మంగళవారం 01 డిసెంబర్ 2020
Karimnagar - Mar 21, 2020 , 02:52:07

భయం వద్దు.. నిర్లక్ష్యమూ వద్దు..

భయం వద్దు.. నిర్లక్ష్యమూ వద్దు..

 • వైరస్‌పై ఆందోళన వద్దు  
 • అప్రమత్తతే అసలు మందు
 • అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు
 • స్వీయ ఆరోగ్య పరిరక్షణ తప్పనిసరి
 • మాస్కులు, వ్యక్తిగత శుభ్రత ఉండాల్సిందే
 • కొవిడ్‌-19 కట్టడికి రాష్ట్ర సర్కారుపకడ్బందీ నివారణ చర్యలు
 • ఊరూరా వివరాలు సేకరిస్తున్న జిల్లా అధికారులు
 • రెండో రోజు నగరంలో50,910 మందికి స్క్రీనింగ్‌ టెస్టులు
 • ఏ ఒక్కరికీ కనిపించని లక్షణాలు
 • అన్ని డివిజన్లలో శానిటేషన్‌ కార్యక్రమాలు
 • దగ్గరుండి పర్యవేక్షిస్తున్న మంత్రి గంగుల
 • 370 మంది విదేశాల నుంచి వచ్చినట్లు గుర్తింపు
 • వారి ఎడమచేయిపై ప్రత్యేక స్టాంపుతో ముద్ర..  హోం క్వారంటైన్‌కే పరిమితం 
 • ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ బృందాలకు ఆదేశాలు
 • సోషల్‌ మీడియా వదంతులపై సీరియస్‌ 
 • అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని సూచన 

కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం రెండో రోజూ కలిసికట్టుగా కదిలింది. వైద్య బృందాలను యథావిధిగా రంగంలోకి దింపి, 13,428 గృహాల్లోని 50,910 మందికి స్క్రీనింగ్‌ టెస్టులు చేసింది. మరోవైపు 950 మందితో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టి, వీధులను శుభ్రం చేయించింది. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచే ఈ వైరస్‌ సోకుతుందని భావించి, మార్చి ఒకటి నుంచి జిల్లాకు చేరిన 371 మందిని గుర్తించి, హోం క్వారంటైన్‌కు పరిమితం చేస్తున్నది. మరోవైపు ఇండోనేషియా వాసులు తిరిగిన ప్రదేశాల్లో ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీములను తిప్పి, 70 మందిని వైద్య పరీక్షల కోసం వివిధ దవాఖానలకు పంపించింది.

కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ‘వ్యక్తిగత పరిశుభ్రత, వ్యక్తిగత నియంత్రణ, వ్యక్తిగత క్రమశిక్షణ.. పాటించడమే కరోనా కట్టడికి సరైన పరిష్కారం. అన్నింటికీ మించి అప్రమత్తతే అసలైన మందు. మాకేమయితదిలే అన్న నిర్లక్ష్యం అసలే వద్దు.’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్బోధించారు. సీఎం చెప్పినట్లుగానే మనకు మనం ముందు జాగ్రత్తలు తీసుకోవడం, అవసరమైతే తప్ప బయటకు రాకపోవడం, తరచుగా చేతులు శుభ్రం చేసుకోడం, మాస్కులు ధరించడమే మనకు శ్రీరామరక్ష. విదేశాల నుంచి వచ్చిన వారు 14 రోజులు స్వీయ నిర్బంధం చేసుకుంటే వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉంటుంది. అప్పుడే కొవిడ్‌ కట్టడి సాధ్యమవుతుంది.

50,910 మందికి స్క్రీనింగ్‌..

జిల్లాలో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నది. మంత్రి గంగుల కమలాకర్‌, కలెక్టర్‌ శశాంక, సీపీ కమలాసన్‌రెడ్డి ఎప్పటికప్పుడు సంబంధిత అధికార యంత్రాంగానికి సూచనలు, సలహాలు ఇస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నివారణ కోసం వంద వైద్య బృందాలను వినియోగిస్తూ ఆరోగ్య స్థితిగతులపై సర్వేతోపాటు ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నారు. మొదటి రోజు 6,124 గృహాల్లో 25వేల మందికి స్క్రీనింగ్‌ పరీక్షలు చేయగా, రెండోరోజు శుక్రవారం 13,428 ఇండ్లల్లో 50,910 మందికి స్క్రీనింగ్‌ చేపట్టారు. ఇందులో 23 మంది విదేశాల నుంచి వచ్చినట్లు గుర్తించా రు. మరో 11 మందికి చిన్న ఆరోగ్య సమస్యలున్నట్లు గుర్తించి, పరీక్షల కోసం చల్మెడ వైద్యశాలకు పంపించారు. దీంతోపాటు ఇండోనేషియా నుంచి వచ్చిన మత ప్రచారకులు తిరిగినట్లు గుర్తించిన ప్రాంతాల్లో శుక్రవారం ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీంలను రంగంలోకి దించారు. ఆ మేరకు 70 మందిని వైద్య పరీక్షల కోసం వివిధ దవాఖానలకు పంపించారు. 

విదేశాల నుంచి వచ్చిన వారిపై నిఘా

విదేశాల నుంచి వచ్చిన వారిపై నిఘా పెట్టారు. ప్రధానంగా విదేశాల నుంచి వస్తున్న వారికి ఈ వైరస్‌ ఎక్కువగా సోకే అవకాశం ఉందని గుర్తించి, మంత్రి గంగుల ఆదేశాలతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి జిల్లాకు వచ్చిన వారి జాబితా తెప్పించారు. మార్చి ఒకటి నుంచి నేటి వరకు 371 మంది వచ్చినట్లు గుర్తించారు. ఆ మేరకు సంబంధిత వ్య క్తుల ఎడమచేయిపై ప్రత్యేకంగా తయారు చేసిన స్టాంపును ము ద్రించడంతో పాటు.. వారిని 15 రోజుల పాటు హోం క్వారంటైన్‌కు పరిమితం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రక్రియను శని వారం జిల్లావ్యాప్తంగా పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. ముద్ర ఉన్న వారు ఎవరైనా బయట తిరిగితే సంబంధిత అధికారులకు సమా చారం అందించాలని సూచించారు. 

ముమ్మరంగా శానిటేషన్‌ కార్యక్రమాలు..

నగరంలోని 60 డివిజన్లలో పారిశుధ్య కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టారు. 950 మంది కార్మికులతో శుభ్రత పనులు చేయించారు. శ నివారం నుంచి కాంట్రాక్టు పద్ధతిలో మరో 200 మందిని తీసుకొని పారిశుధ్య పనులు చేయిస్తున్నట్లుగా మేయర్‌ సునీల్‌రావు తెలిపారు. కాగా, చాలా ప్రాంతాల్లో రోడ్లు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. దుకాణాలు మూసివేసి వేయగా, కార్యాలయాలు బోసి పోయాయి.  

తప్పుడు ప్రచారాలపై సీరియస్‌..

