భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి

- కలెక్టర్ శశాంక
- అధికారులతో సమీక్ష
కరీంనగర్, నమస్తే తెలంగాణ: జిల్లాలో ప్రభుత్వ భూముల సేకరణ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం భూసేకరణపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సేకరించిన భూమికి సంబంధించి లబ్ధిదారులకు అవార్డు పాస్ అయింది లేనిది త్వరగా చెక్ చేసుకోవాలన్నారు. అవార్డులు పాసైన రైతులకు వెంటనే నగదు చెల్లించాలని సూచించారు. రెవెన్యూ, ఇరిగేషన్, ఎస్సారెస్పీ, మధ్య మానేరు వద్ద ఉన్న ప్రభుత్వ భూములను అధికారులు సమన్వయంతో సేకరించి హద్దులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భూములు సేకరించిన వెంటనే పెగ్ మార్క్ అయ్యేలా చూడాలన్నారు. ఎవరైనా ప్రభుత్వ భూములు ఆక్రమించి ఉంటే వాటిని ఖాతాల వారీగా గుర్తించి స్వాధీనం చేసుకోవాలని, సేకరించిన భూములకు, వ్యవసాయ భూములకు తేడా లేకుండా చూసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్‌లాల్, సహాయ కలెక్టర్ అంకిత్, కరీంనగర్, హుజురాబాద్ ఆర్డీఓలు ఆనంద్‌కుమార్, పిబెన్ షలోమ్, ఎస్ఈలు, ఈఈల, ఇరిగేషన్ అధికారులు, తహసీల్దార్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛత-సుస్థిరతపై యూనిసెఫ్ వెబినార్
స్వచ్ఛత-సుస్థిరతపై యూనిసెఫ్ ఎన్ఐఆర్డీ 7వ వాష్ సమ్మేళనాన్ని బుధవారం జూమ్ వెబినార్ ద్వారా నిర్వహించారు. ఈ వెబినార్‌లో తెలంగాణ నుంచి కరీంనగర్ కలెక్టర్ శశాంక, మహబూబ్‌నగర్ కలెక్టర్ వెంకట్రావ్ పాల్గొని వారి జిల్లాల్లో జరుగుతున్న స్వచ్ఛత-సుస్థిరత కార్యక్రమాల గురించి వివరించారు. ఈసందర్భంగా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ, 2017 ఆగస్టు 15న బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా ప్రకటించిన నాటి నుంచి ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యం, పటిష్ట కార్యచరణ ప్రణాళికలు, గ్రామపంచాయతీ, మండల, జిల్లా అధికారుల చొరవతో కరీంనగర్ స్వచ్ఛతలో ముందుంటున్నదని ఉద్ఘాటించారు. ప్రస్తుతం ఓడీఎఫ్ ప్లస్ అనగా చెత్త సేకరణ, మురుగు నీటి, మరుగుదొడ్ల నిర్వహణ, సామాజిక మరుగుదొడ్ల ఏర్పాటుపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఈనెల 5న నిర్వహించే యున్ వలంటీర్ దినోత్సవానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. శిక్షణ కలెక్టర్ అంకిత్, ఎస్బీఎం-యూనిసెఫ్ ప్రతినిధులు కిషన్‌స్వామి, రమేశ్, వేణు, వెంకటేశ్, వలంటీర్లు సత్తినేని శ్రీనివాస్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.