కరోనా నిబంధనల మేరకు ఆల్బెండజోల్ గోలీల అందజేత
పెద్దపల్లి జంక్షన్, ఆగస్టు 27: జిల్లాలో నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం కరోనా నిబంధనలు పాటిస్తూ సాగుతున్నది. అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఇంటింటికీ తిరుగుతూ 1 -19 ఏండ్లలోపు వారికి ఆల్బెండజోల్ మాత్రలను మింగిస్తున్నారు. ఈ నెల 25-31వ తేదీ దాకా సాగే ఈ కార్యక్రమంలో ఇప్పటి దాకా 87, 991 మందికి గోలీలను పంపిణీ చేశారు.
1,96,785 మంది లక్ష్యం..
నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 1,96,785 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయాలనే లక్ష్యంతో వైద్య ఆరోగ్య శాఖ ముందస్తు ప్రణాళికలు తయారు చేసింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ మాత్రలను పంపిణీ చేస్తున్నారు.
ఇప్పటి దాకా..
జిల్లాలో వైద్యారోగ్యశాఖ ఇప్పటి వరకు 87,991 మంది పిల్లలకు మాత్రలను వేసింది. ఈ నెల 25వ తేదీన 27,994, 26న 31,002, 27న 28, 995 మందికి పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రను వేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్‌కుమార్ వెల్లడించారు. ఆల్బెండజోల్ మాత్రలను ఇంటింటికీ తిరుగుతూ పంపిణీ చేస్తున్నారు. 509 మంది ఆశ కార్యకర్తలు, 706 అంగన్వాడీ టీచర్లతోపాటు ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది పంపిణీ చేసేలా జిల్లా వైద్యారోగ్యశాఖ చర్యలు తీసుకుంటున్నది.