కరోనాపై సోషల్‌ మీడియాలో వదంతులపై సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్‌ తీవ్రంగా స్పందించారు. కరోనాపై సోషల్‌ మీడియా వేదికగా కొంత మంది వదంతులు సృష్టిస్తున్నారని, వారిపై విచారణ సాగు తుందన్నారు. ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే సదరు స మాచారాన్ని జిల్లా పోలీసులకు తెలుపాలని కోరారు. ప్రతి రోజు కరీంనగర్‌లో కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలపై అధికారింగా బులిటెన్‌ విడుదల చేస్తున్నామని, దయచేసి అందరూ అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని విజ్ఞప్తి చేశారు. వదంతులను నమ్మి ఎవరూ ఆగం కావద్దని విజ్ఞప్తి చేశారు. ఇండోనేషియా వాసులు కలిసిన, నివాసమున్న కుటుంబాల నుంచి 20మంది వ్యక్తులను గాంధీ వైద్యశాలకు పం పించగా, కరోనా లక్షణాలు లేవని రిపోర్టు వచ్చిందని తెలిపారు. నగ రంలోని ప్రతి ఇంట్లోనూ స్క్రీనింగ్‌ నిర్వహిస్తామని, వైద్య బృం దాలకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తప్పుడు ప్రచా రాలపై కలెక్టర్‌ శశాంక కూడా సీరియస్‌ అయ్యారు. కరీంనగర్‌లో 144 సెక్షన్‌ అమలులో ఉందంటూ శుక్రవారం ఒక దినపత్రిక (నమస్తే తెలంగాణ కాదు)లో వచ్చిన వార్తలో నిజం లేదని స్పష్టం చేశారు. కరోనా వైరస్‌పై భయ భ్రాంతులకు గురి చేస్తూ తప్పుడు వార్తలు ప్రచురిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని 

హెచ్చరించారు. 

సీఎం పర్యటన వాయిదా

 • స్క్రీనింగ్‌ పరీక్షలకు అసౌకర్యం  కలగకుండా  ఉండేందుకు నిర్ణయం

కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌ పర్యటన వాయిదా పడింది. దేశవ్యాప్తంగా ప్రబలుతున్న కరోనా వైరస్‌ను అరికట్టడంలో ముందంజలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజల్లో మరింత భరోసా నింపేందుకు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరీంనగర్‌ పర్యటనకు పూనుకున్నారు. కాగా.. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం పర్యటన వల్ల అక్కడ భారీ స్థాయిలో జరుగుతున్న స్క్రీనింగ్‌, వైద్య ఏర్పాట్లకు అసౌకర్యం కలగకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ జిల్లా యంత్రాంగం, వైద్య శాఖ ఉన్నతాధికారులు, తదితరుల సూచనల మేరకు శనివారం సీఎం చేపట్టాల్సిన కరీంనగర్‌ పర్యటన వాయిదా పడింది. ఇప్పటికే శుక్రవారం సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో కరోనా పరిస్థితి సహా కరీంనగర్‌లో జరుగుతున్న వైద్య ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌తో ఎప్పటికప్పుడు పలుమార్లు ఆరా తీశారు. వారు కూడా కరీంనగర్‌లో జరుగుతున్న ఏర్పాట్ల విషయంలో ముఖ్యమంత్రికి భరోసానివ్వడమే కాకుండా.. పర్యటనను వాయిదా చేసుకోవాలని కోరడంతో సీఎం పర్యటన వాయిదా పడింది.

హోం క్వారంటైన్‌ సూచనలు

 1. సదరు వ్యక్తి అటాచ్డ్‌ టాయిలెట్‌, బాగా వెంటిలేషన్‌ ఉన్న ఒకే గదిలో ఉండాలి. అతడి కదిలికలు గది వరకే పరిమితం కావాలి
 2. మరో కుటుంబ సభ్యుడు కూడా అదే గదిలో ఉండాల్సిన అవసరముంటే ఇద్దరి మధ్యా కనీసం ఒక మీటర్‌ దూరం ఉండాలి.
 3. వృద్ధులు, గర్భిణులు, పిల్లలకు, ఇంట్లో ఉన్న ఇతర వ్యక్తులకు దూరంగా ఉండాలి.
 4. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ సామజిక, మతపరమైన సమావేశాలకు కావద్దు.
 5. సబ్బు నీటితో లేదా ఆల్కహాల్‌ ఆధారిత ద్రావణం, హ్యాండ్‌ శానిటైజర్‌తో తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి.
 6. సదరు వ్యక్తి ఉపయోగించిన వస్తువులు మిగిలిన కుటుంబ సభ్యులు ఉపయోగించరాదు.
 7. అన్ని సమయాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. నోరు, ముక్కును పూర్తిగా కప్పివేసే విధంగా ఉండాలి. మాస్కును ప్రతి ఆరు నుంచి ఎనిమిది గంటలకోసారి మార్చుకోవాలి. వాడిన మాస్కులను తిరిగి వాడరాదు.
 8. దగ్గు, జ్వరంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలిగితే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రానికి తెలియచేయాలి. లేదా 011-23978046కు లేదా 104కు కాల్‌ చేయాలి.

సంరక్షకులు తీసుకోవాల్సిన చర్యలు 

 1. సంరక్షణలో ఉన్న వ్యక్తిని జాగ్రత్తగా చూసుకోవాలి.
 2. సంరక్షణ కోసం కుటుంబంలో ఎవరో ఒక్కరినే నియమించాలి.
 3. ప్రత్యేకంగా ఇతరులతో కలవకుండా చూడాలి.
 4. పరిసరాలు శుభ్ర పరిచే సందర్భాల్లో చేతి తొడుగులు ఉపయోగించాలి. శుభ్రం చేసిన తర్వాత చేతులను సబ్బు, శానిటైజర్లతో శుభ్రం చేసుకోవాలి.
 5. సందర్శకులను లోనికి అనుమతించకూడదు. 
 6. సదరు వ్యక్తికి వ్యాధి లక్షణాలు కనిపిస్తే వైద్యుల నివేదిక ప్రతికూలంగా తేలేదాకా సంరక్షణలోనే ఉండేలా చూడాలి.

కరోనా వైరస్‌ అంటే..

కరోనా.. శ్వాస సంబంధ వ్యాధులను కలుగజేసే ఒక రకమైన వైరస్‌ (కొవిడ్‌-19). చైనా దేశంలోని పూహాన్‌ నగరంలో బయటపడిన ఈ వైరస్‌, ప్రపంచమంతా విస్తరిస్తున్నది. తుమ్ములు, దగ్గు, తుంపరల ద్వారా మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తున్నది. తుంపరలు ఒక వ్యక్తి వస్తువులపై లేదా దుస్తులపై పడినప్పుడు ఆరోగ్యవంతులు ముట్టుకోవడం, కరచాలనం, తాకడం ద్వారా లేదా అదే చేతులతో ముక్కు, నోరు, కళ్లను తాకడం ద్వారా సంక్రమిస్తుంది.

ఇవీ లక్షణాలు

జ్వరం, అలసట, పొడి దగ్గు సాధారణ లక్షణాలు, గొంతు నొప్పి, ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, ఒంటి నొప్పులు, విరేచనాలు కూడా ఉండవచ్చు. కొంత మందికి వ్యాధి సోకినప్పటికీ ఎలాంటి లక్షణాలు కనిపించవు. దాదాపు 80% మం దికి ఎటువంటి ప్రత్యేక చికిత్స లేకుండానే తగ్గిపోతుంది. వృద్ధులు, అధిక రక్తపోటు, మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు ఉన్న వారికి ఈ వ్యాధి తీవ్రత ఎక్కువ ఉంటుంది. చాలా అరుదుగా మాత్రమే ప్రాణాంతకం కావచ్చు.  

మాస్క్‌ తప్పనిసరి..

