శుక్రవారం 04 డిసెంబర్ 2020
Karimnagar - Oct 21, 2020 , 01:28:46

సంజయ్‌.. దమ్ముంటే సవాల్‌ స్వీకరించు

సంజయ్‌.. దమ్ముంటే సవాల్‌ స్వీకరించు

లేకపోతే పదవులకు రాజీనామా చెయ్‌

నువ్వో అబద్ధాల కోరు

ఆసరా పింఛన్లలో కేంద్రం వాటా ఎంతో చెప్పు

కరీంనగర్‌ ఎంపీపై ధ్వజమెత్తిన నగర మేయర్‌ సునీల్‌రావు

కార్పొరేషన్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌కు దమ్ము, ధైర్యముంటే, ఆయన చేస్తున్న ప్రచారం నిజమే అయితే .. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు చేసిన సవాల్‌ను స్వీకరించాలని నగర మేయర్‌ వై సునీల్‌రావు నిలదీశారు. లేకుంటే పదవులకు రాజీనామా చేయాలన్నారు. ఆయనో అతి పెద్ద అబద్ధాల కోరు అని ధ్వజమెత్తారు. కరీంనగర్‌ జిల్లాకేంద్రంలోని ఎస్‌బీఎస్‌ ఫంక్షన్‌ హాల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఘాటుగా మాట్లాడారు. బండి సంజయ్‌ తీరుపై ధ్వజమెత్తారు. ఎంపీ ఎన్నికల్లో అసత్య ప్రచారంతో గెలిచినట్లే.. మిగిలిన ఎన్నికల్లోనూ గెలుస్తాననే భ్రమలో ఉన్నాడని ఎద్దేవా చేశారు. ప్రజలు వాస్తవాలు గుర్తించారని, తగిన బుద్ధిచెబుతారని హెచ్చరించారు. అబద్ధాలు, అవాస్తవాలను చెప్పడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని మండిపడ్డారు. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో సంజయ్‌ తప్పుడు ప్రచారమే చేశారని, అదే తీరును నేటికీ కొనసాగిస్తున్నారన్నారు. చెప్పేది అంతా తప్పు అని తెలిసినా.. సిగ్గు లజ్జ లేకుండా అసత్య ప్రచారం చేస్తున్న సంజయ్‌ ఇప్పటికైనా ప్రజలకు వాస్తవాలు చెప్పాలని డిమాండ్‌చేశారు. ఆసరా పింఛన్లలో కేంద్ర ప్రభుత్వం 1800, రాష్ట్ర సర్కారు 200 ఇస్తున్నదని ప్రతి ఎన్నికల్లో బీజేపీ ప్రచారం చేస్తున్నదన్నారు. బీజేపీ అంటేనే ఝూటా పార్టీ అని, అబద్ధ్దాలు, అవాస్తవాలు చెప్పే పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ మాత్రమేనని విమర్శించారు. తప్పుడు ప్రచారాలతో ఎంపీగా గెలిచి.. అదే పంథాను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి విజయం సాధిస్తామని భావిస్తే.. అది సంజయ్‌ భ్రమే అవుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏటా 11,724 కోట్లను పింఛన్ల కోసం వెచ్చిస్తున్నదన్నారు. ఇందులో కేంద్రం వాటా కేవలం 210.96 కోట్లు మాత్రమేనని, ఇది వాస్తవం అవునో కాదో దమ్ముంటే సంజయ్‌ ప్రజలకు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. ప్రజల సంక్షేమంపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. కేంద్రం నుంచి 5, 6 వేల కోట్లు తీసుకురావాలని సవాల్‌ విసిరారు. కేంద్రంతో మాట్లాడే దమ్ము ధైర్యం సంజయ్‌కు ఉందా?.. అని ప్రశ్నించారు. ఆయన తీరు చూసి దమ్ములేని ఎంపీ అని ప్రజలు ఇప్పటికే గుర్తించారని విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 36,927 మంది వితంతువులు, 62,383 మంది గీత కార్మికులు, 16,134 పైలేరియా