దళితబంధు దేశానికి ఆదర్శం
కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతాడు
ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ గజ్జెల కాంతం
పెద్దపల్లి టౌన్, ఆగస్టు 26: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతి ఇంటికీ రూ.15 లక్షలు ఇస్తామని నేటికీ పంపిణీ చేయకపోగా దళితులపై ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నదని ప్రజాసంఘల జేఏసీ రాష్ట్ర చైర్మన్ గజ్జెల కాంతం మండిపడ్డారు. పెద్దపల్లి ఏంబీ గార్డెన్లో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణలోని దళితుల అభ్యున్నతికి దళితబంధు తీసుకువస్తే అండగా నిలువాల్సిందిపోయి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. అణగారిన వర్గాల ప్రజల కోసం కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకొని ముందుకు పోతుంటే కాం గ్రెస్, బీజేపీలు కుట్రపూరితంగా దళితబంధును పక్కదారి పట్టిస్తున్నాయని, వాటిని దళితులు నమ్మరాదని సూచించారు. బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని, దీనిపై జాతీయ స్థాయిలో ఉద్యమం చేయాలన్నారు. దళితబంధు ఎన్నికల కోసం వచ్చింది కాదని దళితుల అభ్యున్నతికి కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో తీసుకువచ్చారని గుర్తుచేశారు. ఇప్పటి వరకు దేశంలో ఎంతో మంది సీఎంలుగా పని చేశారని, ఏ ఒక్కరైనా ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామని ముందుకొచ్చారా? అని ప్రశ్నించారు. 1990లో వీపీ సింగ్ హయాం లో రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లను పార్లమెంట్లో ప్రవేశపెడితే ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్ర పూరితంగా ఎల్కే అద్వానీతో రథయాత్రలు చేసింది బీజేపీ కాదా? అని ప్రశ్నించారు. బీసీలను మోసం చేసింది బీజేపీ కాదా? అని ప్రశ్నించారు. ఈ విషయంపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ దొంగ యాత్రలను నమ్మరాదన్నారు. ఇక్కడ నాయకులు బొంకూరి సురేందర్, కుక్క చంద్రమౌళి, కొమ్ము తిరుపతి, పొన్నం సత్తయ్య, మంథని లక్ష్మణ్, దేవ భారతి, లక్ష్మి, మల్యాల తిరుపతి, చొప్పదండి లక్ష్మణ్, గందం కిరణ్, ముల్కల రాజుకుమార్, కుమ్మరి అంజయ్య, తాళ్లపల్లి అంజయ్య, సమ్మయ్య, జితేందర్, జింక విఠల్, రవి, శ్రీనివాస్, సుధాకర్, రవిరాజ్, మహేందర్, ప్రణయ్, నిరంజన్ పాల్గొన్నారు.