ప్రయాణాలు, రద్దీ ప్రాంతాల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ మాస్కులు వాడాలి. శ్వాస సంబంధ లక్షణాలు (దగ్గు, జలుబు, తుమ్ములు) ఉంటే కచ్చితంగా ధరించాలి. వ్యాధిగ్రస్తులకు పరిచర్యలు చేసే వారు కూడా వాడాలి. పలుచని మాస్క్‌లను కాకుండా మేలి రకమైన, కాస్త మందపాటివి ధరించాలి. వాటిని వాడే ముందు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. చిరుగులు, రంధ్రాలు లేని మాస్క్‌ని మెటల్‌ స్ట్రిప్‌ పై వైపు ఉండేలా ధరించాలి. ముఖానికి మెటల్‌ స్ట్రిప్‌ ముక్కు ఆకారానికి వచ్చేలా ధరించాలి. కింది భాగం నోరు. గదవ భావం కప్పేలా చూడాలి. వాడిన తర్వాత చెవికి గల ఎలాస్టిక్‌ లూప్‌ను పట్టుకొని ముఖానికి దూరంగా లాగి తీయాలి. వాడిన వెంటనే మూతగల చెత్త డబ్బాలో వేయాలి. తర్వాత చేతులు శుభ్రంగా కడగాలి. మాస్క్‌లు అందుబాటులో లేకుంటే కనీసం ఖర్చీఫ్‌, లేకుంటే చీర కొంగులనైనా ముఖానికి అడ్డంగా పెట్టుకోవాలి.

వ్యక్తిగత శుభ్రత ముఖ్యం.. 

వ్యక్తిగత శుభ్రత, వ్యక్తిగత నియంత్రణ, వ్యక్తిగత క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలి. ప్రధానంగా చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలి. రోజుకు ఆరు నుంచి ఎనిమిది సార్లు మోచేతి వరకు క్లీన్‌ చేసుకోవాలి. సబ్బును లేదా శానిటైజర్‌ను వాడాలి. శ్వాసకోశ వ్యాధి లక్షణాలు ఉన్న వారికి ఒక మీటర్‌ దూరంలో ఉండాలి. కళ్లు, ముక్కు, నోరును చేతులతో తరచుగా తాకవద్దు. శ్వాస సంబంధ వ్యాధులు బాధిస్తున్నప్పుడు వైద్యులను సంప్రదించాలి. సలహాలు, సూచనలు పాటించాలి.

విదేశాల నుంచి వస్తే స్వీయ నిర్బంధం

ఈ వైరస్‌ ఎక్కువగా విదేశాల నుంచి వచ్చిన వారిలోనే కనిపిస్తున్నది. అందుకే ఎవరైనా విదేశాల నుంచి వస్తే 14 రోజులపాటు స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధం చేసుకోవాలి. లక్షణాలు ఉన్నా లేకున్నా ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలి. ఇతరులను కలువరాదు. వైద్యుల సూచనలు పాటించాలి. వ్యాధి తీవ్రమైతే వైద్య సహాయం పొందాలి. కలిసి పని చేసిన వారు లేదా ప్రయాణించిన వారితోపాటు సహాయక చర్యలు అందించిన వారికి జాగ్రత్తలు చెప్పాలి.

ప్రయాణాలు వద్దు..

సెలవులు ఇచ్చారని ఏ ప్రయాణాలూ పెట్టుకోవద్దు. అత్యవసరమైతే తప్ప బస్సులు, రైళ్లలో ప్రయాణం చేయవద్దు. రద్దీ ప్రాంతాలకు వెళ్లకూడదు. గుంపులు గుంపులుగా ఉండద్దు. ఉత్సవాలు, శుభకార్యాలను కొద్ది రోజుల పాటు వాయిదా వేసుకోవాలి. ఒకవేళ ముందే బుక్‌ చేసుకున్న శుభకార్యాలకు ఎక్కువ మందిని పిలవకపోవడం ఉత్తమం. ఫంక్షన్లకు వెళ్లాల్సి వస్తే తగు జాగ్రత్తలు పాటించాలి. ముఖానికి మాస్కులు ధరించి వెళ్లాలి. ఆఫీసులు, ఇతర ఉపాధి పనులు చేసే చోట ఉద్యోగులు తగు జాగ్రత్తలు పాటించాలి. ఎవరికైనా జలుబు, దగ్గు లక్షణాలు ఉంటే దూరంగా ఉండాలి.