వ్యాధిగ్రస్తులు, 4,21,242 మంది బీడీ కార్మికులు, 1,34,478 మంది ఒంటరి మహిళలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లను అందిస్తున్నదని వివరించారు. పైలేరియా బాధితులకు, బీడీ కార్మికులకు ఏ రాష్ట్రమైనా పింఛన్లు ఇస్తున్నదా చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఏనాడైనా ఒంటరి మహిళలను ఆదుకోవాలని ఆలోచన చేశారా అంటూ నిలదీశారు. కేంద్రం ఇచ్చే నామమాత్రపు పింఛన్లకు సవాలక్ష నిబంధనలు పెడుతుందన్నారు. మీ కేంద్రం లెక్కల ప్రకారం వృద్ధాప్య పింఛన్‌దారులు రాష్ట్రంలో 4,73,575 మంది మాత్రమే ఉంటే.. మానవతా దృక్పథంతో టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం ఉదారంగా 12,07,208 మందికి పింఛన్లు ఇస్తున్న విషయం సంజయ్‌కి కనిపించడం లేదా చెప్పాలన్నారు. కేంద్రం లెక్కల్లో 17,448 మంది దివ్యాంగులు మాత్రమే ఉండగా.. టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం 4,92,197 మందికి పింఛన్లు ఇస్తున్నదన్నారు. దుబ్బాక ఎన్నికల్లో పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలని ప్రయత్నిస్తున్నారని, ప్రజలు మాత్రం అలాంటి బండి సంజయ్‌కు ఓట్లు వేయరని పేర్కొన్నారు. కేసీఆర్‌ కిట్‌ కోసం కేంద్రం 8వేలు ఇస్తున్నట్లుగా బీజేపీ ప్రచారం చేయడం సిగ్గు చేటన్నారు. అసలు ఒక కిట్‌ ధర 2వేలు ఉంటుందని, అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తున్న విషయం కూడా బీజేపీ నాయకులకు తెలియక పోవడం వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. సోషల్‌ మీడియాలో దొంగ పోస్టులు.. తప్పుడు ప్రచారాలు చేస్తున్న బీజేపీ భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు. నిజంగా మీరు చేసేది తప్పుడు ప్రచారం కాకపోతే.. మీరు చెప్పేవి అబద్ధాలు, దగా కోరు ముచ్చట్లు కానట్లయితే.. మంత్రి హరీశ్‌రావు సవాల్‌ను స్వీకరించాలని లేదా ప్రజలకు క్షమాపణచెప్పి.. రాష్ట్ర అధ్యక్ష పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌చేశారు. ఎంపీ ఎన్నికల్లో మీరు చేసిన అబద్ధపు ప్రచారాలకు సంబంధించిన ఆడియో, వీడియో క్లిప్పింగ్స్‌ అన్నీ తమ వద్ద ఉన్నాయన్నారు. ఏడాదిన్నర కాలంలో ఒక్క రూపాయి కూడా అభివృద్ధి కోసం తీసుకురాలేని ఆయనకు అసమర్థ ఎంపీగా ప్రజల్లో ముద్ర పడిందన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ పూర్తి స్థాయిలో ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్నదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో వరదలు వస్తే ఇంటికొచ్చి పడుకున్న నీకు ఇతరులను విమర్శించే నైతిక హక్కులేదని సంజయ్‌పై మండిపడ్డారు. సమావేశంలో కార్పొరేటర్లు వాల రమణారావు, చాడగొండ బుచ్చిరెడ్డి, కుర్ర తిరుపతి, తుల శ్రీదేవి, తోట రాములు, గందె మాధవి, గుగ్గిళ్ల జయశ్రీ, కో ఆప్షన్‌ సభ్యుడు అజిత్‌రావు, నాయకులు అర్ష మల్లేశం, మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు.