్ కేంద్రంగా అక్రమాలు
వివరాలు వెల్లడించిన ఏసీపీ
సైదాపూర్, ఆగస్టు 29: ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లను మోసగిస్తున్న డెలివరీ బాయ్స్ ఘరానా మోసాలు బట్టబయలయ్యాయి. హుజూరాబాద్ కేంద్రంగా వీరు సాగిస్తున్న దందాను వెలుగులోకి వచ్చింది. ఫ్లిప్‌కార్టు హబ్ టీం లీడర్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. సైదాపూర్ ఠాణాలో హుజూరాబాద్ ఏసీపీ వెంకట్‌రెడ్డి ఆదివారం వివరాలు వెల్లడించారు. సైదాపూర్‌కు చెందిన కల్యాణ్, వికాస్, అనిల్, వినయ్ హుజూరాబాద్‌లోని లార్జ్ లాజిక్ అనే ప్రైవేట్ కంపెనీలో ఫ్లిప్‌కార్ట్ కొరియర్ బాయ్స్‌గా పని చేస్తున్నారు. వీరు సైదాపూర్ ప్రాంతానికి చెందిన బంధువులు, ఫ్రెండ్స్ పేర్లతో ఫ్లిప్‌కార్టులో విలువైన వస్తువులు బుక్ చేసేవారు. వస్తువులు హుజూరాబాద్‌లోని ఫ్లిప్‌కార్ట్ హబ్‌కి రాగానే డెలివరీ కోసం సైదాపూర్‌కు తీసుకువెళ్లేవారు. కస్టమర్ల ఫోన్లు కలువడం లేదని సాకులు చెప్పి రహస్య ప్రాంతాలకు తీసుకెళ్లి పార్సిళ్లను కత్తిరించేవారు. అందులో రాళ్లు, పెంకులు, బండలను పెట్టి ఫ్లిప్‌కార్టు కంపెనీకి రిటర్న్ చేసేవారు. ఆర్డర్లలోని విలువైన వస్తువులు అమ్ముకొనేవారు. అనుమానం వచ్చిన ఫ్లిప్ కార్ట్ హుజూరాబాద్ హబ్ టీం లీడర్ నవీన్ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ఆదివారం ఉదయం 12 గంటలకు నిందితులు మళ్లీ ఇదే తరహా నేరాలు చేయడం కోసం సైదాపూర్ బస్‌స్టాండ్ వద్ద వేచి చూస్తుండగా సైదాపూర్ ఎస్ఐ ప్రశాంత్‌రావు వారిని అదుపులోకి తీసుకున్నారు. వస్తువులను స్వాధీనం చేసుకొని బాధ్యులపై కేసు నమోదు చేశారు.