టీబీజీకేఎస్ ఆర్జీ-3 ఉపాధ్యక్షుడు గౌతం శంకరయ్య
రామగిరి, ఆగస్టు 26: సమైక్య పాలనలో ప్రశ్నార్థకంగా మారిన సింగరేణి సంస్థకు తెలంగాణ రా ష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ పూర్వవైభవం తీసుకువచ్చారని టీబీజీకేఎస్ ఆర్జీ-3 ఉపాధ్యక్షుడు గౌతం శంకరయ్య తెలిపారు. ఈ మేరకు అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టును గురువారం సందర్శించి కార్మిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు కార్మికుల నుంచి వచ్చిన వినతులను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్మికులతో మాట్లాడుతూ, నాడు జాతీయ సంఘాలు వారసత్వ ఉద్యోగాలను తాకట్టు పెట్టి కార్మికులకు తీరని ద్రోహం చేశాయని విమర్శించారు. గుర్తింపు సం ఘంగా టీబీజీకేఎస్ గెలిచిన తర్వాత కోల్బెల్టు ఎం పీలు, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల కవిత సహకారంతో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా, కార్మికులను బార్డర్లో సైనికులుగా గుర్తించి తిరిగి కారుణ్య నియామకాల ద్వారా వెలుగులు నింపారని వివరించారు. దేశంలో ఏ బొగ్గు పరిశ్రమలో లేనివిధంగా కార్మికుల రిటైర్మంట్ వయసును 61 ఏండ్లకు పెంచి ఎంతోమందికి లబ్ధి చేకూరుస్తున్నారని తెలిపారు. దీంతో మరికొంత మంది రిటైర్డు కార్మికుల పిల్లలు ఉద్యోగాల్లో చేరే అవకాశం ఉందని వివరించారు. సింగరేణిలో కార్మికులకు జాతీయ సంఘాల అవసరం లేకుండా తమ యూనియన్ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నదని పేర్కొన్నారు. గుర్తింపు సం ఘం ఎన్నికలు ఎప్పుడొచ్చినా మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఇక్కడ పిట్ సెక్రటరీ దాసరి మల్లేశ్ తదితరులున్నారు.